Ashok Singhal

జాతి నిర్మాణానికి అంకితమైన మహోన్నతుడు

Ashok Singhalహిందీ భాషలో ఒక అందమైన నానుఉంది.. చెట్టు తన పండ్లను తానే తినదు, నది తన నీటిని దాచుకోదు. రెండూ మానవాళి ఆకలి దప్పులను తీర్చడమే తమ కర్తవ్యం అంటాయి. వ్యక్తిగత కోరికలు తీర్చుకోవడం కంటే మన చుట్టూ ఉన్నవారి సంక్షేమానికి అంకితమైన జీవితం సార్థకమవుతుందని మన సాధు పురుషులు, ద్రష్టలు చిరకాలంగా బోధిస్తున్నారు. ఈ ఉన్నత స్ఫూర్తిని తన జీవితంలో ప్రతిబింబించిన వ్యక్తి అశోక్‌ సింఘాల్‌ జీ. సెప్టెంబరు 27 నుంచి ఆయన జన్మ శతాబ్ది ఉత్సవం సందర్భంగా ఆయన అత్యున్నత వ్యక్తిత్వాన్ని స్మరించుకుందాం. 

అశోక్‌ జీతో సంభాషించడానికి, ఆయన ఆప్యాయతను అందుకోవడానికి నాకు ఎన్నో అవకాశాలు లభించాయి. 1981లో ఒక యువ కార్యకర్తగా ఉన్న నాకు ఆయన స్వదస్తూరీతో ఒక లేఖ వచ్చింది. త్వరలో జరగనున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి అందులో ప్రస్తావించి, నేను చేయాల్సిన కొన్ని పనులను అప్పగించారు. అనేక దశాబ్దాలుగా ఆశయాల సాధనకు ఆయన రేయింబవళ్లూ దీక్షగా శ్రమించడం నేను చూశాను. తరచూ ఆయన సుదూర ప్రాంతాలకు సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణాలు చేసేవారు. గుజరాత్‌లోని గిరిజన ప్రాంతాల్లో ప్రయాణించడమంటే అశోక్‌ జీకి ఎంతో ఇష్టం. దేశంలో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే అందరికన్నా ముందు అక్కడికి చేరుకుని సహాయపడేవారు. 2001 కచ్‌ భూకంపం బాధితుల సహాయ కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పనిచేయడం నాకు చిరస్మరణీయ అనుభవం.

ఆపన్నులపై కరుణ, శ్రద్ధ వహించడం అశోక్‌ జీకి తొలినాళ్లలోనే అబ్బింది. ఆయన ప్రఖ్యాత, సంపన్న కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి మహావీర్‌ గొప్ప పరిపాలనాధికారి. ఆయన సహోదరులలో ఒకరైన బి.పి.సింఘాల్‌ పోలీసు అధికారిగా పనిచేసి, ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. మరొక సహోదరుడు వి.పి.సింఘాల్ త్రిపుర రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లోనే ఆ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆయన కుటుంబంలోని ఇతర సభ్యులు వాణిజ్య, వ్యవసాయ రంగాలలో రాణించారు. అయితే అశోక్‌ సింఘాల్‌ చిన్న వయసు నుంచే భారత్‌ పునరుజ్జీవానికి అంకితమయ్యారు. ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నప్పుడు సాధు సత్పురుషులు, భక్తులు ఆయన్ను ఆకర్షించారు. ఆ సమయంలోనే ఆయన భారతదేశ సాంస్కృతికతత్వంపై అవగాహన పెంపొందించుకున్నారు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనను ఆరెస్సెస్‌ వైపు నడిపించింది. అక్కడాయన తనపై పెట్టిన ప్రతి బాధ్యతను ఉత్సాహం, క్రమశిక్షణ, కర్తవ్య భావాలతో నెరవేర్చేవారు. అద్భుతమైన గళం, సభికులను మంత్రముగ్ధులను చేయగల ఉపన్యాస శైలి ఆయనకు సహజ సిద్ధమైన వరాలు. అశోక్‌ జీ పాటలు కూడా అందరినీ సమ్మోహితులను చేసేవి. 

అశోక్‌ సింఘాల్‌ మహోన్నత స్వభావాన్ని బయటపెట్టిన రెండు సంఘటనలు నాకు గుర్తుకొస్తున్నాయి. మొదటిది 1993లో స్వామి వివేకానంద షికాగో ప్రసంగానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్‌ అమెరికాలో ఒక సదస్సును నిర్వహించినప్పుడు జరిగింది. విదేశాలలో అటువంటి సదస్సును నిర్వహించాలనే దూరదృష్టి, ప్రణాళిక, వివిధ భాగస్వాములందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం అశోక్‌ జీ సంస్థాగత నిర్వహణా నైపుణ్యాన్ని వెల్లడించింది. మరొకటి 2000 సంవత్సరంలో జరిగింది. అప్పట్లో ట్రినిడాడ్‌-టొబాగోలోని పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో ప్రపంచ హిందూ మహాసభ నిర్వహించారు. ఇతర ప్రతినిధులలో ఆయన రాక ఎంత ఉత్సాహాన్ని రగిలించిందో నేను చూశాను. సభలో నా ప్రసంగం తరువాత, ఆయన ప్రశంసలు నాకు మరపురాని అనుభవంగా నిలిచాయి. 

రామ జన్మభూమి ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. 1991లో బోట్‌ క్లబ్‌ ర్యాలీలో ఆయన ప్రసంగాన్ని, ఉద్యమ ఉద్ధృతి సమయంలో గాయపడి, రక్తమోడుతున్న అశోక్‌ జీ రూపాన్ని ఎవరూ మరచిపోలేరు. ఇప్పుడు అయోధ్యలో ఒక భవ్యమైన రామమందిరం నిర్మితమయిందంటే అది సాకారం కావడానికి తమను తాము నిస్వార్థంగా అంకితం చేసుకున్న అశోక్‌ జీ వంటి దిగ్గజాలే కారణం. అయోధ్య రామమందిర నిర్మాణానికి మొదటి ఇటుకను బడుగు వర్గాలకు చెందిన, బిహార్‌లో ప్రాథమిక స్థాయి వీహెచ్‌పీ కార్యకర్త అయిన కామేశ్వర్‌ చౌపాల్‌ చేతుల మీదుగా వేయించాలని ఆయన ఆలోచన. అశోక్‌ సింఘాల్‌ జీవితంలో ముఖ్య పాత్ర వహించిన వారణాసి పార్లమెంటు సభ్యుడిగా పాతినిధ్యం వహిస్తున్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఆయన జన్మ శతాబ్ది సందర్భంగా యువతకు అశోక్‌ జీ గొప్పతనం గురించి మరింత తెలియపరుద్దాం. మన దేశం, మన ప్రజల కోసం ఆయన కన్న కలలను సాకారం చేయడానికి పునరంకితమవుదాం.

నరేంద్ర మోదీ,
భారత ప్రధానమంత్రి