భారత్ అభివృద్ధిలో కొత్త దశ ‘తదుపరి తరం జీఎస్టీ’
భారత్‌ను ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దాలన్న మన ఆకాంక్ష నెరవేరాలంటే దేశంలో ఎక్కడి నుంచి వ్యాపారం ప్రారంభించినా, ఏ స్థాయిలో ఉన్న సంస్థ అయినా అది అభివృద్ధి చెందగల ఆర్థిక వ్యవస్థ అవసరం. గత 12 ఏళ్లుగా మా ప్రభుత్వం ఈ పరిస్థితులను కల్పించేందుకు కృషి చేస్తోంది. 2017లో జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) అమలు చేయడం ద్వారా పరోక్ష పన్నుల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానపరమైన వ్యవస్థ ఏర్పడింది. తొమ్మిదేళ్ల అమలు అనుభవం, పన్ను చెల్లింపుదారులు, రాష్ట్రాల అనుభవాల ఆధారంగా ‘నెక్స్ట్-జెన్ జీఎస్టీ’ (తదుపరి తరం జీఎస్టీ) ఆ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా నెక్స్ట్-జెన్ జీఎస్టీని రెండు ఒకదానికి ఒకటి ముడిపడివున్న లక్ష్యాలతో రూపొందించాం. పన్ను రేట్లను తగ్గించి హేతుబద్ధీకరించడం, పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడం ఇందులో ప్రధాన ఉద్దేశాలు.
పన్ను రేట్లలో మార్పులు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రక్రియల సంస్కరణలకు సంబంధించిన తదుపరి దశ ప్రతిపాదనలు త్వరలో జీఎస్టీ కౌన్సిల్ ముందుకు రానున్నాయి. ఈ రెండు ప్రయత్నాల ద్వారా కుటుంబాలకు ఊరట కల్పించడం, వ్యాపారాలకు మరింత స్పష్టత ఇవ్వడం, పన్ను చెల్లింపుదారులు అనవసర ఇబ్బందులు లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తించగల వ్యవస్థను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్రాలు భాగస్వాములుగా వ్యవహరించాయి. తమ ప్రాధాన్యాలను, అనుభవాలను కౌన్సిల్ ముందుంచి, నిర్ణయాల రూపకల్పనలో సహకరించడంతో పాటు వాటి అమలును కూడా చేపట్టాయి. ప్రతి ప్రభుత్వం తన బాధ్యతలను గౌరవిస్తూనే ఉమ్మడి జాతీయ లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకు రావాలన్న స్ఫూర్తిపైనే జీఎస్టీ పురోగతి ఆధారపడి ఉంది. ఫలితాలు నమ్మకాన్ని పెంచుతున్నాయి. 2025 అక్టోబర్ నుంచి 2026 జూలై మధ్య నమోదైన పన్ను విధించదగిన వస్తువులు, సేవల విలువ, అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 25.8 శాతం పెరిగింది. సరళీకృత పన్ను రేట్ల వ్యవస్థతో పాటు నమోదైన ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా విస్తరించాయి. వ్యాపార రంగంతో పాటు ప్రభుత్వ ఆర్థిక వనరులను కూడా బలోపేతం చేయాలన్న సంస్కరణకు ఇది ప్రోత్సాహకరమైన పునాది.
తాజా ఆదాయ గణాంకాల్లోనూ ఈ విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. 2026 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య స్థూల జీఎస్టీ వసూళ్లు రూ 12.46 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11.6 శాతం అధికం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా వార్షిక ప్రాతిపదికన రెండంకెల వృద్ధి నమోదైంది. ఈ నాలుగు నెలల్లో కలిపి వసూళ్ల వృద్ధి దాదాపు 15 శాతానికి చేరింది. రీఫండ్లను (ప్రభుత్వం తిరిగి వెనక్కి ఇచ్చేసిన మొత్తాలు) మినహాయించిన తర్వాతి నికర వసూళ్లు కూడా ఆరు నెలల కాలంలో 10.4 శాతం పెరిగాయి. పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూనే అభివృద్ధికి అవసరమైన ఉన్న వనరులు కూడా పెరగడం విశేషం. ఈ విస్తరణ స్థాయి ఎంత ముఖ్యమో దాని పరిమాణం కూడా అంతే ముఖ్యం. మొత్తం 11 రంగాలలోనూ, అన్ని ప్రధాన రాష్ట్రాల్లోనూ నమోదైన పన్ను విధించదగిన వస్తువులు పెరిగాయి. భారతదేశం వంటి వైవిధ్యభరిత ఆర్థిక వ్యవస్థలో ఈ విస్తరణకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వివిధ రంగాలు, ప్రాంతాలు వృద్ధి చెందడం వల్ల విస్తరిస్తున్న మార్కెట్లలో మరిన్ని వ్యాపారాలు భాగస్వాములు కావడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే పెరుగుతున్న డిమాండ్, పెట్టుబడులు, ఉపాధి ద్వారా మరిన్ని వర్గాలు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. సంస్కరణల అనంతర కాలంలో వినియోగదారులకు జరిగిన అమ్మకాలు (బీ2సీ అంటే వ్యాపారాల నుంచి నేరుగా వినియోగదారులకు జరిగినవి) కూడా 26.7 శాతం పెరిగాయి. పన్ను రాయితీ కారణంగా ధరలు తగ్గితే కుటుంబాలకు ఇతర అవసరాలను తీర్చుకోవడానికి లేదా పొదుపు చేసుకోవడానికి మరింత వెసులుబాటు లభిస్తుంది. వినియోగదారులకు కలిగే ప్రయోజనం, వ్యాపారాల వృద్ధితో విడదీయరాని సంబంధం కలిగి కలిగి ఉంటుంది. కుటుంబాల కొనుగోలు శక్తి వ్యాపారాలు అందించే వస్తువులు, సేవలకు డిమాండ్‌ను కొనసాగిస్తుంది. దీని ప్రయోజనాలు కుటుంబం నుంచి చిల్లర వర్తకులు, సరఫరాదారులు, ఉత్పత్తిదారుల వరకు విస్తరించగలవు.
చిన్న, మధ్య తరహా సంస్థలకు జాతీయ మార్కెట్ అందుబాటులోకి రావడం అంటే తమ చుట్టుపక్కల కాక దూరంగా ఉన్న వినియోగదారులను చేరుకునేందుకు సులభమైన మార్గం ఏర్పడటం. రెండో శ్రేణి, మూడో శ్రేణి పట్టణాల్లోని వ్యాపారాలు స్థానికంగా పెట్టుబడులు పెట్టడం, ఉపాధి కల్పించడం కొనసాగిస్తూనే ఇతర ప్రాంతాల్లోని వినియోగదారులతో సంబంధాలను ఏర్పరచుకోగలగాలి. మరోవైపు ఈ పట్టణాల్లోకి విస్తరించే సంస్థలు స్థానిక సరఫరాదారులు, పంపిణీదారులకు కూడా అవకాశాలను సృష్టించగలవు. జీఎస్టీ ఉమ్మడి వ్యవస్థ ఈ అనుసంధానాలకు మద్దతు ఇస్తోంది. పరిపాలనా విధానాలను మరింత సరళీకరించడం ద్వారా ఈ సంబంధాలను కొనసాగించడం సులభతరం కావాలి. కేంద్ర, రాష్ట్ర పరిధుల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఆగస్టు చివరి నాటికి సుమారు 1.71 కోట్లకు చేరాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ఇవి దాదాపు 15 శాతం పెరిగాయి. 2026 ఏప్రిల్-జూలై పన్ను కాలాలకు సంబంధించి గడువులోగా దాఖలైన జీఎస్టీఆర్-3బీ రిటర్నుల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.6 శాతం అధికంగా ఉంది. ఈ మెరుగుదలలు పరిపాలనా వ్యవస్థపై కూడా బాధ్యతను పెంచుతున్నాయి. క్రమం తప్పకుండా పన్ను చెల్లించే విధానానికి నమ్మకమైన సేవలు, స్పష్టమైన మార్గదర్శకాలు, సమస్యలకు సకాలంలో పరిష్కారం అందించాల్సిన అవసరం ఉంది.
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) విధానం ఎలా పనిచేస్తుందన్నది కూడా ఈ అనుభవంలో మరో కీలక అంశం. సంస్కరణల అనంతర గణాంకాలు వెల్లడిస్తున్నదేమిటంటే క్రెడిట్ల ద్వారా చెల్లించిన పన్నుల వాటా పెరిగింది. అదే సమయంలో పన్ను విధించదగిన వస్తువులు, సేవలతో పోలిస్తే పేరుకుపోయిన క్రెడిట్ తగ్గింది. అర్హత కలిగిన క్రెడిట్‌ను సమర్థంగా వినియోగించడంపై ఆధారపడే వ్యాపారాలకు ఇది ప్రోత్సాహకరమైన పరిణామం. చిన్న సంస్థకు నిర్వహణ పెట్టుబడులు ఎంతో కీలకం. ముడి పదార్థాలు లేదా ఇతర ఇన్పుట్ల ఖర్చులు, వచ్చిన ఆర్డర్‌ను పూర్తి చేయడం, తదుపరి ఆర్డర్‌ను స్వీకరించడం వంటి వాటిని ఎంత సులభంగా చేయగలదన్నది అందుబాటులో ఉన్న నిర్వహణ పెట్టుబడి మొత్తంపై ఆధారపడి ఉంటుంది. రీఫండ్లు కూడా అంతే ముఖ్యమైనవి. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య సుమారు రూ.1.80 లక్షల కోట్లను రీఫండ్ చేశాం. వ్యాపారాలకు వాటికి చెల్లించాల్సిన మొత్తాలను తిరిగి ఇవ్వడం సమర్థంగా పనిచేసే పన్ను వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. ఈ ప్రక్రియలో మరింత ముందస్తు అంచనా సాధ్యమైతే, సంస్థలు తమ కొనుగోళ్లు, ఉత్పత్తి ప్రణాళికలను మరింత విశ్వాసంతో రూపొందించుకోగలవు. అర్హత ఉన్న రీఫండ్‌ను పన్ను చెల్లింపుదారు ఎంత సులభంగా, ఎంత వేగంగా పొందగలుగుతున్నాడన్నది పరిపాలనా పనితీరుకు ముఖ్యమైన కొలమానం.
రాష్ట్రాల ఆదాయ పరిస్థితి కూడా బలోపేతమైంది. ఐజీఎస్టీ సెటిల్మెంట్లలో రాష్ట్రాల వాటాను కలుపుకొని, వాటి మొత్తం ఎస్జీఎస్టీ ఆదాయాలు ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య సుమారు 16 శాతం పెరిగాయి. ఈ వనరులు మౌలిక సదుపాయాలు, ప్రజా సేవల్లో పెట్టుబడులకు ఉపయోగపడతాయి. కుటుంబాలకు ఊరట డిమాండ్‌ను పెంచుతుంది, వ్యాపారాలు ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేస్తాయి, ప్రభుత్వ ఆదాయాలు అభివృద్ధిని కొనసాగించేందుకు అవసరమైన వనరులను అందిస్తాయి. అయితే మున్ముందు చేయాల్సిన పనిని కూడా ఈ అనుభవం స్పష్టం చేస్తోంది. వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ చిన్న భాగస్వాములపై పడే వ్యయంపై మరింత శ్రద్ధ పెట్టాలి. వారి సమయం, వనరులు పరిమితంగా ఉంటాయి. రిటర్నుల దాఖలు, క్రెడిట్, రీఫండ్ల విషయంలో ప్రతి మెరుగుదల ద్వారా వారు వెచ్చించాల్సిన సమయం, వనరులు తగ్గి, వ్యాపార నిర్వహణ, విస్తరణపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం కలగాలి.
రాష్ట్రాలతో నిరంతర చర్చలు, సమన్వయంతో అక్టోబర్ 7న కౌన్సిల్ ముందుకు వచ్చిన ప్రతిపాదనలు రూపొందాయి. రిజిస్ట్రేషన్, రిటర్నులు, రీఫండ్లు, వివాదాలు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెరుగైన ప్రవాహం వంటి అంశాలను ఇవి పరిష్కరించాయి. పన్ను నిబంధనల అమలుకు పట్టే సమయం, ఖర్చును తగ్గించడం వీటి ప్రధాన లక్ష్యం. అమలు ప్రక్రియలో పన్ను చెల్లింపుదారుల అనుభవమే నిరంతరం మార్గనిర్దేశం చేయాలి. జీఎస్టీ మరింత పరిణతి చెందడం వల్ల సంస్కరణల తదుపరి దశకు మనకు బలమైన పునాది ఏర్పడింది. నమ్మదగిన పన్ను వ్యవస్థ వ్యాపారాలకు తమ తక్షణ బాధ్యతలను దాటి ఆలోచించే, ఫలితాలు రావడానికి సమయం పట్టే అవకాశాల్లో పెట్టుబడులు పెట్టే సామర్థ్యాన్ని కల్పిస్తుంది. అవి ఎక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ వ్యాపారాలకు ఈ విశ్వాసాన్ని కల్పించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కలలు కంటున్న ‘వికసిత్ భారత్’కు అవసరమైన ఆర్థిక బలాన్ని కల్పించేందుకు మనం దోహదపడగలం.
నిర్మలా సీతారామన్,
కేంద్ర ఆర్థిక మంత్రి

