6 గ్యారెంటీలకు పాతరేసిన రాష్ట్ర బడ్జెట్
ఫిబ్రవరి 19న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌ను పరిశీలిస్తే అంతా డొల్ల అని స్పష్టమవుతోంది. అంకెల గారడీతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసింది. ఎలాగూ ఖర్చు పెట్టేది లేదుగా అని చెప్పి బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసింది. ప్రభుత్వ ఆదాయం, రాబడిపై కనీస అవగాహన లేకుండా అంచనాలు రూపొందించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఆచరణకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీ హామీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దులు రూపొందించారు. 6 గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారు. మహిళలకు నెలకు రూ.2,500, కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, కాలేజీ వెళ్లే అమ్మాయిలకు స్కూటీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ గత బడ్జెట్‌లోనూ నయాపైసా కేటాయించలేదు. ఈ బడ్జెట్‌లోనూ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇచ్చే అంశంపై బడ్జెట్‌లో కేటాయింపులు జరపలేదు. విద్యా భరోసా ప్రస్తావనే లేదు. సీనియర్ సిటిజన్ల పెన్షన్ పెంపును ప్రస్తావించలేదు.
గత బడ్జెట్‌లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున నిర్మిస్తామని పేర్కొంటూ ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.7,500 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఆచరణలోకి వచ్చే సరికి నయా పైసా ఖర్చు చేయలేదు, ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదు. నేతన్నలను పూర్తిగా వంచించేలా బడ్జెట్‌లో కోత విధించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం ఏర్పాటు ఊసు లేదు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థల్లో పనిచేసే గిగ్ వర్కర్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయిస్తే, తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో ఆ ఊసే ప్రస్తావించలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఈ బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించింది. ఉద్యోగుల డీఏలు, పెండింగ్ సమ్యలు, పీఆర్సీ ప్రస్తావనే లేదు.
బడ్జెట్‌లో 15 శాతం నిధులు విద్యారంగానికి ఖర్చుచేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అసెంబ్లీ సాక్షిగా తుంగలో తొక్కారు. విద్యారంగానికి 2025-26 బడ్జెట్‌లో 7.5 శాతం నిధులే (రూ.23,108 కోట్లు) కేటాయించారు. తెలంగాణలో వైద్య, విద్యా రంగాల దుస్థితి దారుణంగా ఉంది. సర్కారీ ఆసుపత్రుల్లో సూది, మందులు, కాటన్ కూడా లేక అల్లాడుతుంటే నిధులు పెంచకుండా పేద రోగులను గాలికొదిలేసింది. అంబేద్కర్ అభయ హస్తం పేరుతో దళితులకు రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ బడ్జెట్‌లో కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. బీసీ సంక్షేమానికి ఏడాదికి 20వేల కోట్లతో ఐదేళ్లలో రూ.1లక్ష కోట్లు ఇస్తామని చెప్పినా అమలులో అతీగతీ లేదు. వివిధ కార్పొరేషన్లకు కూడా నిధులను విడుదల చేయకుండా వాటిని పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మార్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకంటే మైనారిటీలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమైనట్లుగా తేటతెల్లమైంది. బడ్జెట్ కేటాయింపులను చూస్తే ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ బిల్స్ సహా మాజీ సర్పంచులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్స్ అన్నీ ఎగవేసినట్లే కనిపిస్తోంది.
వ్యవసాయానికి రూ.72,659 కోట్లు అని గత బడ్జెట్లో చెప్పారు. అందులోనే రైతు రుణమాఫీ కలిపారు. కనీసం ఆ రుణమాఫీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. 20 లక్షల మందికి పైగా రైతులకు నేటికీ రుణమాఫీ కాలేదు. అయినప్పటికీ బడ్జెట్‌లో ఆ ఊసే ప్రస్తావించకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది రైతు కుటుంబాలను దారుణంగా వంచించింది. ఈసారి వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు కేటాయించారు. ఏ ఆకాంక్షలతోనైతే రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో.. వారి ఆకాంక్షలను తుంగలో తొక్కారు. కౌలు రైతులు, రైతు కూలీల సంగతి మరీ దారుణం. కౌలురైతులకు ఎకరానికి రూ.15వేలు, రైతు కూలీలకు ఎకరానికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ తెలంగాణలో ఇంతవరకు ఏ ఒక్క రైతు కూలీకి, ఏ ఒక్క కౌలు రైతుకు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం…. వాటికి కేటాయింపులు జరపలేదు.
2024-25 బడ్జెట్‌లో జీఎస్టీ ఆదాయాన్ని రూ.58,594 కోట్లుగా చూపించారు. కానీ సవరించిన అంచనాల్లో రూ.5వేల కోట్లు తగ్గించి, రూ.53,665 కోట్లుగా వెల్లడించారు. అంటే దాదాపు 8.5 శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. దీనికి కారణమేంటో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనలేదు. 2025-26 సంవత్సరానికి గానూ రూ.59,704 కోట్ల జీఎస్టీ వసూళ్లు ఉంటాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ అంచనాకు ప్రాతిపదిక ఏంటో స్పష్టం చేయలేదు. రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని పెంచడం ద్వారా ఆదాయం పెంచుకోవడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. 2024-25లో ఎక్సైజ్ టాక్స్ ద్వారా రూ.25,617 కోట్ల అంచనాలు ప్రకటించిన సర్కారు ఈ బడ్జెట్‌లో రూ.27,623 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలను మద్యానికి బానిసలు చేసి, ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టాలనేది కాంగ్రెస్ సర్కారు ఆలోచనగా కనబడుతోంది.
మొత్తం రూ.3.04 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.2.26 లక్షల కోట్లు (74%) రెవెన్యూ వ్యయంగా (వేతనాలు, సబ్సిడీలు, ఇతర ఖర్చులు), కేవలం రూ.36,504 కోట్లు (12%) మూలధన వ్యయంగా (మౌలికవసతులు, ఉద్యోగాలు, దీర్ఘకాల అభివృద్ధి ప్రాజెక్టుల మీద) ఖర్చు చేస్తున్నారు. బడ్జెట్‌లో 12 శాతం నిధులు మాత్రమే అభివృద్ధికి కేటాయించడం వారి దృక్పథాన్ని వెల్లడిస్తోంది. అభివృద్ధి కుంటుపడితే, ఆదాయం తగ్గుతుంది, ఆదాయం తగ్గితే రాష్ట్రం నష్టపోతోంది. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి.
బడ్జెట్ తీరుతెన్నులను విశ్లేషిస్తే కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పినట్లు కనిపిస్తోంది. ఆదాయ, వ్యయాలను చూస్తుంటే అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా కాంగ్రెస్ పాలన మారింది. గత బడ్జెట్‌లో రూ.60వేల కోట్ల అప్పులు తీసుకుంటామని చెప్పి రూ.1లక్షన్నర కోట్ల అప్పులు తీసుకున్నారు. (స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతో తీసుకున్న రుణాలు కలుపుకుని) ఇప్పుడు 74 వేల కోట్లు అని చెప్పారు, మరి ఎంత అప్పు తీసుకుంటారో చూడాలి. అప్పుల విషయంలో.. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును తలదన్నేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్‌లో గొప్పలు చెప్పిన ప్రభుత్వం… అప్పుల వివరాలను కూడా పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయలేదు. గత(2024-25) ఆర్థిక సంవత్సరంలో రూ.2.91 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణలోకి వచ్చేసరికి రూ.2 లక్షల కోట్లు కూడా ఖర్చయిన దాఖలాల్లేవు. గతంలో దళిత బంధు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 2023లో రూ.17 వేల కోట్లకు పైగా కేటాయించినా, ఆచరణలో మాత్రం నయాపైసా ఖర్చు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే దారిన నడుస్తోంది.
అంచనాలు భారీ.. కేటాయింపులు సారీ
దున్నపోతుకు పాలు పిండినట్లుంది రాష్ట్ర బడ్జెట్. అంచనాలు భారీ.. కేటాయింపులు, అమల్లో మాత్రం సారీ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. పదేళ్లపాటు బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అఖాతంలోకి నెట్టేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రాష్ట్రాన్ని పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసింది. గతేడాది బడ్జెట్ పెట్టినపుడు.. తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారు. మరి 15 నెలలపాటు పాలించిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారు. రైతులను, యువతను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, ఉద్యోగులను ఇలా ప్రతి వర్గాన్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూనే ఉన్నారు. అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా తప్పించుకుటోంది. ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించిన ఈ బడ్జెట్‌ను బిజెపి పూర్తిగా ఖండిస్తోంది.
-జి. కిషన్ రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

