Automic Energy

అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంపు దిశగా భారత్ అడుగులు

ణు రంగాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ప్రత్యేకత. ప్రధాని నరేంద్ర మోదీ వినూత్నమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమైంది. 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, భారతదేశం ఇంధన అవసరాలు ప్రతి ఏటా విపరీతంగా పెరుగుతున్నాయి. 2047 నాటికి భారతదేశ విద్యుత్ డిమాండ్ మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. కానీ ఇప్పటికీ దాదాపు 70 శాతం విద్యుత్ ఉత్పత్తి శిలాజ ఇంధనాల నుంచే వస్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గిస్తూనే ఇంధన భద్రతను సాధించడం ద్వారా వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సుసాధ్యం చేయడం ఎలా అన్న సవాలును నేడు భారత్ ఎదుర్కొంటోంది. సుస్థిర, స్వయం సమృద్ధ ఇంధన భవిష్యత్తు కోసం భారతదేశం చేస్తున్న అన్వేషణలో అణుశక్తి ఒక కీలక స్తంభంగా ఆవిర్భవించింది. విద్యుదుత్పత్తి అత్యంత సాంద్రీకృత రూపాలలో అణుశక్తి ఒకటి. ఇక్కడ చిన్న మొత్తంలో ఇంధనం తక్కువ కర్బన ఉద్గారాలతో భారీ పరిమాణంలో విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. అణు వనరుల నుంచి 70 శాతానికి పైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ఫ్రాన్స్, ఈ సాంకేతికత తక్కువ కార్బన్ కాలుష్యంతో కూడిన వ్యూహానికి వెన్నెముకగా ఎలా నిలుస్తుందో నిరూపించింది.

భారత్ ఇంధన రంగంలో బహుముఖ సవాళ్ళను ఎదుర్కొంటోంది. దిగుమతి చేసుకున్న శిలాజ ఇంధనాలపై (చమురు, బొగ్గు) దేశం అధికంగా ఆధారపడటం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా, అంతర్జాతీయ ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా తరచూ సంక్షోభాలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో, అంతర్జాతీయ వాతావరణ ఒప్పందాలపై సంతకం చేసిన దేశంగా భారత్ తన కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు కట్టుబడి ఉంది. సౌర, పవన విద్యుత్ వంటి అనిశ్చిత పునరుత్పాదక వనరుల మాదిరిగా కాకుండా అణు విద్యుత్ వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా నమ్మదగిన కనీస ఉత్పత్తిని అందిస్తుంది. జలవిద్యుత్ కాలానుగుణ వైవిధ్యాలు, పర్యావరణ సమస్యలను, బొగ్గు తీవ్రమైన పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటుండగా అణు శక్తి స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని ఉపయోగించాలని భావించిన హోమీ భాభా దార్శనిక దృష్టితో రూపొందించిన మూడు దశల అణు కార్యక్రమం భారత్ అణు వ్యూహానికి కేంద్రబిందువు. ముఖ్యంగా 2070 నాటికి దేశం నికర జీరో కాలుష్య లక్ష్యం దిశగా పయనిస్తున్నందున అణుశక్తి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంధన రంగంలో స్వయంసమృద్ధిని సాధించడానికి దేశంలో పుష్కలంగా లభించే థోరియం నిల్వలను ఉపయోగించుకోవాలన్నది ఈ విధానం లక్ష్యం. భారత్ ప్రపంచంలోనే అత్యధిక థోరియం నిక్షేపాలను కలిగి ఉంది. 

స్వాతంత్య్రం వచ్చిన వెంటనే 1948లో అణుశక్తి కమిషన్ ఏర్పాటుతో భారతదేశ అణు ప్రయాణం ప్రారంభమైంది. 1956లో, ఆసియాలోనే మొదటి పరిశోధన రియాక్టర్ అప్సర, ట్రాంబేలోని భాభా అణుశక్తి పరిశోధనా కేంద్రం (బార్క్)లో ప్రారంభమైంది. ఈ తొలి అడుగులు ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన అణు కార్యక్రమాలకు పునాది వేశాయి. ఈనాడు భారతదేశ అణు ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 2013-14లో కేవలం 4,780 మెగావాట్లు మాత్రమే ఉన్న అణు సామర్థ్యం ప్రస్తుతం 70 శాతం పెరిగి 24 ఆపరేషనల్ రియాక్టర్లలో 8,180 మెగావాట్లకు చేరుకుంది. ఈ ప్లాంట్ల నుంచి వార్షిక విద్యుత్ ఉత్పత్తి 2013-14లో 34,228 మిలియన్ యూనిట్ల నుంచి 2023-24 నాటికి 47,971 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ప్రస్తుతం భారతదేశ విద్యుదుత్పత్తిలో అణువిద్యుత్ వాటా 3 శాతం కాగా, మొత్తం 15,300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం గల 21 రియాక్టర్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తయితే మొత్తం విద్యుదుత్పత్తిలో అణుశక్తి వాటా గణనీయంగా పెరుగుతుంది. సామర్థ్యాన్ని విస్తరించడం నుంచి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 700 మెగావాట్ల ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ (PHWR)ను 2023-24 గుజరాత్ లోని కక్రాపర్లో విజయవంతంగా ప్రారంభించడం స్వావలంబన దిశలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

 ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) 2024లో ప్రాథమిక సోడియం భర్తీ, సోడియం పంపుల కమిషనింగ్ తో సహా కీలకమైన ఘట్టాలను పూర్తిచేసుకోవడంతో దేశం అణు ఇంధన వలయ సామర్థ్యాలలో కూడా పురోగతి సాధించింది. దేశం PHWRల రూపకల్పన, నిర్మాణంలో ప్రావీణ్యం సాధించింది. 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పూర్తికావస్తుండటంతో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాంకేతికత రూపకల్పన దశ నుంచి వాస్తవరూపం దాల్చింది. ఇంధన వినియోగ సామర్థ్యాన్ని రెట్టింపు చేసి, థోరియం ఆధారిత మూడో దశకు రంగాన్ని సిద్ధం చేస్తున్నందున భారత అణు కార్యక్రమంలో రెండవ దశ కీలకమైనది.

స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (SMR), భారత్ స్మాల్ రియాక్టర్లు (BSR)లపై దృష్టి సారించడం అణు విద్యుత్ రంగంలో విప్లవాత్మక పరిణామం. 2033 నాటికి కనీసం ఐదు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆపరేషనల్ SMRలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని SMR పరిశోధన, అభివృద్ధికి బడ్జెట్లో రూ.20,000 కోట్లు కేటాయించారు. నిరూపితమైన భద్రత, పనితీరు రికార్డులతో 220 మెగావాట్ల PHWR (ప్రొటోటైప్ హెవీ వాటర్ రియాక్టర్లు)లను భూమి అవసరాన్ని తగ్గించడానికి నవీకరిస్తున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా వీటిని క్యాప్టివ్ పవర్ ప్లాంట్లుగా పరిశ్రమల సమీపంలో మోహరించడానికి అనుకూలంగా మారుస్తున్నారు. 

2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రస్తుత 8.18 గిగావాట్లతో పోలిస్తే చాలా ఎక్కువ. ఇందుకోసం దేశీయ సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించి వికసిత్ భారత్ కోసం అణుశక్తి మిషన్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా రష్యా, ఫ్రాన్స్, అమెరికాలతో అంతర్జాతీయ సహకారాన్ని పునరుద్ధరించారు. ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వాడలో అమెరికా సహకారంతో ఆరు 1,208 మెగావాట్ల అణువిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. భారత అణు విద్యుత్ సంస్థ, జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ (NTPC) భాగస్వామ్యంతో అశ్విని పేరుతో జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేసి అణువిద్యుత్ సౌకర్యాలను అభివృద్ధి చేయడం మరో కీలక పరిణామం. ప్రయివేటు రంగ భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి, అణుశక్తి చట్టం, అణు నష్టాలకు గాను పౌరులకు పరిహారం చెల్లించే చట్టాలకు సవరణలను పరిశీలిస్తున్నారు. 

ఇదిలావుండగా, భద్రతా విషయంలో భారత్ చరిత్ర ఆదర్శనీయంగా ఉన్నప్పటికీ ప్రజల అవగాహన, భద్రత గురించిన ఆందోళనలు అణుశక్తి రంగ విస్తరణను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. అణుశక్తి విభాగంలో మనం ‘భద్రత ముందు, ఆ తరువాతే ఉత్పత్తి’ అనే నియమాన్ని పాటిస్తాం. భారత అణు కేంద్రాల్లో రేడియేషన్ స్థాయిలు స్థిరంగా, ప్రపంచ ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నాయి. దశాబ్దం క్రితం కుడంకుళం ప్లాంట్ ఉద్గారాలు 0.081 మైక్రోసివర్ట్స్ నుంచి నేడు తగ్గిపోయి కేవలం 0.002 కు చేరుకున్నాయి. ఈ రంగం మరింత అభివృద్ధి చెందాలంటే భారీ విస్తరణ లక్ష్యాలకు, కఠినమైన భద్రతా నియమాలు, ప్రజల ఆమోదం, ఆర్థిక లాభదాయకతలకు మధ్య సమతుల్యత సాధించాల్సి ఉంటుంది. పునరుత్పాదక ఇంధనాలతో కలిసి దేశ అణు కార్యక్రమం భారత్ ఇంధన ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయగలదు.

జితేంద్ర సింగ్,
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి