రేవంత్కు అగ్నిపరీక్షగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహంపై కసరత్తు ప్రారంభించాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, వరంగల్-ఖమ్మం -నల్గొండ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి నాటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణీదేవి, తీన్మార్ మల్లన్నల పదవీ కాలం 2027 మార్చి 29తో ముగియనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఇటీవల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత వస్తున్న తొలి కీలక పట్టభద్రుల ఎన్నికలు కావడంతో అధికార కాంగ్రెస్, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎలాగైనా రెండు స్థానాలను చేజిక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే, అభ్యర్థుల ఎంపిక నుండి మంత్రివర్గ సమావేశంలో ఆయన చేసిన వాఖ్యలు వరకు కాంగ్రెస్ శ్రేణులను నిరుత్సాహ పరుస్తున్నాయి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు అభ్యర్థులుగా సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అందరికంటే ముందుగా ప్రకటించింది. రామ్మోహన్ రెడ్డి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం నుండి పోటీ చేయనుండగా, సర్వోత్తమ్ రెడ్డి వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానం నుండి బరిలోకి దిగనున్నారు. అయితే, వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ మరుసటి రోజే మంత్రివర్గ సమావేశంలో కొందరు మంత్రులు పెదవి విరిచినట్టు వార్తలు వచ్చాయి. పైగా, ఇటీవల జరిపిన ఓ అంతర్గత సర్వేలో పార్టీ మద్దతు శాతం రాష్ట్రంలో 32కు పడిపోయిందని ఓ మంత్రి గుర్తు చేయడం కలకలం రేపింది. అటువంటప్పుడు, అందరం కలిసి అభ్యర్థులను గెలిపించుకుందామని ప్రోత్సహించాల్సిన ముఖ్యమంత్రి ఇద్దరు అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదే అంటూ తనకేమీ పట్టనట్లు మాట్లాడటం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లను చేర్పించడం కీలకంగా మారుతుంది. అయితే, ఎక్కడ కూడా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్యెల్యేలు ఓటర్లను చేర్పించడం పట్ల అంతగా ఆసక్తి చూపుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
అభ్యర్థుల ఎంపిక పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి బీసీ అంటూ ఓ ప్రకటన చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఓ వంక రేవంత్ రెడ్డి చెప్పుకొంటుండగా, మరోవంక కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర అసంతృప్తి పెరుగుతున్నట్లు అంతర్గత సర్వేలే స్పష్టం చేస్తుండగా బీసీ ముఖ్యమంత్రిని ఎప్పుడు చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. పైగా, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని బీసీలలో నెలకొన్న అసంతృప్తిని పోగొట్టేందుకు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలు వారికిస్తామని, ఇద్దరు బీసీలను ఎమ్మెల్సీగా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బీసీ రేజర్వేషన్ల పేరుతో తమను మోసం చేయడంతో పాటు మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వలేదని, ఉన్న బీసీ మంత్రులను తరచూ అవమానాలకు గురిచేస్తున్నారని, నామినేటెడ్ పదవులలో సైతం న్యాయం చేయడం లేదని బీసీ వర్గాలలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. అటువంటి సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు ఏ విధంగా వ్యవహరిస్తారో అని ఆ పార్టీ వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నది. ఏదిఏమైనా, పార్టీ శ్రేణులు, నాయకులను సమన్వయం చేసుకోవడం, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం వంటి అంశాలు ఈ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై అనుమానాలు కలిగిస్తున్నాయి.
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తుంది. నిధుల కొరత కారణంగా పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని మొదట్లో ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాల నేపథ్యంలో ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు ఆసక్తి ఉందని, ఈ నియోజకవర్గం పరిధిలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నందున కచ్చితంగా గెలుస్తానని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఓటర్ల నమోదు లేదా ప్రచారంలో చురుకుగా పాల్గొనడం లేదని ఆ పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ‘రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ’ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ఎన్నికల బరిలోకి దిగడం కలకలం రేపుతోంది. ఆయన ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. ఆయన గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 1.5 లక్షల మంది యువతతో కూడిన బలమైన నెట్వర్క్ తనకు మద్దతుగా ఉందని ఆయన పేర్కొంటున్నారు. తన అకాడమీ ద్వారా వారికి నాణ్యమైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించి, ఉద్యోగాలు సాధించడంలో సహాయపడ్డానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, ఉద్యోగ శిక్షకుడిగా ఆయన సాధించిన విజయాలను పక్కన పెడితే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఆయనకున్న అనుబంధమే రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పొంగులేటి ప్రోద్బలంతోనే ఆయన పోటీకి దిగారని ప్రచారం జరుగుతుంది. ఈ పట్టభద్రుల నియోజకవర్గాలలో మంచి పట్టున్న బిజెపి తన సంస్థాగత సామర్థ్యం ఆధారంగా ముందడుగు వేస్తుంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు కేవలం అభ్యర్థుల కేంద్రంగా ప్రచారాలు చేసుకుంటుంటే, బిజెపి మాత్రం పటిష్టమైన కార్యకర్తల బలం, క్యాడర్ బేస్ ఆధారంగా ముందుకు సాగాలని నిర్ణయించింది.
ప్రవీణ్

