లోక్ సభ ఎన్నికల వరకే కాంగ్రెస్ హామీల డ్రామాలు, తరువాత మొండిచేయే

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు పెట్టి కొనుకున్న వ్యూహకర్తల ఎత్తులు జిత్తులతో, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారడీ మాటలతో, ఇప్పటికే కేసీఆర్ దోపిడీతో నిండా మునిగి ఉన్న తెలంగాణ ఆర్థిక పరిస్థితిని గమనించి కూడా గ్యారెంటీలని, రుణమాఫీలని అలవికాని హామీలు గుప్పించి, పోలింగ్ కు కొద్ది రోజుల ముందే డిసెంబర్ 9నే హామీలు అమలు చేస్తామని మోసపుచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వచ్చే లోక్ సభ ఎన్నికల వరకు హామీల అమలు డ్రామా కొనసాగిస్తుంది. ఈ హామీల అమలు ఎట్టి పరిస్థితుల్లోనూ అసాధ్యం అని ప్రజలకు తెలీకూడదన్న సోనియా గాంధీ ఆదేశాలను పాటిస్తూనే ఈ డ్రామాలు కొనసాగిస్తున్నారు. గోబెల్స్ సిద్ధాంతం ప్రకారం వేరువేరు మంత్రులు, ఇతర నాయకులు వేరువేరు సందర్భాల్లో వేరువేరు ప్రదేశాల్లో నూటికి నూరుపాళ్లు హామీలు అమలు చేస్తామని వ్యూహకర్తల స్క్రిప్ట్ ను వల్లించి మరోసారి తెలంగాణ ప్రజలను మోసగించే దుస్సాహసం చేస్తున్నారు.

కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఇచ్చిన హామీల్లో సగం కూడా అమలు కాలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, లక్ష రూపాయల రైతు రుణమాఫీ, కోటి ఎకరాలకు సాగునీరు లాంటి ఎన్నో హామీలు మోసపూరితమని రుజువైంది. కేసీఆర్ తరహాలోనే మాటల గారడీ నాయకుడైన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజలను మరికొంత కాలం మోసం చేయగలననే విశ్వాసంతో ఉన్నారు. కానీ తెలంగాణ బిజెపి నాయకులు, కార్యకర్తల కృషితో, సామాజిక మాధ్యమాల్లో సరైన ప్రచారంతో రేవంత్ ప్రభుత్వ మోసపూరిత చర్యలపై ఇప్పటికే ప్రజలు జాగృతమవుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని బలమైన మీడియా సంస్థలను మేనేజ్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడూ అదే పంథా కొనసాగిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదం చేసిన ‘‘బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటే’’ అనే అబద్ధపు విష ప్రచారాన్ని ఈ లోక్ సభ ఎన్నికల్లో కూడా మరింత పెద్దఎత్తున కొనసాగించాలని కుట్రలు చేస్తోంది. ఇప్పుడు చతికిలపడ్డ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో కుమ్మక్కై తమ పార్టీని కాపాడుకునేందుకు, దోపిడీ కేసుల నుంచి బయటపడేందుకు, ‘‘బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటే’’ అన్న కాంగ్రెస్ అబద్ధపు విషప్రచారానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి మల్లారెడ్డి కుట్రపూరిత కాంమెంట్లు. కేసీఆర్ లానే అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక, మైనారిటీ బుజ్జగింపు నిర్ణయాలను అమలు చేయడం మొదలుపెట్టారు. గత 7 నెలలుగా అర్చకులకు జీతాలు లేకున్నా, అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ముస్లిం మతోన్మాద సంస్థకు రూ.2.40 లక్షలు ఇవ్వడం కాంగ్రెస్ హిందూ విద్రోహ చర్యనే. హిందూ దేవాలయాలపై 10 శాతం పన్ను విధించాలన్న కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం కూడా దశాబ్దాలుగా ఆ పార్టీ అనుసరిస్తున్న ‘‘హిందూ ద్రోహ వైఖరి’’కి నిదర్శనం.

డిసెంబర్ 9 హామీలు పోయాయి… అసెంబ్లీలో నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదన్న అబద్ధాలు వచ్చాయి… వంద రోజులు దగ్గరకు వస్తున్నాయి… తూతూ మంత్రంగా ప్రజలకు అవసరం లేని రెండు చిన్న హామీలనే అమలు చేస్తూ గోబెల్స్ ప్రచారంలో ఆస్కార్ అవార్డు లాంటి నటన ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ ముందే గ్రహించిన బిజెపి తెలంగాణలో ‘‘నో మింగిల్… ఓన్లీ సింగిల్’’ అంటూ లోక్ సభ ఎన్నికలకు వెళ్తోంది. బిజెపి, బీఆర్ఎస్ పొత్తు అన్న వాళ్ల చెంపలు పగల గొట్టండి.. చెప్పులతో కొట్టండి అని సాహసోపేతమైన సమయావశ్యక దూకుడుతో విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్తోంది. కేంద్ర ప్రభుత్వ ఘనవిజయాలు, మోదీ పటిష్ట నాయకత్వం, అయోధ్య శ్రీరాముడి ఆశీస్సులతో తెలంగాణలో బిజెపి 17కు 17 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో తీవ్రంగా కృషి చేస్తుంది.