Rahul Gandhi

మోదీ ముందు ప్రతిపక్షం ‘కుప్పిగంతులు’

అక్టోబర్ 7న నరేంద్ర మోదీ ప్రజా పదవిలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2001 అక్టోబర్ 7 నుంచి 2014 మే 21 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 2014 మే 26 నుంచి భారత ప్రధానమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నాయకుడు ఇంత సుదీర్ఘకాలం వరుసగా అధికార పదవుల్లో కొనసాగడం అపూర్వమైన రికార్డు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు వారసత్వ రాజకీయాల ద్వారా అధికారాన్ని అందుకోగా, మోదీ మాత్రం అనేక రాజకీయ పోరాటాలను ఎదుర్కొని, వాటిలో విజయం సాధిస్తూ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు. నెహ్రూ వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించగా, ఇందిరాగాంధీ 1967, 1971 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచి, 1977లో ఓడిపోయారు. 1984లో తన తల్లి హత్య అనంతరం అధికారంలోకి వచ్చిన రాజీవ్‌గాంధీ ఐదేళ్ల తర్వాత 1989లో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అటల్ బిహారీ వాజ్‌పేయి 1998, 1999 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించినప్పటికీ, 2004లో ఓటమి పాలయ్యారు. మన్మోహన్‌సింగ్ 2004, 2009లో రెండుసార్లు గెలిచినా, 2014లో ఓడిపోయారు. మోదీ మాత్రం గుజరాత్‌లో వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు, ఆ తర్వాత వరుసగా మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించారు.

మోదీ 25 ఏళ్ల అసాధారణ రాజకీయ ప్రస్థానం ఏమాత్రం సాఫీగా సాగలేదు. 1995లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయానికి వ్యూహరచన చేసిన కీలక వ్యక్తిగా ఆయన నిలిచారు. అప్పటికే ఎల్‌కే అద్వానీ (1990), మురళీ మనోహర్ జోషి (1992-93) చేపట్టిన రథయాత్రల్లో తన అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆయన మంచి గుర్తింపు పొందారు. ఉగ్రవాదుల బెదిరింపుల నడుమ 1993 జనవరి 26న శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని మోదీ-జోషి ద్వయం ఎగురవేసిన దృశ్యం ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసింది. 1997లో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. అయితే, గుజరాత్‌లో పార్టీకి తగ్గుతున్న ప్రజాదరణ, క్షీణిస్తున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు 2001లో తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఎదుర్కొన్న సవాళ్ళు చాలా తీవ్రమైనవి. వాటిని మరే నాయకుడైనా తట్టుకోవడం కష్టమే. 2001 ప్రారంభంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత పునరావాసం, పునర్నిర్మాణం చేపట్టడం ఒక భారీ సవాలుగా మారింది. ఆ వెంటనే గోద్రా ఘటన, దాని అనంతరం అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఇవి భారీగా ప్రాణనష్టానికి దారితీయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రతికూల ప్రచారానికి కారణమయ్యాయి. మోదీ రాజీనామా చేయాలంటూ పార్టీ లోపల, వెలుపల నుంచి వచ్చిన ఒత్తిళ్ళను అప్పటి ప్రధాని వాజ్‌పేయి, అద్వానీ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ ద్వేషం, విమర్శలకు మోదీ సుపరిపాలన, ప్రజలకు సేవలు చేరువ చేయడం ద్వారా సమాధానం చెప్పారు. కొద్దికాలానికే ఆయన పారదర్శక, అభివృద్ధి కేంద్రిత పాలనా నమూనా ప్రశంసలు అందుకుంది. ఆయనను ‘వికాస్ పురుష్’గా ప్రజలు గుర్తించడం ప్రారంభించారు. ఆయన నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) 2000లో కేవలం 10 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2014 నాటికి 151 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మరింత మెజారిటీతో విజయం సాధించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మోదీపై సాగిన తీవ్ర విమర్శలు, ప్రతికూల ప్రచారాన్ని గుర్తుచేసుకుంటూ అద్వానీ ఒకసారి, “నిజాయితీ, ధైర్యం, సామర్థ్యం ఉన్న నాయకుడు తనపై వ్యక్తిగతంగా సాగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజల మద్దతుపై ఆధారపడగలడని ఇది నిరూపించింది” అని వ్యాఖ్యానించారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయనపై తీవ్ర విద్వేషం, విషప్రచారం కొనసాగాయి. దానికి ఆయన ఇచ్చిన సమాధానం సుపరిపాలన, అభివృద్ధి, ప్రజల ప్రేమాభిమానాలను, నమ్మకాన్ని గెలుచుకోవడం. ఆయన దేశ జీడీపీని 2014లో 2 ట్రిలియన్ డాలర్ల (ట్రిలియన్ లక్ష కోట్లు) నుంచి నేడు 4.3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లారు. ధైర్యవంతుడు, స్వయంకృషితో ఎదిగిన మోదీలాంటి నాయకుడిని ఎలా సవాలు చేయాలో ప్రతిపక్షానికి అర్థం కావడం లేదు. అందుకే వారు ‘ఓటు చోరీ’ పేరుతో మన గొప్ప ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియపై దాడి చేయడం వంటి చిల్లర చేష్టలకు పాల్పడుతున్నారు. వారు తమ సొంత చరిత్రను మర్చిపోతున్నారు. ఇందిరా గాంధీ 1975లో ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. 1993లో విశ్వాస తీర్మానంలో గెలవడానికి ఎంపీలను ‘కొనుగోలు’ చేశారనే ఆరోపణలు పీవీ నరసింహారావుపై వచ్చాయి. ఎమర్జెన్సీ సమయంలో తన ప్రవర్తనకు గాను షా కమిషన్ “ఏ ప్రభుత్వ పదవిని నిర్వహించడానికి అనర్హుడు” అని ప్రకటించిన నవీన్ చావ్లాను యూపీఏ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ గా నియమించింది. ఆయన కాంగ్రెస్ ఏజెంట్‌లా వ్యవహరించడంతో, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చావ్లా పక్షపాతం ప్రదర్శించిన 12 నిర్దిష్ట ఉదంతాలను పేర్కొంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్ గోపాలస్వామి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు 92 పేజీల రహస్య లేఖను పంపాల్సి వచ్చింది. చావ్లాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి యూపీఏ ప్రభుత్వం ఆయనను ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవికి పదోన్నతి కల్పించి సత్కరించింది. ఇప్పుడు గురివిందగింజ సామెతగా కాంగ్రెస్ నాయకులూ బిజెపి ప్రభుత్వాన్ని తప్పుపట్టడం విచిత్రంగా ఉంది. ప్రతిపక్ష లక్ష్యం మోదీ. కానీ మోదీ పోరాటాల్లో ఆరితేరిన నాయకుడని వారు మర్చిపోతున్నారు. వారి ఈ గిమ్మిక్కులు, కసరత్తులు ‘హనుమంతుడి కుప్పిగంతులు’ సామెత లాంటివి.

రామ్ మాధవ్,
జెపి జాతీయ ఉపాధ్యక్షుడు