మోదీ ప్రభుత్వంలోనే మహిళలకు సాధికారత, గౌరవం
మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యతిరేక వైఖరి అవలంబించాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సదుద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని (నారీశక్తి వందన్ అధినియం) ఆమోదింపజేస్తే… కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండీ కూటమి పార్టీలు దానికి అడ్డంకులు సృష్టించాయని మండిపడ్డారు. బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పా రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 16న హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా, బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ రూప్ కుమారీ చౌదరి విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ, ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా సాధికారతకు బాటలు వేస్తూ అనేక చారిత్రక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు మహిళలకు నిరంతరం అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో మహిళా రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో మహిళలపై సుమారు 20 వేల కేసులు నమోదు కాగా, 2025 నాటికి ఒక్క ఏడాదిలోనే ఆ సంఖ్య 21 వేలకు చేరుకుందని, మహిళలపై నేరాల శాతం 3.16 శాతానికి పైగా పెరిగిందని గణాంకాలతో వివరించారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని, నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరినే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ వైఫల్యాలపై మహిళా మోర్చా శ్రేణులు రాజీలేని పోరాటం చేయాలని, అదే సమయంలో కేంద్ర పథకాలను ప్రతి గడపకూ చేర్చాలని పిలుపునిచ్చారు.
అనంతరం రూప్ కుమారీ చౌదరి మాట్లాడుతూ, నేడు భారతీయ మహిళలు కార్పొరేట్, పరిశ్రమలు, సైన్స్, రక్షణ రంగం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. దేశంలో 3 కోట్లకు పైగా ‘లఖ్పతి దీదీలు’, డ్రోన్ దీదీలు తయారయ్యారని అన్నారు. పారిశుధ్య కార్మిక సోదరీమణుల పాదాలు కడిగి ప్రధాని మోదీ మహిళలకు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. జేఎన్యూ ఘటనలో 11 మంది ఆడబిడ్డలు న్యాయం కోసం ఫిర్యాదు చేస్తే, ప్రియాంక గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీకి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. అలాంటి బాధితులకు బిజెపి మహిళా మోర్చా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పేదలు, యువత, మహిళలు, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కమలం వికసించి, బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మహిళా మోర్చా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

