బీసీలను ముంచేందుకే ముస్లింలను బీసీల్లో కలిపిన కాంగ్రెస్

బీసీ రిజర్వేషన్‌లను 42 శాతానికి పెంచడానికంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బిల్లులు, ఆర్డినెన్స్ బీసీలను మరోసారి దగా చేసేలా ఉన్నాయి. ముస్లింలలో కొన్ని కులాలను ఈ 42 శాతం బీసీ రిజర్వేషన్లలో కలపడం బీసీలను ముంచడానికే అని స్పష్టమవుతోంది. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ ఇదేవిధంగా ముస్లింలను బీసీల్లో కలిపి, బీసీలకు కేటాయించిన ఎస్సై పోస్టుల్లో ముస్లింలను నింపి బీసీలను నిండా ముంచింది. తెలంగాణలోనూ అదే దగా చేసేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు మూల కారణం వేల సంవత్సరాలు వివక్షకు గురికావడం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు వేల సంవత్సరాలు వివక్షకు గురైన కారణంగా అంబేద్కర్ నాయకత్వంలోని రాజ్యాంగ కమిటీ వాళ్లకు 10 సంవత్సరాలకు రిజర్వేషన్లు ఇచ్చింది. దానిని తర్వాత ప్రభుత్వాలు పొడిగిస్తూ వచ్చాయి. బీసీలకు కూడా రిజర్వేషన్లు అవసరమని భావించి, దాని మీద పరిశోధన చేయడానికి బిజెపి పూర్వ సంస్థ జనసంఘ్ ముఖ్య భాగస్వామిగా ఉన్న జనతా పార్టీ ప్రభుత్వం నాలుగున్నర దశాబ్దాల క్రితమే మండల కమిషన్ ఏర్పాటు చేసింది. బిజెపి మద్దతుతో ఏర్పడ్డ వీపీ సింగ్ ప్రభుత్వం అదే మండల్ కమిషన్ ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయడంలో మొదటి నుంచి జనసంఘ్, బిజెపి ముందున్నాయి. కానీ చరిత్రలో కాంగ్రెస్ ఎన్నడూ బీసీలకు న్యాయం చేయలేదు. పైగా అంబేద్కర్, జగ్జీవన్ రాం సహా అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ అవమానించింది. 

ఎస్సీ, ఎస్టీ, బీసీల్లా ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు ఎన్నడూ వివక్షకు గురికాలేదు. 700 సంవత్సరాల ముస్లింల పాలనలో ముస్లింలు విశేష ఆదరణ పొందారు. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో క్రైస్తవులు విశేష ఆదరణ పొందారు. కాబట్టి వారికి రిజర్వేషన్లు కల్పించడంలో అర్థం లేదు. మత రిజర్వేషన్లు మరోసారి దేశ విచ్చిన్నతకు దారితీస్తాయి. అందుకే బిజెపి మత రిజర్వేషన్‌లను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తుంది.

యాభై ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఒక్క బీసీని ప్రధానిని చేయలేదు. యాభై ఏళ్లు తెలుగు రాష్ట్రాలను పాలించిన కాంగ్రెస్ ఏనాడూ బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు. మండల కమిషన్ ఏర్పాటులో కాంగ్రెస్ భాగస్వామ్యం ఏమాత్రం లేదు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ పాత్రలేదు. అధికార దాహంతో 6 గ్యారంటీలు, 420 హామీల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఒకటి. బీసీలకు న్యాయం చేస్తున్నామంటూ కాంగ్రెస్ ఉదయ్ పూర్ తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ దానిని అమలు చేసిన పాపాన పోలేదు. కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పటికీ, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 15 శాతం టికెట్లు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం అధికార దాహం, అబద్ధపు హామీలు, అవసరాల కోసం నిర్ణయాలు తప్ప ఏ అణగారిన వర్గంపై ప్రేమ, ఆదరణ, ఆచరణ లేవు.

ముస్లింలను సంతృప్త పర్చేందుకే కాంగ్రెస్ దేశాన్ని ముక్కులు చేసింది. మైనార్టీ కమిషన్, ముస్లింలకు ప్రత్యేక హక్కులు, ముస్లిం పర్సనల్ లా బోర్డు, వక్ఫ్ బోర్డు, ప్రార్థన స్థలాల చట్టం, మత రిజర్వేషన్లు.. ఇలాంటి దేశ విచ్ఛిన్నకర నిర్ణయాలెన్నో కాంగ్రెస్ తీసుకుంది. ఇప్పడు 42 శాతం బీసీ రిజర్వేషన్లలో కూడా ముస్లింలను కలిపి, వారికి చెందాల్సిన దాని కన్నా ఎన్నో రెట్లు రిజర్వేషన్లు ఇచ్చేందుకు డ్రామా ఆడుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం చేసింది కులసర్వేనా, జనసర్వేనా, కులగణనా, జనగణనా.. ఏమిటనేది స్పష్టత లేదు. మొన్న దిల్లీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో కూడా కులసర్వే అని చెప్పారు తప్ప, కులగణన అని చెప్పలేదు. వీరు చేసిన కులసర్వే పూర్తిగా తప్పులతడకలతో ఉంది. హిందూ బీసీలు 46 శాతం, ముస్లిం బీసీలు 10 శాతం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్ బీసీలు ఎంతమందో చెప్పలేకపోయింది. తెలంగాణలో క్రైస్తవులు ఎంత మంది ఉన్నారనే లెక్కే లేదు. వేలాది చర్చిలు ఉన్న తెలంగాణలో అసలు క్రైస్తవులే లేరా? కోర్టు ఆదేశం ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, ఆ కమిషన్ కు ఏమాత్రం సమయం ఇవ్వకపోవడం కాంగ్రెస్ బీసీలను దగా చేస్తుందన్న దానికి సంకేతం. ఇలాంటి సర్వేలు, కమిషన్ రిపోర్టులు న్యాయస్థానాల ముందు ఏమాత్రం నిలబడవు. సీఎం చెప్తున్నట్టు మత రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చడం సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకోకుండానే ఈ డ్రామాలు ఆడుతున్నాయని స్పష్టమవుతోంది. ఈ డ్రామాలో భాగస్వామి అయ్యేందుకు బిజెపి సిద్ధంగా లేదు. ఎస్సీ, ఎస్టీలతో పాటు అణగారిన వర్గాలైన బీసీలకు న్యాయం చేయడంలో బిజెపి ఎల్లప్పుడూ ముందుంటుంది, కానీ ఇలాంటి డ్రామాల్లో కాదు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి కుటుంబ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సహా ఎవరినైనా ఓటుబ్యాంకుగానే చూస్తారు తప్ప వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఇసుమంత ప్రేమ, నిబద్ధత, కార్యాచరణ ఉండదు. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలన్న జిహాదీ సంస్థల కుట్రల్లో భాగంగా హిందువులను చీల్చడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర ఇండీ కూటమి పార్టీలు  ఎల్లప్పుడూ భాగస్వాములు అవుతూనే ఉంటాయి. ఈ దేశ, ప్రజా విచ్ఛిన్నకర శక్తుల నుంచి భారతీయులను ఐక్యంగా ఉంచేందుకు నిరంతరం బిజెపి కృషి చేస్తూనే ఉంటుంది. ప్రస్తుత మోదీ నాయకత్వంలోకి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎన్నో సత్ఫలితాలను సాధించింది. బిజెపి ప్రభుత్వాలతోనే బీసీ, ఎస్సీ, ఎస్టీలు సహా అణగారిన వర్గాలకు సముచిత న్యాయం, ఆదరణ, అభివృద్ధి లభిస్తుంది.