maheshwar reddy

అసెంబ్లీలో కాంగ్రెస్‌ను ఎండగట్టిన బిజెపి ఎమ్మెల్యేలు

టీవలి బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో బిజెపి నేతలు అనేక ప్రజా సమస్యలు లేవనెత్తారు. అధికార కాంగ్రెస్ వైఫల్యాలను, బడ్జెట్ లోటుపాట్లను సభాముఖంగా ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన కాదని… మోసాల పాలన అని బిజెపి శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పది రకాల పంటలకు బోనస్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు సన్నబియ్యానికే పరిమితం చేశారని, కౌలురైతులకు గుర్తింపు కార్డులివ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మార్చ్ 13న ఆయన మాట్లాడుతూ… “రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో రుణమాఫీ లెక్క రూ. 49 వేల కోట్లు అని తేలితే… సీఎం మాత్రం గాంధీభవన్లో రూ. 42 వేల కోట్లు సరిపోతాయన్నారు. గవర్నర్ ప్రసంగంలో రూ. 26 వేల కోట్లతో రుణ మాఫీని పూర్తి చేశామని చెప్పించడం బాధాకరం. పేదల ఇళ్లు కూలుస్తున్న హైడ్రా బడాబాబుల జోలికి వెళ్లడం లేదు. పాతబస్తీకి వెళ్లే ధైర్యముందా? గతంలో ప్రభుత్వమే అనుమతిచ్చిన ఇళ్లను ఇప్పుడెలా కూలుస్తారు? నాడు అనుమతులిచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని హైకోర్టు ఆదేశించినా అమలు చేయడంలేదు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీని రద్దు చేయాలన్న రేవంత్ రెడ్డి… సీఎం అయ్యాక దాన్నే ఫ్యూచర్ సిటీ చేయడం వెనక మతలబేంటో చెప్పాలి. ముచ్చర్లలో రద్దన్న ఫార్మా సిటీ… కొడంగల్ లో ఫార్మా క్లస్టర్‌గా ఎలా అయింది? ఏదులాపురంను ఆదిలాబాద్‌గానే, ఇందూరును నిజామాబాద్‌గానే కొనసాగిస్తూ తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలి. రాష్ట్రంలో 6,000 ప్రభుత్వ పాఠశాలలను మూసేసే ప్రయత్నం జరుగుతోందనే విష యమై సీఎం వివరణ ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడపడం చేతకాదని అధికారపార్టీ ఒప్పుకుని రాజీనామా చేసి మళ్లీ ప్రజాతీర్పు కోరాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ఆర్థికస్థితి ఎలా ఉందో తెలియకుండానే అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం అంటే ఓ విజన్ డాక్యుమెంట్ గా ఉండాలని.. కానీ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఇందులో ప్రస్తావించలేదన్నారు. ఈ ప్రసంగం మాటలకే పరిమితమైందే తప్ప ఎక్కడా సుపరిపాలన కనిపించలేదన్నారు.

పదేండ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పది లక్షల కోట్లు ఇచ్చిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం చెప్పారని వెల్లడించారు. బీఆర్ఎస్ అవినీతిని కక్కించి 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ వాళ్లు అన్నారని, ఇప్పుడు ఏమైందని నిలదీశారు. గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటూ ఊదరగొట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ అంటూ ప్రచారం చేస్తోంది. 15 నెలల్లో రూ.1.63 లక్షల కోట్లు అప్పులు చేయడంలో రైజింగా? అని ఏలేటి ప్రశ్నించారు. శాసనసభలో బడ్జెట్ పై జరిగిన సాధారణ చర్చలో ఆయన మాట్లాడారు. “ఆర్బీఐ నుంచి బాండ్ల రూపేణా అప్పు తెచ్చుకునేందుకు ప్రభుత్వం మంగళవారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తోంది. ప్రభుత్వం ప్రతి నిమిషానికి రూ.కోటి చొప్పున రుణం తెస్తోంది. ఇది తెలంగాణ రైజింగ్ కాదు. ఫాలింగ్.. కాంట్రాక్టర్లు ఏకంగా సచివాలయంలోనే ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. బడ్జెట్లో కేవలం 11.50% మాత్రమే మూలధన వ్యయం ఉంది. అలాంటప్పుడు మీరు చెబుతున్నట్లు సమతౌల్యం ఎక్కడుంది.” అని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. 

గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం సీతారాంపూర్‌లోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూములను పరిశ్రమలకు ధారాదత్తం చేయడంపై విచారణ జరిపించాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీజీఐఐసీని స్థిరాస్తి సంస్థగా మార్చారని విమర్శించారు. పద్దులపై మార్చ్ 24న శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం నామమాత్రపు ధరకు 1,145 ఎకరాల దేవాలయ భూములు సేకరించి పరిశ్రమలకు ధారాదత్తం చేసిందని, ఇది పెద్ద కుంభకోణమని, ఆ భూముల్లో ఇప్పటికీ ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిధులు రావడం లేదని, దాంతో పంచాయతీల నిర్వహణ ఇబ్బందిగా మారిందని చెప్పారు. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లుపై మార్చ్ 17న ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ ”రాష్ట్రంలో 65 శాతం బీసీ న్యాయవాదులున్నా.. అడ్వొకేట్ జనరల్ గా అవకాశం రావడంలేదు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసు చేసే విషయంలోనూ బీసీలకు అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో ఓ కుటుంబంలో 22 ఓట్లుంటే… అయిదు పదవులున్నాయి. నల్గొండ జిల్లాలో ఒక కుటుంబంలో 11 ఓట్లుంటే ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో కుటుంబంలో 13 ఓట్లుంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉన్నారు. 2 కోట్లున్న బీసీల్లో మాత్రం 19 మందే ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం 42 శాతం రిజర్వేషన్లకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే అయిపోయిందని… ఇక ఏదైనా మాట్లాడొచ్చని అనుకుంటున్నారు. ముస్లిం రిజర్వేషన్ పెంపు ఆగిపోయిన నేపథ్యంలో ఈ బిల్లులోని సాంకేతిక అంశాలపైనా దృష్టిసారించాలి” అని సూచించారు.

భూములు అమ్మడంతోపాటు అప్పులు తీసుకురావడమే పరిపాలన కాదని, దానికి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సరిపోతారని పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్యాన్సర్ లా మారిందని ప్రభుత్వం చెబుతోందని.. అది చికిత్స చేసే స్థితిలో ఉందా.. లేదా.. అనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా మార్చ్ 24న ఆయన మాట్లాడుతూ “అమృత్ పథకం కింద కేంద్రం రూ.వేల కోట్లు మంజూరు చేసినా రాష్ట్ర వాటా విడుదల చేయని కారణంగా పురపాలికల్లో పనులు నిలిచిపోయాయి. మున్సిపాలిటీల టెండర్లను హైదరాబాద్‌లో కాకుండా స్థానికంగా నిర్వహించుకునేందుకు అనుమతించాలి. హెచ్‌ఎండీఏ పరిధిలో అభివృద్ధి పేరిట 25 చెరువుల్ని స్థిరాస్తి సంస్థలకు అప్పగిస్తే కబ్జా చేయడంపై చర్యలు తీసుకోవాలి. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలి. గత ప్రభుత్వ హయాంలో టీఎస్ ఫైబర్ పనులు జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం 15 నెలలైనా దానిపై దృష్టి సారించలేదు. తొమ్మిదేళ్లుగా మూతపడిన బీసీ, ఎస్సీ కార్పొరేషన్లను పునరుద్ధరించాలి. రంజాన్ సందర్భంగా మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చినట్టుగానే.. ఉగాదికి తెలుగు విద్యార్థులకు ఇవ్వాలి” అని కోరారు.

ఫసల్ బీమాకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించి రైతులకు అండగా ఉండాలని పాయల్ శంకర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనలో చేరిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతుల వాటా కూడా తామే కడ్తామని చెప్పిందని.. కానీ, ఇప్పటి వరకు ఆ విషయంపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, 317 జీవో వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, సీఎం ఈ అంశాలపై మాట్లాడటం లేదని పాయల్ శంకర్ పేర్కొన్నారు. దీనిని బట్టిచూస్తుంటే.. కాంగ్రెస్ నైజం ప్రస్తుత అసెంబ్లీలో బయట పడిందన్నారు. రాష్ట్రానికి అనేక అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు తెచ్చుకుంటున్న విషయాన్ని సీఎం అంగీకరించినట్టేనని పేర్కొన్నారు. రేవంత్ తీరు.. దిల్లీలో ప్రధాని మోదీతో దోస్తీ.. ఇక్కడ మాత్రం రాష్ట్ర బిజెపితో కుస్తీ అన్న తీరుగా ఉందని చెప్పారు. అక్బరుద్దీన్ మాట్లాడితే సీఎంకు ఎక్కడ లేని ఆనందం కలుగుతోందని, ఒకరు తానా అంటే మరొకరు తందానా అన్నట్టు తయారయ్యారని మండిపడ్డారు. వారి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడిందన్నారు.

ఇంచార్జి మంత్రుల వ్యవహారశైలితో ప్రతిపక్ష శాసనసభ్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వారిని నియంత్రించాల్సిన అవసరముందని కామారెడ్డి శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డి అన్నారు. మార్చ్ 18న శాసనసభ జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ.. “ఇంచార్జి మంత్రుల జిల్లా పర్యటనల సమయంలో స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పార్టీ ఇంచార్జిలు ప్రారంభోత్సవాలు చేస్తే ఎమ్మెల్యేలు ఎందుకు? శాసనసభలో నేను 84 ప్రశ్నలు అడిగితే ఎనిమిదింటికే సమాధానమిచ్చారు. ఇదీ శాసనసభ పరిస్థితి. విద్యాశాఖకు సంబంధించి ఒక్క సమాచారమూ ఇవ్వలేదు. 15 నెలలుగా ఇలాగే జరుగుతుంటే నేనే పద్ధతి మార్చుకోవాలా అని ఆలోచించుకోవాల్సి వస్తోంది..” అని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి, కలెక్టర్, అధికారులు లేకున్నా.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న వారిని పిచ్ఛాస్పత్రిలో వేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ప్రొటోకాల్ సమస్యను పరిష్కరించాలని కోరారు. మార్చ్ 22న అసెంబ్లీలో మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు తాను వెళ్లకున్నా.. ఓడిపోయిన అభ్యర్థితో శంకుస్థాపన చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ తో మాట్లాడారని, అయినా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. అలా అయితే ఓడిపోయిన వాళ్లందరినీ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టాలని సూచించారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని మాటిమాటికి చెప్పొద్దని, దీంతో పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకురారని పేర్కొన్నారు. అంతకుముందు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ ఆమోదిస్తున్నందుకు.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు రాకేశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.