ఏపీలో కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా 24 మందితో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. గన్నవరం విమానాశ్రయం సమీప కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద జూన్ 12న ఈ వేడుకను నిర్వహించారు. టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బిజెపి నుంచి ఒకరికి మంత్రులుగా అవకాశం దక్కింది.
పలువురు జాతీయ నేతలు, రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరైన వేళ.. వారి పరస్పర పలకరింపులు, అభినందనలు, ఆత్మీయ ఆలింగనాలతో కార్యక్రమం ఆద్యంతం హృద్యంగా సాగింది. ప్రముఖ నటులు చిరంజీవి, రజనీకాంత్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వేదికపైకి వచ్చినప్పుడు ప్రాంగణమంతా కేరింతలతో మార్మోగింది. చంద్రబాబు ప్రమాణం అనంతరం ప్రధాని మోదీ ఆయన్ను ఆలింగనం చేసుకొని, పుష్పగుచ్ఛమిచ్చి అభినందించారు. పవన్‌ను కూడా ఆలింగనం చేసుకున్నారు. కార్యక్రమం చివర్లో ప్రధాని మోదీని చంద్రబాబు శాలువతో సత్కరించారు. పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందజేశారు.
కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, చిరాగ్ పాస్వాన్, రాందాస్ అథవాలే, అనుప్రియ పటేల్ తదితరులు హాజరయ్యారు. బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సిద్ధార్థనాథ్ సింగ్, బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత ప్రఫుల్ పటేల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పాల్గొన్నారు. అగ్రనటులు రజనీకాంత్, ఆయన సతీమణి లత, చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీడీపీ నుంచి ఇటీవలే కేంద్ర మంత్రులైన రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వివిధ దేశాల రాయబార కార్యాలయ అధికారులు, కాన్సులేట్ జనరల్స్ హాజరయ్యారు. సినీ, వ్యాపార ప్రముఖులు కుటుంబ సమేతంగా వచ్చారు.
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 175 సీట్లలో 164 సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీ 135, జనసేన 21, బిజెపి 8 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్, వామపక్షాలున్న ఇండీ కూటమి కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.

