80 దేశాలకు భారత ఆయుధాలు ఎగుమతి
గతంలో సరిహద్దుల్లో ఉండే సైనికులకు మౌలిక సౌకర్యాలు, రక్షణ కవచాలు, అత్యాధునిక ఆయుధాలు ఉండేవి కాదని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ అన్నారు. మోదీ వచ్చిన తర్వాత సైనికులకు అవసరమైన ఆయుధాలు, రక్షణ కవచాలు అందించడమే కాకుండా 80 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని చెప్పారు. ఏప్రిల్ 28న హైదరాబాద్‌లోని నారాయణగూడ కేశవ స్మారక విద్యాసంస్థల సభామందిరంలో వికసిత్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్@ 2047’ ప్రతినిధుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారని చెప్పారు.
కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని 2014 వరకు ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండేది కాదన్నారు. మోదీ 2047 నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దడానికి పక్కా రూట్‌మ్యాప్ రూపొందించారని చెప్పారు. పోలింగ్ రోజు అంటే సెలవు రోజు కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నమో యాప్ ప్రతినిధి శైలేష్ పాండే, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.

