విపక్షాల ‘ఓటు చోరీ’ ఆరోపణల్లో డొల్లతనం!
ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టడంలో వరుసగా విఫలమవుతున్న ప్రతిపక్షాలు కొంతకాలంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం మీదా, బిజెపి మీదా ‘ఓటు చోరీ’ ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సహకరిస్తోందన్నది వారి ప్రధాన ఆరోపణ. తొలుత ఈ ప్రచారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) చుట్టూ సాగింది. అయితే, తమ ఆరోపణలకు విశ్వసనీయమైన ఆధారాలను చూపించడంలో విఫలమైన తర్వాత, విపక్షాలు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను లక్ష్యంగా చేసుకున్నాయి.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తదితరులు వర్సెస్ భారత ఎన్నికల సంఘం తదితరులు కేసులో 2026 మే 27న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, ఎస్ఐఆర్పై జరుగుతున్న వాదోపవాదాల నిగ్గుతేల్చడానికి కీలకమైన రాజ్యాంగ, చట్టపరమైన ప్రాతిపదికను అందిస్తోంది. బిహార్‌లో ఎస్ఐఆర్ చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన తర్వాత ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, కార్యకర్త యోగేంద్ర యాదవ్‌తోపాటు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ-ఎస్పీ నేత సుప్రియా సూలే తదితరులు ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం నాలుగు కీలక ప్రశ్నలను పరిశీలించింది. ఎస్ఐఆర్ చేపట్టే చట్టబద్ధ అధికారం ఎన్నికల సంఘానికి ఉందా? ఈ ప్రక్రియకు చట్టబద్ధమైన లక్ష్యం ఉందా, దానిని సాధించేందుకు అనుసరించిన చర్యలు సముచితంగా ఉన్నాయా? ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, ఓటర్ల నమోదు నిబంధనలు-1960లను ఈ ప్రక్రియ ఉల్లంఘించిందా? ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయాలనుకునే వ్యక్తుల పౌరసత్వానికి సంబంధించిన అంశాలను ఎన్నికల సంఘం పరిశీలించవచ్చా? ఈ ప్రశ్నలకు సుప్రీంకోర్టు ఇచ్చిన సమాధానాలు, ‘ఓటు చోరీ’ అంటూ విపక్షాలు చేస్తున్న విస్తృత ప్రచారంలోని డొల్లతనాన్ని బయటపెట్టాయి.
ఎస్ఐఆర్ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 21(3), అవసరమైన కారణాలను నమోదు చేసి, ఎన్నికల సంఘం తగినదిగా భావించే పద్ధతిలో ఎప్పుడైనా ప్రత్యేక సవరణ చేపట్టేందుకు స్పష్టమైన అధికారం కల్పిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. సాధారణ ఓటర్ల జాబితా సవరణ విధానానికి భిన్నంగా ఎస్ఐఆర్ ఉండటం వల్ల అది చట్టవిరుద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణం 324 ద్వారా ఎన్నికల సంఘానికి అప్పగించిన బాధ్యతను అమలు చేసేందుకు ఎస్ఐఆర్ చేపట్టవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ ప్రక్రియ చట్టబద్ధ వ్యవస్థకు వెలుపల లేదని, దానిలో భాగమేనని పేర్కొంది. ఎస్ఐఆర్ ఏకపక్షంగా, అసమంజసంగా ఉందన్న వాదననూ కోర్టు అంగీకరించలేదు. ఓటర్ల జాబితాల్లో కచ్చితత్వం, సంపూర్ణత, విశ్వసనీయత ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనదిగా ఎలా పరిగణించగలం? కచ్చితమైన ఓటర్ల జాబితా లేకుండా స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా? అని ప్రశ్నించింది. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడం, ప్రామాణిక ఫారాలను వినియోగించడం, నిర్దేశిత పత్రాలతో వివరాలను ధ్రువీకరించడం వంటి చర్యలకు, ఓటర్ల జాబితాల్లోని తప్పులను గుర్తించి సరిచేసే లక్ష్యానికి మధ్య సహేతుకమైన సంబంధం ఉందని కోర్టు గుర్తించింది. ఇప్పటికే ఓటర్లుగా నమోదైనవారిని కూడా ఆధార పత్రాలు సమర్పించాలని కోరడం ద్వారా వారి పౌరసత్వాన్ని అనుమానిస్తున్నారన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ తీర్పు ఎన్నికల సంఘానికి అపరిమిత అధికారాలు ఏవీ ఇవ్వలేదు. ఒక వ్యక్తి చట్టబద్ధమైన అర్హతలను కలిగి ఉన్నాడని ఎన్నికల సంఘం సంతృప్తి చెందని పక్షంలో, ఆ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని తగిన అధికారికి నివేదించాలని కోర్టు ఆదేశించింది. పౌరసత్వంపై ఎన్నికల సంఘం అభిప్రాయమే అంతిమ నిర్ణయం కాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఒక వ్యక్తి భారత పౌరుడేనని తేలితే ఆయన పేరును ఓటర్ల జాబితాలో చేర్చాలని కోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్కు అధికరణం 324, సెక్షన్ 21(3) ద్వారా చట్టబద్ధమైన ప్రాతిపదిక ఉందని, దానికి సహేతుకమైన లక్ష్యం ఉందని, ఆ లక్ష్యానికి అనుసరించే చర్యలకు సంబంధం ఉందని, ఏకపక్ష తొలగింపులను నిరోధించే రక్షణలు ఉన్నాయని కోర్టు నిర్ధారించింది.
ఓటర్ల జాబితాలో ఒకరి పేరు ఉండటం ఆ నమోదు చెల్లుబాటులో ఉందనే ప్రాథమిక భావనకు దారితీస్తుంది. అయితే, అది తిరుగులేని లేదా శాశ్వతమైన హామీ కాదు. పరిస్థితులు మారవచ్చు, ప్రభుత్వ రికార్డుల్లో తప్పులు ఉండవచ్చు. అందుకే ఓటర్ల జాబితాలను ఎప్పటికప్పుడు సవరించాల్సి ఉంటుంది. ధ్రువీకరణ ప్రక్రియను, ఇప్పటికే నమోదైన వ్యక్తిని అక్రమ ఓటరుగా ప్రకటించడంతో సమానంగా చూడలేం. అది రికార్డుల్లోని వివరాలను నిర్ధారించడానికి లేదా తప్పులను సరిచేయడానికి ఉద్దేశించిన చర్య మాత్రమే. ఓటర్ల జాబితాలను పరిశీలనకు అతీతంగా ఉంచడం ద్వారా ప్రజాస్వామ్య హక్కులను కాపాడలేం.
ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించే హక్కు, పారదర్శకతను డిమాండ్ చేసే హక్కు, ఓటర్ల పేర్ల తొలగింపును సవాలు చేసే హక్కు, ప్రభుత్వ రాజకీయ ఉద్దేశాలను పరిశీలించే హక్కు ఉన్నప్పటికీ కాంగ్రెస్, ఇండీ కూటమి పక్షాలు ‘ఓటు చోరీ’ అంటూ నిరాధార ఆరోపణలు చేయడం, దిల్లీ వీధుల్లో నిరసనల నాటకాలు ఆడడం వారి దివాళాకోరు రాజకీయానికి నిదర్శనం. వాస్తవాలతో విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత బిజెపిపై ఉంది. ఇందుకు ప్రతి బిజెపి కార్యకర్తా కాంగ్రెస్ కుట్రలను ఆధారాలతో ఎండగడుతూ, స్వచ్ఛమైన ఓటరు జాబితాల రూపకల్పనలో ఎస్ఐఆర్ ఆవశ్యకతను వివరిస్తూ, పారదర్శకంగా సాగుతున్న ఈ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

