ప్రభుత్వ రంగ సంస్థల దశ, దిశ
పరిస్థితులపై సరైన అవగాహన లేని ప్రతిపక్షం ఏ ప్రజాస్వామ్యానికైనా శాపం. దురదృష్టవశాత్తు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి చుక్కాని లేని ప్రతిపక్షంతో పెద్ద సమస్యగా మారింది. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూల) సొంత ఆస్తులను తెగనమ్మేసిందనేది పదేళ్ల ఎన్డీఏ పాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న దారుణమైన ఆరోపణల్లో ఒకటి. ఇంతకంటే అబద్ధం మరొకటి లేదు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) సమాచారం బయటపెట్టిన తిరుగులేని వాస్తవాలను ఒకసారి పరిశీలించాలి. దేశంలోని దిగ్గజ చమురు కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అత్యధిక ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తిని సాధించింది. ఐఒసిఎల్ ఈ సంవత్సరంలో మునుపెన్నడూ లేని స్థాయిలో అత్యుత్తమ రిఫైనరీ ఉత్పత్తిని, అమ్మకాలను, నికర లాభాలను నమోదు చేసింది. బీపీసీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలలలో (ఏప్రిల్-డిసెంబర్, 2023) అత్యధిక లాభాలను నమోదు చేసింది. కోల్ ఇండియా తన అత్యధిక ఉత్పత్తిని నమోదు చేసింది. ఎన్‌టీపీసీ ఏడాదిలో అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, అవినీతిమాయమైన యుపిఎ పాలన నుంచి వారసత్వంగా సంక్రమించిన నిరర్థక ఆస్తుల (మొండిబాకీలు) సంక్షోభం అంచు నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులను బిజెపి ప్రభుత్వం కాపాడి తిరిగి గాడిలో పెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకులు తమ అత్యధిక లాభాలను, అత్యల్ప ఎన్‌పిఎలను నమోదు చేశాయి. పీఎస్‌యూలు యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు నాటి నాయకుల వ్యక్తిగత అవసరాలను తీర్చిన విషయం అందరికీ తెలిసిందే. ‘భూమికి ఉద్యోగం’ కుంభకోణం ద్వారా రైల్వే నిధులను పూర్తిగా స్వాహా చేయడం కానివ్వండి, స్వల్పకాలిక, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులను చేపట్టేటట్టు పీఎస్‌యూలపై ఒత్తిడి తీసుకురావడం మొదలైన చర్యల ద్వారా యుపిఎ ప్రభుత్వ రంగాన్ని కుదేలు చేసింది.
యూపీఏ పాలనకు, గత 10 సంవత్సరాల బిజెపి పాలనకు మధ్య తేడా అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. మన ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నాయి. తమను తాము గుర్తించదగిన బ్రాండ్‌గా రూపొందించుకుంటున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో స్వేచ్ఛ, జవాబుదారీతనాల సరైన సమ్మేళనాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం ఈ కంపెనీలు తమ శక్తిసామర్థ్యాలనూ పూర్తి స్థాయిలో ప్రదర్శించేందుకు అనువైన వాతావరణాన్ని, అవకాశాలను కల్పించింది. ‘వికసిత్ భారత్@ 2047’ దార్శనికతను సాకారం చేసే ప్రతిష్టాత్మక ప్రణాళికలకు పూర్తి మద్దతు, ప్రోత్సాహం ఇస్తూనే ప్రభుత్వం వాటి వ్యాపార నిర్ణయాలలో జోక్యం చేసుకోకుండా వాటికీ స్వేచ్ఛనిస్తోంది. మంచి కార్పొరేట్ సంస్థలుగా తమ విధులను నిర్వర్తించేలా ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరిగినా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి అనేక నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచాయి. ఈ సమయంలో ప్రైవేట్ ఇంధన రిటైలర్లు రిటైల్ ధరలు తమకు గిట్టుబాటు కాకపోవడంతో తమ కార్యకలాపాలను తగ్గించుకున్నారు. ఆ సంక్షోభ సమయంలో ఇంధన ఖర్చులను, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రభుత్వ చమురు కంపెనీలు కీలకపాత్ర పోషించాయి. సంక్షోభ సమయంలో ఇంధన ధరలను పెంచకపోవడం వల్ల మొదట చమురు కంపెనీల ఆదాయాలపై ప్రభావం పడింది. అయితే ప్రత్యేకంగా చమురు కంపెనీలు, అలాగే అన్ని ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు దేనికదే ప్రత్యేకంగా పని చేయకుండా ఆర్థిక వ్యవస్థలో స్థూలంగా తమ బాధ్యతను నెరవేర్చే విధంగా సమన్వయంతో పని చేస్తున్నాయి. ఈ సంస్థల విధానం, దృక్పథాల్లో ఈ మార్పు మోదీ ప్రభుత్వం పెంపొందించిన విలువల ప్రత్యక్ష ఫలితం.
పెట్రోల్, డీజిల్ ధరలను ప్రపంచంలోనే తక్కువ స్థాయిలో ఉంచినా 2023-24లో చమురు పిఎస్‌యులు రూ 1.5 లక్షల కోట్లకు పైగా సంచిత లాభాలను ఆర్జించాయి. గత మూడేళ్ళలో అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఒడిదుడుకులు వచ్చినా మన దేశంలో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయేగాని పెరగలేదు. చమురు కంపెనీల అధిక లాభాలు అవి ప్రభుత్వానికి గణనీయమైన స్థాయిలో పన్నులు, డివిడెండ్లు చెల్లించడానికి, దేశ భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి చేపట్టే భారీ మూలధన వ్యయాలకు నిధులు సమకూర్చేందుకు దోహదం చేస్తాయి. దీర్ఘకాలిక దృష్టి, వ్యాపార నిర్ణయాలను తీసుకుని, అమలు చేయడానికి పూర్తి వృత్తిపరమైన స్వేచ్ఛ చమురు కంపెనీల పనితీరుకు చోదక శక్తులు. ఇది వాటి మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) లో కూడా ప్రతిబింబిస్తుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఉత్పత్తి కంపెనీల మార్కెట్ విలువ గత మూడేళ్లలో రెట్టింపునకు పైగా పెరిగి దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది. అంతేకాకుండా గత మూడేళ్లలో చాలా చమురు పీఎస్‌యూలు నిఫ్టీ సూచి స్థాయిని మించిన పనితీరును కనబరిచాయి. స్పష్టమైన భవిష్యత్తు ప్రణాళికలతో, బలమైన ఆర్థిక ఆరోగ్యంతో పీఎస్‌యూలు తమ లాభాలను మూలధన వ్యయం ద్వారా పెట్టుబడి కోసం ఉపయోగించుకున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ఊపును అందించింది. ఫిబ్రవరి 2024 నాటికి చమురు, గ్యాస్ పీఎస్‌యూలు మొత్తం రూ.5.67 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 275 ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి. గత 10 ఏళ్లలో ఈ పీఎస్‌యూలు రూ.4.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను పూర్తి చేశాయి. పూర్తి చేయడానికి ఎక్కువ కాలం పట్టినా దేశానికి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాజెక్టులను చేపట్టే సామర్థ్యం ప్రభుత్వరంగానికి ఉంది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు సరైన మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేసింది. అన్ని సంస్థలకూ ఒకే విధానం కాకుండా మేం ఒక్కొక్క పీఎస్‌యూని బహుళ ప్రమాణాల ఆధారంగా మదింపు చేసి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఫలితంగా ప్రభుత్వం ఎయిర్ ఇండియా నుంచి పెట్టుబడుల ఉపసంహరణపై ముందుకు సాగింది. అయితే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లో వాటా అమ్మకాన్ని వాయిదా వేసింది. ఎంతో ఘన చరిత్ర కలిగి ఉన్నా నష్టాలను మూటగట్టుకున్న సంస్థగా ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణకు సరైన సంస్థ. పోటీ తీవ్రంగా ఉండే విమానయాన రంగంలో మనుగడ సాగించాలంటే, ఎయిర్ ఇండియాకు దాని మానవ వనరులను పునర్వ్యవస్థీకరించుకునే సౌలభ్యం, కాలం చెల్లిన ప్రక్రియలకు స్వస్తి చెప్పి చురుగ్గా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ అవసరం. అందుకోసం దాన్ని ప్రైవేటీకరించడం అవసరం. ప్రైవేటీకరణ, పునర్వ్యవస్థీకరణ తర్వాత ఎయిర్ ఇండియా 500 కొత్త విమానాల కోసం ఆర్డర్ పెట్టింది. మరోవైపు, ఇంధన రిటైల్ అవుట్‌లెట్‌ల విస్తారమైన వ్యవస్థ, కీలకమైన రిఫైనరీలు, వివిధ రంగాల్లో సాటిలేని నైపుణ్యం కారణంగా బీపీసీఎల్ పై పూర్తి నియంత్రణను నిలుపుకోవడం చాలా కీలకమని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా ఇంధనంలో ఇథనాల్ కలిపే కార్యక్రమం, కార్బన్ ఉద్గారాలను తగ్గించే ఇతర చర్యల ద్వారా ఇంధన రంగంలో పరివర్తన సాధనలో ఈ కంపెనీ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. బీపీసీఎల్ నుంచి ప్రభుత్వం తన వాటాను ఉపసంహరించుకోకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లు సరైనదేనని బీపీసీఎల్ నిరూపించింది. ఈ కంపెనీ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం పొందాలనుకున్న రిజర్వు ధరలో దాదాపు 75 శాతాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలలలో కంపెనీ పన్ను అనంతర లాభంగా ఆర్జించింది. ప్రభుత్వం ఇప్పుడు కంపెనీని తన ఆధీనంలోనే కొనసాగించవచ్చు, మంచి డివిడెండ్‌ను కూడా పొందవచ్చు.
ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ బోర్డులకు ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారమని భావించిన తరుణంలో, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయకమైన, దార్శనికతతో కూడిన నాయకత్వం, పనితీరుతో ఆ పరిస్థితిని మార్చారు. పనితీరులో లోపాలను సమర్థంగా గుర్తించి పరిష్కరించడం, అవినీతి రహిత, వృత్తిపరమైన నిర్వహణతో రాష్ట్ర విద్యుత్ సంస్థలను లాభాలబాటలో నిలపడం సాధ్యమేనని ఆయన నిరూపించారు. ఒక దశాబ్దం తరువాత గుజరాత్‌లోని విద్యుత్ పంపిణీ కంపెనీలు అన్ని అంశాలలో దేశంలోనే అత్యుత్తమ సంస్థలుగా దేశంలోని ఇతర విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదర్శంగా మారాయి.
మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు అందించిన సారథ్యం వృత్తి నైపుణ్యం, వ్యూహాత్మక దూరదృష్టి, జాతీయ ప్రయోజనాల పట్ల అచంచల నిబద్ధతతో కూడిన పాలన అనే కొత్త శకానికి నాంది పలికింది. సంస్కరణ, పనితీరు, పరివర్తన మంత్రాన్ని సాకారం చేయడం ద్వారా దూరదృష్టి గల నాయకత్వానికి పీఎస్‌యూలు అద్భుతంగా ప్రతిస్పందించాయి. భారతదేశం అభివృద్ధి ప్రయాణాన్ని అందరికీ ఉజ్వలమైన, మరింత సంపన్నమైన భవిష్యత్తుగా మార్చడానికి ప్రభుత్వ రంగ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.
హర్దీప్ సింగ్ పూరి,
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి

