Atmanirbhar Defence

భారత్ ‘ఆత్మనిర్భర్’ రక్షణ రంగం

Atmanirbhar Defenceప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన ఆత్మనిర్భర్ (స్యయంసమృద్ధ) భారత్,  మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు అనిశ్చిత యుగంలో క్లిష్టమైన సరఫరా వ్యవస్థలకు జరిగే అంతరాయం లేదా  విఘాతాల కారణంగా ఎదురయ్యే నష్టాలను తగ్గిస్తాయి. రష్యాతో సంఘర్షణలో ఇప్పుడు ఉక్రెయిన్ ఇటువంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానం (డిఏపి)-2020 రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, ఇతర ఉత్పత్తుల సేకరణ కాంట్రాక్టులలో 50 శాతం దేశంలోని సంస్థలకే ఇవ్వాలని నిర్దేశించింది. భారత్ లో నిర్వహణ, తయారీ సదుపాయాలను ఏర్పాటు చేయడానికి విదేశీ అసలు పరికరాల తయారీదారులను (ఓఈఎంలు) ప్రోత్సహించేందుకు కొత్త సేకరణ తరగతి ఒకదాన్ని సృష్టించారు.  అది ‘భారతదేశంలో అంతర్జాతీయ తయారీ’. ఇది విడిభాగాల స్వదేశీకరణకు ఉపయోగపడుతుంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అనేక ‘సానుకూల దేశీయకరణ జాబితాల’ను విడుదల చేసింది. ఇందులో దేశీయ వనరుల నుంచి మాత్రమే సేకరించవలసిన వస్తువులను ప్రస్తావించారు. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు ప్రస్తుతం విదేశాల నుంచి సేకరించే దాదాపు 5,000 వస్తువులు, మూడు సేవలు ఈ జాబితాలో ఉన్నాయి.

సృజన్ స్వదేశీకరణ పోర్టల్ ను ఆగస్టు 2020లో ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న 34,000కు పైగా వస్తువుల వివరాలు  పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. వీటిలో దాదాపు మూడో వంతు ఇప్పటికే స్వదేశీకరణ ప్రక్రియలో ఉన్నాయి. తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ లలో రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేశారు. ఇవి రూ.7,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. రూ.20,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన పెట్టుబడుల కోసం అవగాహన ఒప్పందాలు కూడా కుదిరాయి. నవంబర్ 2023లో ప్రముఖ స్వీడిష్ ఆయుధ కంపెనీ ఎస్ఏఏబి  కార్ల్ గుస్తావ్ ఎమ్4 రాకెట్ వ్యవస్థ తయారీకి మొట్టమొదటి నూటికి నూరు శాతం  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.

నౌకాదళ వేదికల నిర్మాణంలో కూడా ప్రశంసనీయమైన పురోగతి సాధించాం. ప్రధాన మంత్రి 2022 సెప్టెంబర్లో జాతికి అంకితం చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక భారత దేశ సముద్రయాన చరిత్రలోనే భారత్ నిర్మించిన అతిపెద్ద యుద్ధనౌక. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో సహా భారతీయ పరిశ్రమల రంగం అంతటా నౌకా నిర్మాణం కొత్త సాంకేతిక సామర్థ్యాలను సృష్టిస్తోంది. భారతీయ నౌకాదళానికి చెందిన యుద్ధనౌకల  డిజైన్ సంస్థ ‘ప్రాజెక్ట్ 17ఏ’ ఫ్రిగేట్‌లను ప్రారంభించింది. 2023 ఆగస్టులో జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ వింధ్యగిరి దీనికి తాజా ఉదాహరణ. అధునాతన రాడార్లు, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ సామర్థ్యాలతో పాటు క్షిపణులు, దీర్ఘశ్రేణి శతఘ్నులు, మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్లు,  ట్యాంక్‌ల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం అధిక శ్రద్ధ కనబరుస్తోంది. 

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) పనితీరుపై సమగ్ర సమీక్ష చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవల ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 21వ శతాబ్దపు సవాళ్లకు అనుగుణంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి, నవకల్పనల్లో దేశీయ సామర్థ్యాలను క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా నిర్మించడం డిఆర్డిఓ ప్రధాన లక్ష్యం. రక్షణ మూలధన సేకరణ బడ్జెట్ లో గణనీయమైన భాగాన్ని దేశీయ రక్షణ పరిశ్రమలకు మళ్లించాలని కేంద్రం నిర్దేశించింది. 2020-21 నుంచి రక్షణ రంగంలో మూలధన సేకరణ బడ్జెట్ లో దేశీయ ఉత్పత్తులపై ఖర్చు చేసే మొత్తం గణనీయంగా పెరిగింది. 2020-21లో దేశీయ సేకరణ కోసం మూలధన సేకరణ బడ్జెట్ లో 40 శాతం (రూ.52,000 కోట్లు) వెచ్చించగా అది 2023-24లో 75 శాతానికి (రూ.99,223 కోట్లు) పెరిగింది. అంతేకాకుండా 2022-23 నుంచి ఈ దేశీయ సేకరణ ఖర్చులో 25 శాతం ప్రైవేట్ రంగం నుంచి కొనుగోళ్లకు కేటాయించారు. ఈ కార్యక్రమాల ఫలితంగా భారతదేశ రక్షణ ఉత్పత్తి విలువ 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా రూ.లక్ష కోట్ల మైలురాయి దాటి రూ.1,08,684 కోట్లకు చేరుకుంది. ఇందులో ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

విశేషమేమిటంటే మొత్తం రక్షణ ఉత్పత్తుల విలువలో ప్రైవేట్ రంగ కంపెనీల వాటా  రూ.21,083 కోట్లు. అంటే దాదాపు 20 శాతం.  మిగతా భాగం జాయింట్ వెంచర్ కంపెనీలది. 2023-24లో రక్షణ ఉత్పత్తి లక్ష్యం రూ.1.35 లక్షల కోట్లు.   భారతదేశం తన రక్షణ ఉత్పత్తుల విలువ  2025 నాటికి రూ 1.75 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తోంది. ఎంఎస్ఎంఇలు, స్టార్టప్‌లు, వ్యక్తిగత ఆవిష్కర్తలు, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, విద్యాసంస్థలతో సహా పరిశ్రమలను రక్షణ ఉత్పత్తుల రంగంలో భాగస్వాములను చేసే ఉద్దేశంతో ప్రభుత్వం 2018లో ‘రక్షణ రంగంలో అద్భుత ప్రగతికి నవకల్పనలు’  (ఐడెక్స్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐడెక్స్ కింద ఐడెక్స్ ప్రైమ్ ఫ్రేమ్‌వర్క్ ను 2022లో ప్రారంభించారు.  ఇది సాంకేతికంగా అత్యున్నత స్థాయి ఉత్పత్తుల తయారీని ప్రారంభించడానికి రూ.10 కోట్ల వరకు గ్రాంట్-ఇన్-ఎయిడ్‌తో స్టార్ట్-అప్‌లకు మద్దతు ఇస్తుంది. 

టెక్నాలజీ అభివృద్ధి నిధి (టీడీఎఫ్) పథకం కింద ఒక్కో ప్రాజెక్టుకు నిధులను రూ 10 కోట్ల నుంచి రూ 50 కోట్లకు పెంచారు. స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు మద్దతుగా డిఆర్డిఓ ‘డేర్ టు డ్రీమ్’ నవకల్పనలు లేదా ఆవిష్కరణల పోటీని ప్రారంభించింది. 2023-24లో రక్షణ పరిశోధన, అభివృద్ధి బడ్జెట్‌లో నాలుగింట ఒక వంతు విద్యాసంస్థలకు, ప్రైవేట్ పరిశ్రమలకు కూడా కేటాయించారు. 2019లో స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) మొదటి సారిగా ఆయుధాలు ఎగుమతి చేసే మొదటి 25  దేశాల్లో భారత్ 23వ స్థానంలో ఉందని ప్రకటించింది. భారత్ 2025 నాటికి రూ.35,000 కోట్ల రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

సాయుధ దళాలలో మహిళలకు సమానమైన అవకాశాలను అందించే విధానాలను రూపొందించడానికి ప్రధానమంత్రి మోదీ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇది సైనిక సిబ్బందిలో దాగివున్న ప్రతిభను వెలికి తీసి సద్వినియోగం చేసుకునేందుకు సైనిక దళాలకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం చేపట్టిన నారీ శక్తి కార్యక్రమం దేశంలో పరివర్తన సాధించడంలో, ముఖ్యంగా  సాయుధ దళాలలో మార్పు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది. సాయుధ దళాలలో నియామకాలకు చాలా కాలంగా ప్రాథమిక కేంద్రాలుగా సేవలందించిన సైనిక  పాఠశాలల్లో   ఇప్పుడు పురుషుల ఆధిక్యానికి తెరపడింది. నేడు జాతీయ రక్షణ సంస్థ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) కూడా మహిళల కోసం తన తలుపులు తెరిచింది. ఈ మధ్య కాలంలో మహిళా అధికారుల సంఖ్య బాగా పెరిగింది.

2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యం నెరవేరాలంటే రక్షణ రంగం దృఢంగా,  స్వయంసమృద్ధంగా ఉండాలి. రక్షణ పరిశ్రమల రంగంలో జరుగుతున్న మార్పు వివిధ భాగస్వామ్య పక్షాలు  సంఘటితమై సమన్వయంతో దేశంలో కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు తెర తీసేందుకు రంగం సిద్ధం చేసింది. అదే షమయంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూ పోతోంది. అంతర్జాతీయ రక్షణ విలువ వ్యవస్థలో భారత్ అంతర్భాగంగా మారే రోజు ఎంతో దూరంలో లేదు.

సుజన్ చినోయ్