ఎస్ఐఆర్పై రాద్ధాంతం.. ఓటమికి ప్రతిపక్షాల కొత్త సాకు!
శ్రీనివాస్ సొంతూరు కాజీపేట. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. అతనికి రెండు చోట్లా ఓటుహక్కు ఉంది. ఎస్ఐఆర్ వల్ల ఏదో ఒక చోట ఓటు వదులుకోవాల్సిన పరిస్థితి. శ్రీనివాస్ ఒక్కడే కాదు, టీవీ స్టూడియోలో గొంతు చించుకునే న్యూస్ యాంకర్ నుంచి ఏటీఎం సెంటర్ల వద్ద కాపుకాసే సెక్యూరిటీ గార్డు వరకు ఎంతో మంది ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, జీవనోపాధి కోసమో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. దేశ నలుమూలల నుంచి ఇలా వచ్చిన వారు ఉన్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఇతర పట్టణాల్లోనూ జీవనోపాధి కోసం గ్రామాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఉన్నారు. వీరిలో చాలా మంది రెండు చోట్లా ఓటరు జాబితాలో నమోదై ఉన్నారు. ఎస్ఐఆర్లో ఇలాంటి వారి రెండవ ఓటు రద్దవుతుంది.
ఏ ఎన్నికలు జరిగినా హైదరాబాద్‌లో పోలింగ్ శాతం తక్కువగా ఉండడం గమనించే ఉంటాం. నగర ప్రజలకు ఓటు చైతన్యం లేదని, క్రికెట్ మ్యాచ్ కోసం ఓటు వేయలేదనో.. సెలవు రోజు పర్యటనలు పెట్టుకున్నారనో ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే రెండు చోట్ల ఓటు ఉన్నవారు హైదరాబాద్‌లో కన్నా సొంత ఊరిలో ఓటు వేయడానికే మొగ్గు చూపడమూ పోలింగ్ శాతం తగ్గడానికి ఓ కారణం అనడంలో సందేహం లేదు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండడం ఎంత ముఖ్యమో.. అనర్హులు, మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, నకిలీలు ఓటరు జాబితాల్లో ఉండకపోవడమూ అంతే ముఖ్యం. ఈ రెండు లక్ష్యాల సాధన కోసం చేపట్టిందే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్). ఎన్నికల్లో ప్రజల విశ్వాసం చూరగొనలేకపోతున్న కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పక్షాలు తమ ఓటమికి ఎస్ఐఆర్ను సాకుగా చూపిస్తూ, వివాదాలు సృష్టిస్తున్నా. ఓటరు జాబితాల ప్రక్షాళనను ఓటు హక్కుల హరణంగా చిత్రీకరిస్తున్నాయి.
ఎస్ఐఆర్ అంటే పేర్ల తొలగింపేనా?
ఎస్ఐఆర్ ను కేవలం ఓటర్ల పేర్లు తొలగించే కార్యక్రమంగా అభివర్ణించడం దానిని తప్పుదోవ పట్టించడమే. ఎస్ఐఆర్ పలు దశల్లో జరిగే ప్రక్రియ. ఎన్యుమరేషన్, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, క్లెయింలు, అభ్యంతరాల స్వీకరణ, అవసరమైన సందర్భాల్లో నోటీసులు, విచారణ, తుది నిర్ణయాలు ఇందులో భాగంగా ఉంటాయి. ఓటరు జాబితాలో ఒకరి పేరు లేదని తేలినంత మాత్రాన ఆ వ్యక్తి శాశ్వతంగా ఓటు హక్కు కోల్పోయినట్లు కాదు. అదే విధంగా, ఒకరి పేరుపై సందేహం వ్యక్తమైనంత మాత్రాన విచారణ లేకుండా తొలగించేందుకు వీలుంటుందని కూడా అర్థం కాదు. సంబంధిత చట్టాలు, నియమాల్లో నిర్దేశించిన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950, ఓటర్ల నమోదు నిబంధనలు, 1960 ప్రకారం ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు వంటి అంశాలు నిర్దిష్ట విధానాలకు లోబడి ఉంటాయి. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించి నిర్ణయం తీసుకుంటారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల సౌలభ్యం కోసం ఎన్నికల సంఘం అనేక చర్యలు తీసుకుంటోంది. ఎన్యుమరేషన్ దశలో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఫారాలు అందించడం, వాటిని నింపి సమర్పించేందుకు సహకరించడం వంటి చర్యలు చేపడతారు. ఈ దశలో కనీసం మూడుసార్లు ఇంటింటికీ వెళ్లే అవకాశం కల్పించారు. ఇక నోటీసు దశలోనూ ఓటర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు, సంబంధిత బీఎల్ఓలు వారి ఇళ్లకు వెళ్లి పత్రాలను స్వీకరించే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఎస్ఐఆర్ సమయంలో గణనలోకి రాకపోవడం లేదా తార్కిక వ్యత్యాసాల కారణంగా నోటీసులు అందుకున్న వ్యక్తులు ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ కార్యాలయాలకు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా, బీఎల్ఓలు వారి ఇళ్లకు వెళ్లి పత్రాలను స్వీకరించి ECINETలో అప్లోడ్ చేస్తారు. తద్వారా సంబంధిత అధికారి పరిశీలన, నిర్ణయ ప్రక్రియకు అవసరమైన పత్రాలు అందుబాటులోకి వస్తాయి.
అవసరమైన సందర్భాల్లోనే విచారణ చేపడుతారు. సాధ్యమైనంత వరకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. అవసరమైతే ఓటరు కుటుంబంలోని మరో వయోజన సభ్యుడికి హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తారు. ఇది కేవలం సాంకేతిక మార్పు కాదు. ఓటర్ల సమయాన్ని, శ్రమను ఆదా చేయడంతోపాటు, ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు ఉద్దేశించిన పరిపాలనాపరమైన చర్య. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, రోజువారీ కూలీలు, వలస కార్మికులు, నిరాశ్రయులు వంటి వర్గాలకు ఎన్నికల కార్యాలయాలకు వెళ్లడం కష్టసాధ్యమవుతుంది. వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎన్నికల అధికారులు తగిన హెల్ప్‌డెస్కులు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించడం ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి దోహదపడుతుంది. ఓటర్ల సౌలభ్యం కోసం తీసుకున్న చర్యలను కూడా ప్రక్రియలో వైఫల్యానికి సంకేతాలుగా చూడటం సరైన దృక్పథం కాదు. ప్రజలకు ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు చూపించడం ఏ సమర్థవంతమైన వ్యవస్థకైనా అవసరం.
AI వినియోగంపై వివాదం
ఓటరు జాబితాల తయారీలో కృత్రిమ మేధ (AI) వినియోగంపై కూడా వివాదం సృష్టించే ప్రయత్నం దురదృష్టకరం. కొన్ని నోటీసులు సిస్టమ్ జనరేటెడ్‌గా ఉన్నాయని, ఓటర్ల పేర్ల తొలగింపులో AI ఉపయోగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం పూర్తిగా ఖండించింది. ఓటరు జాబితాల తయారీ ప్రక్రియలో AIని ఉపయోగించడం లేదని పేర్కొంది. నోటీసులు జారీ చేయడం సహా చట్టపరమైన నిర్ణయాలు సంబంధిత ఈఆర్ఓల ద్వారానే జరుగుతాయని స్పష్టం చేసింది. ఓటరు జాబితాలో పేరు చేర్చడం లేదా తొలగించడం వంటి నిర్ణయాలు చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించి ఈఆర్ఓలు తీసుకుంటారు. ECINET ఈ ప్రక్రియకు సాంకేతిక సహకారం అందించే వేదిక మాత్రమే. AI వినియోగంపై అనుమానాలు వ్యక్తం చేసే వారు కూడా వ్యవస్థలో వాస్తవంగా ఏ సాంకేతిక విధానం ఉపయోగించారో, దాని ప్రభావం ఏమిటో ఆధారాలతో నిర్ధారించాల్సి ఉంటుంది. నిరాధారమైన ఆరోపణలతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
ఫారం-6లో మార్పులా?
కొత్త ఓటరుగా నమోదు కావడానికి ఉపయోగించే ఫారం-6లో మార్పులు చేశారని, ఆ మార్పులు యువ ఓటర్లకు ఇబ్బందులు కలిగిస్తాయని ఆరోపణలు లేవనెత్తుతున్నారు. ఎన్నికల సంఘం మాత్రం ఫారం-6లో మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. SIR ప్రక్రియలో ఫారం-6తో పాటు ప్రత్యేక డిక్లరేషన్ ఫారాన్ని జతచేశామని, తద్వారా ఓటరు అవసరమైన సమాచారాన్ని ఒకేసారి సమర్పించే వెసులుబాటు కల్పించామని వివరించింది. ఈ నిర్ణయాన్ని ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపింది. ఈ వివాదంలో ఫారం-6లోని అసలు అంశాలు, దానికి జతచేసిన ప్రత్యేక డిక్లరేషన్ మధ్య తేడాను స్పష్టంగా గుర్తించడం అవసరం. ఎస్ఐఆర్ కోసం ప్రత్యేకంగా జతచేసిన డిక్లరేషన్‌ను ఫారం-6లో మార్పుగా పరిగణించడం సరైంది కాదు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం యువ ఓటర్ల నమోదు. ఎన్నికల సంఘం అందించిన గణాంకాల ప్రకారం, 2025 జూన్ 24 నుంచి 2026 సెప్టెంబర్ వరకు సుమారు 2.37 కోట్ల మంది జెన్ జీ ఓటర్లు జాబితాలో నమోదయ్యారు. అంటే నెలకు సగటున సుమారు 16 లక్షల మంది, రోజుకు దాదాపు 50 వేల మంది యువ ఓటర్లు నమోదైనట్లు ఆ గణాంకాలు సూచిస్తున్నాయి. యువత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడం దేశ రాజకీయ భవిష్యత్తుకు కీలకం. తొలి ఓటర్లకు అవగాహన కల్పించడం, ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించడం, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ద్వారా ఎన్నికలపై అవగాహన పెంపొందించడం వంటి చర్యలు ఈ దిశలో ఉపయోగపడతాయి. యువ ఓటర్ల నమోదు అవకాశాలను సులభతరం చేయడం, అదే సమయంలో నమోదు ప్రక్రియలో అవసరమైన అర్హతలను నిర్ధారించడం పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు కావు. ఈ రెండింటినీ సమన్వయం చేయడమే సమర్థవంతమైన ఎన్నికల నిర్వహణ.
చాందినీ చౌక్ ఉదంతం
దిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించి గతంలో 729 మంది ఓటర్లు ఉండగా, ఎస్ఐఆర్ అనంతరం ఒక్కరే మిగిలారంటూ వచ్చిన ఆరోపణ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఉదంతాన్ని కేవలం సంఖ్యల ఆధారంగా విశ్లేషించడం కంటే, ఆ ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. 2022–23లో చేపట్టిన కూల్చివేత సందర్భంగా బేలా ఎస్టేట్‌లోని అనధికార నివాసాలను తొలగించారు. అనంతరం పునరావాసం కింద అక్కడి నివాసితులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 19 ప్రకారం, సంబంధిత పోలింగ్ ప్రాంతంలో ఓటరుగా నమోదు కావడానికి ఆ ప్రాంతంలో సాధారణ నివాసి అయి ఉండాలి. ఎన్యుమరేషన్ సమయంలో సంబంధిత చిరునామాలో చాలామంది ఓటర్లు కనిపించకపోవడానికి వారు అక్కడి నుంచి తరలివెళ్లడమే కారణం. ఇదే సమయంలో, ఆ ప్రాంతానికి చెందిన సుమారు 500 మంది బాధిత ఓటర్లు తమ కొత్త చిరునామాల్లో పేర్లు నమోదు చేసుకోవడానికి ఫారం-6 సమర్పించారు. ఇంకా దరఖాస్తు చేయని అర్హులైన ఓటర్లు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితా అనేది కేవలం ఒక చిరునామాతో ముడిపడిన పేర్ల సమాహారం కాదు. అది వ్యక్తి అర్హత, సాధారణ నివాసం, సంబంధిత నమోదు నిబంధనలతో ముడిపడిన చట్టపరమైన రికార్డు. అయితే నివాసం మారిన వ్యక్తి ఓటు హక్కును కోల్పోవాలని దీని అర్థం కాదు. అర్హత కలిగిన వ్యక్తి తన కొత్త చిరునామాలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
రాజకీయ పార్టీలకూ బాధ్యత
ఓటరు జాబితా తయారీని పూర్తిగా ఒకే అధికారి లేదా ఒకే వ్యవస్థ నిర్వహించే ప్రక్రియగా చూడలేం. బూత్ లెవల్ ఆఫీసర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించడంలో భాగస్వాములవుతున్నారు. ముసాయిదా జాబితాలు, గైర్హాజరు, బదిలీ, మరణించినవారి వివరాలతో కూడిన జాబితాలను రాజకీయ పార్టీలకు అందించడం ద్వారా వాటిని తనిఖీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఇది రాజకీయ పార్టీలకు కూడా బాధ్యతను అప్పగించే విధానం. తమ బూత్ పరిధిలో అర్హులైన ఓటర్ల పేర్లు ఉన్నాయా? అనర్హమైన నమోదులు కొనసాగుతున్నాయా? చిరునామాలు మారినవారు కొత్త ప్రాంతాల్లో నమోదు చేసుకున్నారా? వంటి అంశాలను పార్టీలు క్షేత్రస్థాయిలో పరిశీలించవచ్చు. అర్హులైన ఓటర్ల పేర్లు మిస్సయితే వాటిని గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడం, తప్పుగా ఉన్న నమోదులపై ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయడం రాజకీయ పార్టీల బాధ్యతలో భాగం కావాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పోటీ ఎన్నికల ఫలితాల కోసం మాత్రమే కాకుండా, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయంగా ఉండేలా చూసే బాధ్యతను కూడా కలిగి ఉంటుంది. ఎన్నికల సంఘం అందించిన అవకాశాలను ఉపయోగించుకుని లోపాలను సరిచేయడానికి కృషి చేయడం ప్రజాస్వామ్య సంస్థల పట్ల బాధ్యతాయుతమైన వైఖరి.
ఎన్నికల సంఘం స్వతంత్రత
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం, నియంత్రణ బాధ్యత ఎన్నికల సంఘానికి అప్పగించారు. దేశంలో ఎన్నికలు నిర్వహించే వ్యవస్థ స్వతంత్రంగా, చట్టబద్ధంగా పనిచేయడం ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరం. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి లేదా ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే రాజ్యాంగబద్ధ సంస్థగా అది తన విధులను నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల ఎన్నికల సంఘం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూడటం సరైన పద్ధతి కాదు. నిర్ణయంపై అభ్యంతరం ఉంటే చట్టపరమైన ఆధారాలతో ప్రశ్నించవచ్చు. అవసరమైతే అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గాలను ఆశ్రయించవచ్చు. అయితే ఆధారాలు లేకుండా సంస్థ మొత్తం పక్షపాతంతో పనిచేస్తోందని ఆరోపించడం ప్రజల్లో సంస్థల పట్ల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం కలిగిస్తుంది.
ప్రజాస్వామ్యానికి పునాది స్వచ్ఛమైన ఓటరు జాబితా
ప్రజలు తమ పాలకులను ఎన్నుకోవడానికి, ప్రభుత్వాల పనితీరును అంచనా వేయడానికి, దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య సాధనం. ఈ హక్కును అర్హులైన పౌరులందరూ వినియోగించుకోవాలంటే ఓటరు జాబితాలు ఖచ్చితంగా, విశ్వసనీయంగా ఉండాలి. అర్హులైన వ్యక్తుల పేర్లు జాబితాలో లేకపోవడం వారి ప్రజాస్వామ్య హక్కుకు ఆటంకం కలిగిస్తే, మరణించినవారి పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన పేర్లు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలిపోయినవారి పాత చిరునామాలపై నమోదులు కొనసాగడం జాబితాల విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అందువల్ల అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చడంతోపాటు, అనర్హమైన నమోదులను చట్టబద్ధంగా తొలగించడం కూడా కీలకమే. అయితే, ఓటరు జాబితాల ప్రక్షాళన లక్ష్యాన్ని పక్కనపెట్టి, ఎస్ఐఆర్ ప్రక్రియను ఓటు హక్కుల తొలగింపుగా కొన్ని రాజకీయ శక్తులు చిత్రీకరించడం ఆందోళనకరం.
ప్రజాస్వామ్య బలం ఎన్నికల నిర్వహణలోనే కాకుండా, ప్రతి అర్హుడికి ఓటు వేసే అవకాశం కల్పించడం, ఓటర్ల హక్కులను పరిరక్షించడం, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంలోనూ ఉంటుంది. రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం ప్రజాస్వామ్యంలో సహజమే. అయితే, రాజకీయ వాదోపవాదాలు ఓటరు జాబితాల ప్రక్షాళన వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని మరుగునపరచకూడదు. ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు, పౌర సమాజం, ఓటర్లు తమ తమ బాధ్యతలను నిర్వర్తించినప్పుడే ఈ ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుంది. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలి. అనర్హమైన నమోదులకు తావుండకూడదు. ఓటు హక్కుకు భద్రత కల్పిస్తూ ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను పెంపొందించాలి. ఈ లక్ష్యాలను సాధించడంలో SIRను రాజకీయ నినాదాల ఆధారంగా కాకుండా, వాస్తవాలు, చట్టబద్ధమైన విధానాలు, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం ప్రాతిపదికన అంచనా వేయాలి. స్వచ్ఛమైన ఓటరు జాబితాలే పారదర్శక ఎన్నికలకు, బలమైన ప్రజాస్వామ్యానికి పునాది.
ప్రజల మద్దతు పొందడంలో విఫలమై, ఎన్నికల్లో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పక్షాలు తమ ఓటమికి కారణాలను వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగానే ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను తెరపైకి తెచ్చాయి. అయితే, ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు చూపడంలో విఫలమైన ప్రతిపక్షాలు ఇప్పుడు ఎస్ఐఆర్ను తమ రాజకీయ విమర్శలకు కేంద్రబిందువుగా మార్చుకుంటున్నాయి. ఓటరు జాబితాల ప్రక్షాళన లక్ష్యాన్ని పక్కనపెట్టి, ఈ ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఒకే వాదనను పదేపదే వినిపించినంత మాత్రాన అది వాస్తవం అయిపోదు. ప్రజలు వాస్తవాలను, ఆధారాలను పరిశీలించినప్పుడు ఇలాంటి రాజకీయ ప్రచారాల విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది. అప్పుడు కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ప్రజల దృష్టిలో మరింత పలుచనవుతారు.
