Election Symbol

‘ఓట్‌ చోరీ’ ఆరోపణల వెనుక రాజకీయాలు!

ఎస్ఐఆర్ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) అన్ని రాష్ట్రాల్లోనూ జరిగే  ప్రక్రియ. దీని కోసం ఓటర్లకు 100 నుండి 158 రోజుల సమయం (4 నుండి 5 నెలలు) లభిస్తుంది. దేశంలోని 95 కోట్ల ఓటర్లలో 82 కోట్ల (88%) ఓటర్లు ఈ ప్రక్రియ కింద తమ ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి, ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకొని, బాధ్యతాయుతమైన ఓటర్లుగా నిలిచారు. దాదాపు 13 కోట్ల ఓటర్ల పేర్లు తుది ఓటరు జాబితాలోకి రాలేదు. వీరంతా గైర్హాజరీ అయినవారు,  శాశ్వతంగా వలస వెళ్లిన వారు, చనిపోయిన వారు, డూప్లికేట్ ఓటర్లు కావడం ఇందుకు కారణం. ఇందులో 2.89 కోట్ల మంది మరణించినవారు, 1.01 కోట్ల మంది నకిలీ (డూప్లికేట్) ఓటర్లు ఉన్నారు. మిగిలిన ఓటర్ల ఇళ్లకు ఈ ప్రక్రియలో పాల్గొన్న బీఎల్ఓలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు మూడు సార్లు వెళ్లారు. అయినప్పటికీ వారికి అందించిన ఎన్యుమరేషన్ ఫారం నింపలేదు, దీంతో ఈ ఓటర్లు గైర్హాజరయ్యారని లేదా వేరే ప్రాంతానికి వలస వెళ్లారని తెలుస్తుంది. ఒకవేళ ఎవరిదైనా ఓటు తొలగిస్తే, వారు ఫారం-6 నింపి మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

ఫారం-7 అనేది పేర్లను తొలగించడానికి ఒక చట్టబద్ధమైన ప్రక్రియ. దేశవ్యాప్తంగా ఉన్న 95 కోట్ల మంది ఓటర్లలో కేవలం 29 లక్షల ఓటర్ల పేర్లు మాత్రమే ఫారం-7 ద్వారా తొలగించారు. ఈ 29 లక్షల ఫారంలలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, స్వయంగా ఓటర్లు పూర్తి చేసిన ఫారంలు ఉన్నాయి. మరోవైపు 2 కోట్లకు పైగా నూతన ఓటర్లు ఫారం-6 ద్వారా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా దాదాపు 9 లక్షలకు పైగా బూత్‌లలో  జరిగింది. ఇందులో వేరువేరు విభాగాలకు చెందిన దాదాపు 11 లక్షల మందికి పైగా ప్రభుత్వ అధికారులు- ఐఏఎస్ నుంచి టీచర్ల వరకు- ఈ ప్రక్రియ పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. 9 లక్షలకు పైగా బిజెపి బీఎల్ఏ-2 లతో సహా ఇతర పార్టీల బీఎల్ఏ-2 లతో మొత్తం 35 లక్షలకు పైగా రాజకీయ పార్టీల అధికారిక ప్రతినిధులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. అంటే మొత్తం 46 లక్షల మంది ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. ప్రతిపక్షాలు ఈ ప్రక్రియను ప్రశ్నించడమంటే లక్షలాది తమ కార్యకర్తలపై ఓటు చోరీ ఆరోపణ మోపినట్టే!

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రివాల్ తో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు ఓటర్ల జాబితాపై పదే పదే ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు ఓటర్ల జాబితాను సవరించే ప్రక్రియ జరుగుతుంటే, వారు దానిని వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు, కేరళలోని కాంగ్రెస్ కూటమి పార్టీలు విజయం సాధించినప్పుడు ఎస్ఐఆర్ ను ఒక గొప్ప ప్రక్రియగా వర్ణిస్తూ, దీనిని ప్రజాస్వామ్యం దిశగా ఒక ప్రభావవంతమైన అడుగుగా పేర్కొన్నాయి. సుప్రీంకోర్టు 27 మే 2026 నాటి తీర్పులో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ చెల్లుబాటును సమర్థించింది. “ఎన్నికలు అంటే కేవలం ఓటు వేయడం మాత్రమే కాదు, ఓటుకి బలమైన పునాది స్వచ్ఛమైన, విశ్వసనీయమైన ఓటర్ల జాబితా” అని కోర్టు పేర్కొంది.

‌‌కాంగ్రెస్ “ఓట్ చోరీ” కట్టుకథ

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రతిపక్షాలు ఎన్నికల సంఘంపై దాడి చేస్తున్నాయి. వారు భయకంపిత వాతావరణాన్ని సృష్టిస్తూ అభివృద్ధి నుండి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఇదేమీ కొత్త కాదు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్షాలు చారిత్రాత్మక సంస్కరణలపై దాడి చేస్తున్నాయి. రఫేల్, ఈవీఎంలు, ఇప్పుడు ఓటుచోరీ  ఆరోపణల ద్వారా ప్రతిపక్షాలు ప్రతి అడుగులోనూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు నిరంతరం పడిపోతోంది. 1952లో 45% నుండి 2024 నాటికి 21.4%కి పడిపోయింది. ఇది కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయిందని తెలియజేస్తోంది. కాబట్టి ఎలాంటి ఎజెండా లేకుండా కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, సంస్థలను బలోపేతం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాస్వామ్య సంస్థలను అవమానిస్తూ వచ్చింది. కాంగ్రెస్ భారత ఎన్నికల సంఘాన్ని వ్యతిరేకిస్తూ, అవమానిస్తుంది. అమెరికాలో రాహుల్ గాంధీ భారత ఎన్నికల సంఘంపై తప్పుడు ఆరోపణలు చేశారు. మోదీ ప్రభుత్వంలోనే SIR నిష్పక్షపాత ప్రక్రియను ప్రవేశపెట్టారు, ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021 ద్వారా ఎన్నికల చట్టాలను సవరించారు.

భారత ఎన్నికల సంఘం భారత ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటిది. గత 70 ఏళ్లలో ఎన్నికల సంఘం 400కు పైగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలను, 20 సార్వత్రిక ఎన్నికలను నిర్వహించింది. ప్రపంచ జనాభాలో ఆరో వంతు మందికి ఎన్నికలను నిర్వహించడంలో దాని అనుభవం, ప్రపంచ ప్రజాస్వామ్య అత్యంత ముఖ్యమైన సంరక్షకులలో ఎన్నికల సంఘాన్ని ఒకటిగా నిలబెట్టింది. సార్వత్రిక ఎన్నికలలో సగటు ఓటర్ల సంఖ్య పెరగడం, రాజకీయ పార్టీల సంఖ్య పెరగడం వంటి కారణాల వల్ల గత 10 ఏళ్లలో ఎన్నికల ప్రజాస్వామ్యం మరింత బలోపేతమైంది. బ్యాలెట్ మోసాల నుండి ఈవీఎంల ప్రవేశం వరకు, చెరగని సిరా నుండి పరిశీలకుల వరకు, కఠినమైన చట్టాల నుండి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు నుండి ఓటర్ల జాబితా ప్రక్షాళన వరకు, ఎన్నికల సంఘం ప్రతి సవాలు నుండి పాఠాలు నేర్చుకుంటూ, కాలానుగుణంగా మారే నిష్పాక్షిక సంస్థగా పరిణామం చెందింది. ఇది కేవలం నియంత్రణ సంస్థ మాత్రమే కాదని, ప్రజల తీర్పులకు సంరక్షకురాలని దాని చరిత్ర నిరూపిస్తుంది.

అర్హులైన వారి ఓటును ఎవరూ దొంగిలించలేరు. గుర్తింపు, ధృవీకరణ, వాదనలు, అభ్యంతరాల నుండి తుది ప్రచురణ వరకు ఎన్నికల సంఘం దశలవారీగా భాగస్వామ్య ప్రక్రియను అనుసరిస్తుంది. ప్రతి పౌరుడు నమోదులను పరీక్షించవచ్చు. అభ్యంతరం తెలపవచ్చు, సరిదిద్దవచ్చు; ఓటర్ల నుండి ఏదీ దాచరు. ఎన్నికల ప్రక్రియలో సుమారు 70 దశలు ఉంటాయి. ఓట్లను అంత సులభంగా తొలగించలేరు. తుది ఓటర్ల జాబితాను ప్రచురించి, విస్తృతంగా ప్రకటించిన తర్వాత కూడా, అసాధారణ స్థాయిలో ఓట్లు తొలగిస్తే (ఉదాహరణకు ఒక పోలింగ్ కేంద్రంలో 2% మించిపోతే), రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా విచారణ చేపడుతారు. ఇది సక్రమమైన ప్రక్రియను నిర్ధారించడంతో పాటు, ఓటర్లను ఏకపక్షంగా తొలగించడాన్ని నివారిస్తుంది.

కాంగ్రెస్ ఈ నిష్పక్షపాత ఎన్నికల ప్రక్రియను నిరంతరం బలహీనపరిచింది. 1952లో ఎన్నికలలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ను ఓడించడానికి వారు కమ్యూనిస్టులతో కుట్ర పన్నారు. 1957లో కాంగ్రెస్ మద్దతుదారులు బేగూసరాయ్ లో భారతదేశపు మొట్టమొదటి బూత్‌ను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 1967లో జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 61 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. 1975లో ఎన్నికలలో అవకతవకలు చేయడానికి ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారన్న రెండు కేసులలో ఇందిరా గాంధీని దోషిగా నిర్ధారించి, ఆరేళ్లపాటు ఏ ప్రభుత్వ పదవులు చేపట్టకుండా చేపట్టకుండా అనర్హురాలిగా జస్టిస్ సిన్హా ప్రకటించారు. 1987 కాశ్మీర్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు భారీ అవకతవకల ద్వారానే మళ్లీ గెలిచాయి. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికైన ప్రభుత్వాలను ఏకపక్షంగా తారుమారు చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉంది.