PMABHS

ఆయుష్మాన్ పథకంలో తల్లిదండ్రులను చేర్పించడం ఎలా?

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) పరిధి విస్తరణతో ఆదాయంతో నిమిత్తం లేకుండా 70 సంవత్సరాలు అంతకుమించి వయసు గలవారు ఇప్పుడు ప్రయోజనం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోట్ల మంది వయోవృద్ధులకు ఆరోగ్య బీమా లభిస్తుంది. గతంలో కేవలం పేదవారికి, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు, ఆశా సిబ్బంది వంటి కొన్ని తరగతులకు చెందిన కార్మికులకు మాత్రమే ఈ ఆయుష్మాన్ భారత్ వర్తించేది. ద్వితీయ, తృతీయ స్థాయి చికిత్సల కోసం ఆస్పత్రిలో చేరే వారికి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు బీమా సదుపాయం లభిస్తుంది.

ప్ర: 70 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు ఈ పథకంలో ఎలా చేరాలి?

జ: 70 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు ఎవరైనా ఆయుష్మాన్ భారత్ వయోవృద్ధుల పథకం కోసం వెబ్‌సైట్‌ www.benefiiary.nha.gov.in లో గాని, ఆయుష్మాన్ యాప్ లో గాని తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ఆయుష్మాన్ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది. లబ్ధిదారులు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవడం చాలా సులభం. వారు ఆధార్ ఈ కేవైసీ ద్వారా తమ గుర్తింపును, అర్హతను ధ్రువీకరించుకుంటే సరిపోతుంది. లబ్ధిదారు వయస్సు, ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు వంటి వివరాలను ధృవీకరించడానికి ఆధార్ ప్రధానమైన పత్రంగా ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ ఒక్కటి ఉంటే చాలు.

ప్ర: యాప్ ను గాని, వెబ్‌సైట్‌ను గాని ఉపయోగించడం చేతగాని లబ్ధిదారుల పేర్లను వారి కుటుంబ సభ్యులు రిజిస్టర్ చేయవచ్చా?

జ: చేయవచ్చు. అర్హులైన లబ్ధిదారుల పేర్లను వారి కుటుంబ సభ్యులు లబ్ధిదారు పేరుతో మొబైల్ యాప్ లోనూ వెబ్‌సైట్‌లోనూ లాగిన్ అయ్యి నమోదు చేయవచ్చు. వారు చేయాల్సిందల్లా లబ్ధిదారు మొబైల్ నెంబర్ను టైప్ చేసి దానికి వచ్చిన ఓటీపీని అందులో వేయడమే. దాంతో నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. లేదా లబ్ధిదారులు దగ్గర్లోని (ఈ పథకం కింద) గుర్తింపు పొందిన ఆస్పత్రికి వెళ్లి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.

ప్ర: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) అమలులో ఎదురైన బెడ్లు దొరకపోవడం వంటి సమస్యలను ఏబీ-పీఎంజేఏవై పరిష్కరిస్తుందా?

జ: ఏబీ-పీఎంజేఏవై పూర్తిగా నగదు రహిత పథకం. ఆస్పత్రులు అర్హులైన లబ్ధిదారులకు అందించిన వైద్యానికి గాను వాటికి ప్రభుత్వం నేరుగా డబ్బులు చెల్లిస్తుంది. ఈ పథకం వర్తించే ఆస్పత్రులు లబ్ధిదారులకు తప్పనిసరిగా నగదు రహిత చికిత్స అందజేయాలి. ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే లబ్ధిదారులు ఏబీపీఎంజేవై వెబ్‌సైట్‌లో గాని, జాతీయ కాల్ సెంటర్ 14555 కి గాని లేదా ఈ మెయిల్, లేఖ, ఫ్యాక్స్ వంటి మార్గాల్లో గాని ఫిర్యాదులు చేయవచ్చు. గుర్తింపు పొందిన (ఎంపానెల్డ్) ఆస్పత్రి వైద్యం చేయడానికి నిరాకరిస్తే దాన్ని ప్రభుత్వం అత్యవసర ఫిర్యాదుగా పరిగణిస్తుంది. ఆస్పత్రి ఈ సమస్యను పరిష్కరించడానికి ఆరు గంటల సమయం ఇస్తుంది.

ప్ర: 70 ఏళ్లకు మించి వయస్సు ఉన్న వ్యక్తులు అప్పటికే ఏపీఎంజేవై కింద కవరేజీ కలిగి ఉన్న కుటుంబాలకు చెందిన వారైతే వారు మళ్ళీ పేర్లు నమోదు చేసుకోవాలా?

జ: అటువంటి లబ్ధిదారులు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీతో పీఎంజేఏవై వెబ్‌సైట్‌లో లేదా మొబైల్ యాప్ లో తిరిగి ధృవీకరణ చేసుకోవాలి. అప్పుడు వారు సీనియర్ సిటిజన్ పథకం పరిధిలోకి వస్తారు.

ప్ర: ఈ పథకం వర్తించే ఆస్పత్రుల జాబితా ఎక్కడ లభిస్తుంది? అనేక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులు ఇంకా ఈ పథకంలో చేరలేదన్న వార్తలు నిజమేనా?

జ: ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై పథకం కింద గుర్తింపు పొందిన ఆస్పత్రుల జాబితా www.dashboard.pmjay.gov.in వెబ్‌సైట్‌లో లభిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 30 వేల ఆస్పత్రులు ఈ పథకం కింద గుర్తింపు పొందాయి. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ నిర్వహించే ఈ పథకం కింద ఈ ఆస్పత్రులు లబ్ధిదారులకు చికిత్స అందించాలి. వీటిలో సెంటర్ ఫర్ సైట్ (దిల్లీ) మెడాన్టా-ది మెడిసిటీ (గురుగ్రామ్) మెట్రో హాస్పిటల్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ (నోయిడా), ఫోర్టీస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ (జైపూర్), యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ (ఘజియాబాద్) మొదలైన ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజారోగ్యం, ఆస్పత్రులు రాష్ట్రాల జాబితాలోని అంశం గనుక ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై పథకం కింద రాష్ట్రాలే ఆస్పత్రులను గుర్తించాల్సి ఉంటుంది.

ప్ర: ఈ పథకం కింద చికిత్స ఎలా పొందాలి? ఒకవేళ చికిత్స వ్యయం 5 లక్షల రూపాయలు దాటితే ఏమి చేయాలి?

జ: లబ్ధిదారులు ఏ గుర్తింపు పొందిన ఆస్పత్రికైనా వెళ్లి తమ ఆయుష్మాన్ కార్డు లేదా పీఎంజేఏవై గుర్తింపు కార్డులను ఇచ్చి చికిత్స పొందవచ్చు. ఆస్పత్రికి వెళ్లే ముందు లబ్ధిదారుడు తమకు ఏ చికిత్స అవసరమో ఆ చికిత్స అందించేందుకు పథకం కింద ఆస్పత్రికి గుర్తింపు ఉన్నదీ, లేనిదీ నిర్ధారించుకోవాలి. ఈ పథకం పరిధిలోని దాదాపు అన్ని చికిత్సలకు చికిత్స వ్యయం రూ.2 లక్షల లోపే ఉంటుంది. కనుక లబ్ధిదారుల ఆరోగ్య అవసరాలు తీర్చడానికి రూ.5 లక్షల పరిమితి సరిపోతుందని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. అంతేగాక రాష్ట్రీయ ఆరోగ్య నిధి కింద పేద వర్గాలకు చెందిన వారికి రూ.15 లక్షల వరకు వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం లభిస్తుంది. వీరు కూడా పీఎంజేఏవై పరిధిలోకి వస్తారు. పీఎంజేఏవై పరిధిలోకి రాని చికిత్సలకు రాష్ట్రీయ ఆరోగ్య నిధి కింద సహాయం లభిస్తుంది. అందువల్ల ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు ఏబీ-పీఎంజేఏవై అర్హులైన లబ్ధిదారుల వైద్య చికిత్సలకు భరోసా కల్పిస్తుంది.

ప్ర: దిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు ఏబీ-పీఎంజేఏవైలో చేరలేదు. ఈ రెండు రాష్ట్రాల్లోని వయోవృద్ధులు తమంతట తాముగా ఈ పథకంలో చేరవచ్చా?

జ: లేదు. ఈ రెండు రాష్ట్రాలు పీఎంజేఏవైని అమలు చేయకపోవడం వల్ల ఈ రాష్ట్రాల్లోని వయోవృద్ధులు ఈ పథకంలో చేరడం గానీ, ఏబీ-పీఎంజేఏవై ప్రయోజనాలను పొందడం గానీ సాధ్యం కాదు.