స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపిస్తాం
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు దూకుడు పెంచాడు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి నల్గొండ, మెదక్ జిల్లాల్లో పర్యటించి శ్రేణులకు ఊపునిచ్చారు. జూలై 14, 15న ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో, జూలై 18న మెదక్ జిల్లాలో పర్యటించారు. ర్యాలీలు, సమావేశాలు, సదస్సులు తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ నుంచి జెడ్పీటీసీ వరకు, అన్ని స్థానాల్లో బిజెపి ప్రత్యక్షంగా పోటీ చేస్తుందని, బిజెపి అభ్యర్థులను గెలిపించే బాధ్యత తానే తీసుకుంటానని ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. పేదలకు ఉచిత రేషన్ నుంచి గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు స్మశానవాటికల వరకు అన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందని చెప్పారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయన్నారు. 7 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలతో యావత్ తెలంగాణలో బిజెపి బలంగా ఉందని, మరింత విస్తరిస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటే.. మిగిలింది ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, పాలనా వైఫల్యంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మారుస్తోందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణకు మోదీ చేస్తున్న సహాయాన్ని వివరించారు.
అడుగడుగునా ఘన స్వాగతం
జూలై 14న హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరిన రాంచందర్ రావుకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. చౌటుప్పల్ లో స్థానిక నాయకులు, కార్యకర్తలు.. చిట్యాలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారు.. నార్కట్‌పల్లిలో మహిళా సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడి నుంచి నల్గొండ చేరుకున్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడ మొక్కను నాటారు. నల్గొండలో నక్సలైట్ల ఘాతుకానికి బలైన గుండగోని మైసయ్య గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని వివిధ సంఘాలు, న్యాయవాదులు, డాక్టర్లు తదితరులతో భేటీ అయ్యారు. మధ్యాహ్న భోజనం అనంతరం నల్గొండలో కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, చింతా సాంబమూర్తి, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పల్లెబోయిన శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, మోచి, గీత, మత్స్య కార్మికులు రాంచందర్ రావును సన్మానించారు.
అక్కడి నుంచి సూర్యాపేట బయలుదేరారు. సూర్యాపేట బిజెపి జిల్లా కార్యాలయాన్ని రాంచందర్ రావు ప్రారంభించారు. కార్యాలయం ముందు బిజెపి జెండాను ఆవిష్కరించారు. అనంతరం సూర్యాపేటలో కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీలతా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేను వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామచందర్ రావు స్వగ్రామం కోదాడ నియోజకవర్గం నల్లబండగూడెం గ్రామంలో పర్యటించారు. అక్కడ స్థానికులతో ముచ్చటించారు. రాత్రి అదే గ్రామంలో బస చేశారు. మరునాడు జూలై 15న రాంచందర్ రావు స్థానిక సాయిబాబా గుడిలో పూజలు చేశారు. అక్కడి నుంచి కోదాడకు వెళ్లిన ఆయనకు రైతులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అక్కడ రామభక్త హనుమాన్ మందిరంలో పూజలు చేశారు. అనంతరం తెలంగాణ కోసం బలిదానమైన శ్రీకాంత చారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోదాడలో వివిధ వర్గాలతో సమావేశమయ్యారు.
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
రెండు రోజుల ఈ పర్యటనలో వివిధ కార్యక్రమాల్లో, సమావేశాల్లో, ప్రెస్ కాన్ఫరెన్సులో రాంచందర్ రావు మాట్లాడారు. నల్గొండ తనకు జన్మనిచ్చిన భూమి అని, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన నల్గొండ జిల్లాలో చేయాలని కోరుకున్నానని, పార్టీ కూడా అందుకు అనుమతిచ్చిందని తెలిపారు. వివిధ చోట్ల ప్రసంగిస్తూ.. ‘‘గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 6 హామీలతో పాటు అనేక వాగ్దానాలు చేసింది. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టింది. నిరుద్యోగులకు భృతి లేదు. ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు. ప్రజలు ‘ఎందుకు కాంగ్రెస్‌ను ఎన్నుకున్నాం’ అని బాధపడుతున్నారు.
రేషన్ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కృతజ్ఞత చెప్పకుండా దాన్ని తమ క్రెడిట్‌గా చెప్పుకుంటోంది. రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మలు తొలగించడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తున్న లబ్ధిదారులపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డులను పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతున్నదన్న సమాచారం అందుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరిట 42 శాతంలో 10 శాతం మతపరమైన కోటా చేర్చడం సరికాదు. సుప్రీం కోర్టు కూడా మతపరమైన రిజర్వేషన్లను నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేంద్రంపై నిందలు వేస్తోంది. బిజెపి 42 శాతం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. అందులోని 10 శాతం మతపరమైన కోటాకు మాత్రమే వ్యతిరేకం. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా వారిదే. మత రిజర్వేషన్ల వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతోంది. బీసీ వర్గాలు దీనిపై ఉద్యమానికి సిద్ధం కావాలి.
ఎరువుల కొరత ఉందంటూ కేంద్రంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కన్నా ఎక్కువగా 12 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది. అయినా యూరియాను బ్లాక్ మార్కెట్‌కు ఎలా ఆస్కారం కల్పించినట్లు? కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ పూర్తిగా జరగలేదు. రైతుబంధు నిలిచిపోయింది. రైతులకు అన్ని ఆర్థిక సహాయాలు ఆపేశారు. ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పనులు ఎందుకు నిలిచిపోయాయో స్పష్టతనివ్వాలి.
సీఎం రేవంత్ రెడ్డి తరచుగా దిల్లీకి వెళ్తున్నారు. రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు. రాహుల్‌కు కూడా రేవంత్ మీద నమ్మకం పోయింది. తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి కేంద్రంపై నిందలు వేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర అభివృద్ధి పట్ల దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం కల్పించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎయిమ్స్ (బీబీనగర్), సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే తయారీ యూనిట్, నిజామాబాద్ పసుపు బోర్డు, వందే భారత్ రైళ్లు, కొత్త రైల్వే లైన్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అందించింది. విశ్వకర్మ యోజన ద్వారా హస్తకళాకారులు, చేతివృత్తిదారుల కోసం నైపుణ్య శిక్షణ, వ్యాపార మద్దతు, ఆర్థిక సహాయం అందిస్తోంది. ముద్రా రుణాలు, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పథకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. కేంద్రం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల ద్వారా తెలంగాణ ప్రజలకు మేలు చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఏమీ ఇవ్వలేదంటూ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. పీఎం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఒక కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం దేశవ్యాప్తంగా అందిస్తున్నారు. కాని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు?
1985లో యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నేను బాధ్యతలు చేపట్టినప్పుడు, జిల్లాల్లో బిజెపి సభ్యత్వ సేకరణకు ఇన్చార్జ్గా పని చేశాను. అప్పట్లో కోదాడ నుంచి సైకిళ్లపై కొన్ని గ్రామాలకు వెళ్లి సభ్యత్వ సేకరణ చేశాం. నేడు సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి లాంటి నియోజకవర్గాల్లో లక్షకు పైగా బిజెపి సభ్యత్వాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3.5 కోట్ల జనాభాలో 40 లక్షల మందికి పైగా బిజెపి సభ్యత్వం పొందడం గర్వకారణం. బిజెపికి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు చూశారు. ఇప్పుడు బిజెపికి ఒక అవకాశం ఇవ్వండి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంది. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుతో నిరుద్యోగులు, రైతులు, మహిళలు, పేదలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తుంది.
నల్లగొండ జిల్లా ఉద్యమాల గడ్డ, త్యాగాల గడ్డ. అనేకమంది ఏబీవీపీ కార్యకర్తలు త్యాగాలు చేశారు. శ్రీనివాస్, మైసయ్య గౌడ్ వంటి వారు జాతీయవాదం కోసం ఈ గడ్డపై ప్రాణత్యాగం చేశారు. నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యం కలిగింది. ఇక్కడ కూడా కుటుంబ పాలన నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబం చేతిలో బానిసగా ఉంది. ఆ పార్టీకి బానిసగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. కుటుంబ పరిపాలనకు ముగింపు పలకాలంటే, బిజెపి అధికారంలోకి రావాల్సిందే. నల్గొండ జిల్లాలోని యువత, మహిళలు పెద్దఎత్తున బిజెపిలో చేరి, కుటుంబ రాజకీయాలను అంతమొందించేందుకు ముందుకు రావాలి.’’ అని అన్నారు.
మెతుకు సీమలో ఫుల్ జోష్
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు జూలై 18న ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు నర్సాపూర్‌లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షుడు రాధ మల్లేశం గౌడ్, ఇతర నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి మెదక్ ఏడు పాయల దేవాలయం చేరుకున్న ఆయన అమ్మవారికి పూజలు నిర్వహించారు. మెదక్ లో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మెదక్ పట్టణంలోని వివిధ సంఘాలు, న్యాయవాదులు, డాక్టర్లు, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, తదితరులతో భేటీ అయ్యారు. చేగుంట, తూప్రాన్‌లోనూ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
మెదక్ కార్యకర్తల సమ్మేళనంలో రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘‘1980లో బిజెపి ఆవిర్భావ సమయంలో మెదక్ జిల్లాకు యువమోర్చా ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించాను. ఆ సమయంలో సైకిళ్లపై తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి బిజెపి సిద్ధాంతాలను ప్రజలకు వివరించేవాళ్లం. ప్రస్తుతం ఇదే మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలుపొందారు. గతంలో ఆలే నరేంద్ర ఎంపీగా గెలిచారు. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా కూడా బిజెపి విజయాలు నమోదు చేసింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలంగా విస్తరించింది. ఇటీవల జరిగిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణలో 40 లక్షల మంది సభ్యత్వం పొందగా, ఉమ్మడి మెదక్ జిల్లాలోనే 8 లక్షల మంది సభ్యత్వం పొందారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అభివృద్ధి వేగంగా జరుగుతోంది. మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకూ తెలంగాణ అభివృద్ధి కోసం రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించింది. కాంగ్రెస్ నాయకులు నోరు విప్పితే అబద్ధాలు, అభాండాలు మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది. రైతుబంధు నిలిపివేశారు. రుణ మాఫీ పూర్తిగా చేయలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. కాంగ్రెస్ నేతల దిల్లీ యాత్రలు తప్ప, తెలంగాణలో పాలన పక్కకు పడేసారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టే ప్రజల ముందుకు వెళ్లడానికి వారికి మొహం రావడం లేదు.
మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందడం లేదు. రైతులు ఎంత అడిగినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మల్లన్నసాగర్ కోసం గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న భూములకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నేతలు మంత్రులుగా ఉన్నా అభివృద్ధి జరగలేదు. ఇందిరా గాంధీ మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ జిల్లా వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది.
దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే బిజెపి ఆలోచన. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనేది దశాబ్ధాలుగా ఉన్న డిమాండ్. పీవీ నరసింహా రావు ఎంపీగా ఉన్నప్పటి నుంచే దీని కోసం చర్చలు జరిగాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇది హామీగానే మిగిలిపోయింది. మోదీ ప్రభుత్వం కృషితో కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్లను నిర్మిస్తోంది. అలాగే కొత్త రహదారుల నిర్మాణానికి కూడా ముందుకొస్తోంది.
బిజెపి బీసీల పార్టీ. ప్రధాని మోదీ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. కేంద్ర కేబినెట్లో 20 మందికిపైగా బీసీ మంత్రులు ఉన్నారు. బిజెపిలో అత్యధిక సంఖ్యలో బీసీలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి కాంగ్రెస్ నేతలకు ఉంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బీసీ వర్గానికి చెందినవారిని ముఖ్యమంత్రిగా చేయాలి. బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసినది బిజెపినే. ఓబీసీలకు సంక్షేమ పథకాలను అందించేది కూడా బిజెపి.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు దాదాపు 50 సీట్లు ఉన్నా, బీఆర్ఎస్ అందులో 35 సీట్లు ముస్లింలకు కేటాయించింది. ఫలితంగా నిజమైన బీసీలకు నష్టం జరిగింది. కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా మతపరమైన రిజర్వేషన్లను తీసుకొచ్చి బీసీలను మోసం చేయాలని కుట్ర చేస్తున్నాయి. కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లాలి. బిజెపి సిద్ధాంతాలను, మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందో చెప్పాలి. యూపీఏ హయాంలో దేశవ్యాప్తంగా అవినీతి, దోపిడీ మాత్రమే జరిగింది. మోదీ ప్రభుత్వం అవినీతిరహిత పాలనను, సుపరిపాలనను అందిస్తోంది. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకుల సమన్వయంతో బిజెపిని గెలిపించేందుకు పూర్తి బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మరింత పెద్ద సభను నిర్వహిస్తాం.’’ అని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనతో ఉమ్మడి నల్గొండ, మెదక్ జిల్లాల్లోని బిజెపి నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

