IND US Deal

అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో రైతు ప్రయోజనాల పటిష్ట రక్షణ

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఒక అత్యంత సమతుల్యమైన ఒప్పందం. ఇందులో రైతుల ప్రయోజనాలను ఎంత పటిష్టంగా కాపాడారంటే ప్రభుత్వం వారి చుట్టూ ఒక ‘లక్ష్మణ రేఖ’ గీసింది. ఎవరూ వారి ప్రయోజనాలకు భంగం కలిగించలేరు. ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, స్వయంగా ఒక రైతుగా పూర్తి నమ్మకంతో చెప్పగలను, ఈ ఒప్పందం వల్ల రైతుల ప్రయోజనాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న వారు దీనిపై ఇంకా స్పష్టత లేదని వాదిస్తున్నారు. కానీ అదే సమయంలో కేవలం వ్యతిరేకించడం కోసమే తర్కరహితమైన, నిరాధారమైన అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. 

‘సగం జ్ఞానం అజ్ఞానం కంటే ప్రమాదకరం’ అని అంటుంటారు. అసంపూర్ణ సమాచారంతో ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వారు తమ సొంత ప్రజలనే తప్పుదోవ పట్టిస్తున్నారు. భారత, అమెరికా ప్రభుత్వాలు జారీ చేసిన ఉమ్మడి ప్రకటనతో పాటు, కేంద్ర మంత్రులు కూడా ఈ ఒప్పందం జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉందని, రైతులు లేదా పాడి రంగానికి దీనివల్ల ఎలాంటి ముప్పు లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రధాన పంటలైన గోధుమలు, వరిని ఈ ఒప్పందం పరిధికి వెలుపల ఉంచారు. ఇది రైతుల ప్రయోజనాల రక్షణను మరింత బలోపేతం చేస్తుంది. గోధుమలు, బియ్యం, మొక్కజొన్న వంటి ఆహార ధాన్యాలను ఈ ఒప్పందం నుంచి మినహాయించినట్లు భారత ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది. అదే సమయంలో భారతదేశం నుంచి అమెరికాకు ఒక బిలియన్ (100 కోట్ల) డాలర్ల కంటే ఎక్కువ విలువైన వ్యవసాయ ఉత్పత్తులు సున్నా శాతం టారిఫ్‌తో ఎగుమతి అవుతాయి. దీనివల్ల మన వ్యవసాయ రంగానికి ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది.

డ్రైడ్ డిస్టిలరీ గ్రెయిన్ అండ్ సోల్యూబుల్స్ (DDGS) గురించి రేకెత్తుతున్న అనుమానాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. DDGS అంటే జీవ ఇంధనాల తయారీలో వచ్చే ఉప ఉత్పత్తులు. వీటిని పశువులు, కోళ్ళ దాణాగా వాడతారు. అమెరికాతో ఒప్పందం ప్రకారం భారత్ వీటిని దిగుమతి చేసుకోదానికి అంగీకరించడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ దేశ అవసరాలలో కేవలం 1 శాతం మాత్రమే దిగుమతి చేసుకుంటామని భారత ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల పశుగ్రాస పరిశ్రమతో పాటు పశుపోషకులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. వారికి తక్కువ ధరకే నాణ్యమైన మేత లభించడం వల్ల పాల ఉత్పాదకత పెరుగుతుంది. భారతదేశంలో సమృద్ధిగా పండే నారింజ, మామిడి, అరటి వంటి పండ్లను కూడా ఈ ఒప్పందంలో చేర్చలేదు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారత్ ఇచ్చే సుంకాల రాయితీలు వెంటనే అమలులోకి రావు; వీటిని దశలవారీగా ప్రవేశపెడతారు. దేశీయంగా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతూ, ఇప్పటికే క్రమం తప్పకుండా దిగుమతి చేసుకుంటున్న పంటలను మాత్రమే ఈ ఒప్పందం కింద భారత్ దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి, ఇలాంటి పంటల దిగుమతి గురించి గందరగోళం సృష్టించడం పూర్తిగా అహేతుకం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూడటానికి, ప్రభుత్వం అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ఒప్పంద విషయంలోనూ అదే బాధ్యతాయుతమైన విధానాన్ని అనుసరించారు.

దేశీయ మార్కెట్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండానే, పశుపోషకులకు సరసమైన ధరలకే నాణ్యమైన మేత అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా, ఒప్పందంలో ‘కోటా విధానాన్ని’ నిర్ణయించారు. దీని ప్రకారం దిగుమతి చేసుకునే వస్తువుల పరిమాణాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా వస్తువుల దిగుమతి అనుమతించడం జరగదు; కేవలం దేశ అవసరాలకు అనుగుణంగా మాత్రమే దిగుమతులు ఉంటాయి. గతంలో ఎలాగైతే జరిగిందో, భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుంది.

సునీల్ జాఖడ్,
పంజాబ్ బిజెపి అధ్యక్షుడు