‘ఆడలేక మద్దెల ఓడు’ అంటున్న ప్రతిపక్షాలు
ఈనాడు దేశ రాజకీయ చర్చలో రెండు అంశాలు ఆధిపత్యం వహిస్తున్నాయి. ఒకటి ప్రతిపక్షాలకు సమానావకాశాలు లేవన్న ఆరోపణ. రెండు, ప్రజాస్వామ్య వ్యవస్థల అర్హతను, అధికారాలను ప్రశ్నించడం. ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థల అధికారాలను ప్రశ్నించేవారు చాలా మంది తమ అనాలోచిత చర్యలు, అవినీతి కార్యకలాపాల ఫలితంగా చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్న వారే. ప్రజల మద్దతు కోల్పోతున్న వారు కూడా వీరిలో ఉన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, అనేక ప్రాంతీయ పార్టీలు 2014 నుంచి జాతీయ ఎన్నికలతో పాటు పెద్ద రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో ఓడిపోతూ వస్తున్నాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి, ఎన్‌డిఎ విజయం సాధించాయి. ఏవిధంగా చూసినా ఎన్‌డిఎ కూటమి మరోసారి నిర్ణయాత్మక విజయాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉంది. ఎన్నికల్లో పదే పదే ఒడిపోతున్నందువల్ల కలిగే నైరాశ్యం, ఆగ్రహావేశాలను వ్యవస్థలపై ప్రదర్శించకూడదు. రాహుల్ గాంధీ మీడియాను, ఎన్నికల కమిషన్‌ను, న్యాయవ్యవస్థను కూడా దూషిస్తున్న బాధ్యతారాహిత్యమైన తీరు సిగ్గుచేటు. ఆయన ఆరోపణలను ప్రత్యక్ష ప్రసారం చేసే మీడియా మీదే ఆయన తప్పుడు ఆరోపణలు చేశారు. మళ్ళీ మీడియాకు స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏమి కావాలో ఓటర్లకు తెలుసు
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా భారత ప్రజాస్వామ్యం పరిణతి చెందిన తీరు పట్ల మనం గర్వపడాలి. దేశ ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. పనితీరు బాగాలేకపోయినా, బాధ్యతారహితంగా వ్యవహరించే, అవినీతికి పాల్పడే ఏ రాజకీయ పార్టీనైనా, నాయకుడినైనా కేంద్రంలో నైనా, రాష్ట్రంలో నైనా వారు ఎంత ప్రజాదరణ పొందిన వారైనా ఓడించగలమనే విశ్వాసంతో వారు ఉన్నారు. భారత ఓటర్లు ‘ప్రభుత్వ వ్యతిరేకత’ కథనాన్ని మార్చివేశారు. ఒక పార్టీ లేదా నాయకుడు మంచి పనితీరు కనబరిస్తే, ప్రజలు వారిపై నమ్మకం ఉంచి వారికి మరోసారి అధికారం ఇస్తారు. అదేవిధంగా పని చేయనివారికి శిక్ష విధిస్తారు.
ఓటర్ల ఇటువంటి ప్రవర్తన భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతంగా, స్థిరంగా మార్చింది. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే దేశాన్ని పరిపాలించడానికి ఎవరు సరిపోతారు, ఒక నిర్దిష్ట రాష్ట్రాన్ని నడపడానికి ఎవరు విశ్వసనీయమైన వారో ప్రజలు గ్రహించడం. భారతదేశాన్ని పరిపాలించడానికి ఓటర్లు తమను సమర్థులుగా భావించడం లేదనే వాస్తవాన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ అంగీకరించకపోవడమే ఇక్కడ అసలు సమస్య. మోదీ నాయకత్వం, పరిపాలన తీరును భారత ప్రజలు విశ్వసిస్తున్నారు. గత ప్రభుత్వ విధాన అచేతనత్వం, అవినీతి, ఉగ్రవాదంపై నిష్క్రియాపరత్వాలను ప్రజలు మర్చిపోలేదు. మోదీ వంటి శక్తిమంతమైన, నిజాయితీ గల, పనితీరుకు ప్రాధాన్యమిచ్చే నాయకుడు ప్రతి రంగంలో భారతదేశ ప్రతిష్టను ఎలా ఇనుమడింపజేయగలరో వారు చూశారు. పేదలకు అనుకూలమైన పాలన, సంక్షేమ పథకాలు అందించడం, మంచి ఆర్థికాభివృద్ధి భారతదేశాన్ని ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాయి, త్వరలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. భద్రతను పటిష్టం చేశాం, సరిహద్దు చొరబాట్లు, ఉగ్రవాదానికి దేశం వెంటనే తగిన సమాధానం ఇస్తోంది. భారతదేశం ఇప్పుడు ఎంతమాత్రం అసమర్థ దేశంగా కనిపించదు.
ఆత్మవిశ్వాస భారతావని
ప్రతికూల ఓటు బ్యాంకు రాజకీయాలను ఆశ్రయించకుండా ప్రధాని మోదీ దేశ నాగరికత, ఆధ్యాత్మిక విలువలను ఎలా నిలబెట్టారో కూడా భారతదేశ ప్రజలు గమనించారు. ఆహ్వానం అందినా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి ప్రతిపక్ష నాయకులు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. బుజ్జగింపు రాజాకీయాల పట్టు వారిపై ఎంత బలంగా ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. ఈ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు ముస్లిం మహిళలకు విముక్తి కల్పించేందుకు రూపొందించిన ట్రిపుల్ తలాక్ చట్టాన్ని వ్యతిరేకించాయి.
భారత ప్రజాస్వామ్యంతో పాటు భారతీయుల ప్రాథమిక హక్కులు, పౌర హక్కులకు రక్షణ కల్పించే న్యాయవ్యవస్థ గురించి కూడా మేం గర్విస్తున్నాం. రామజన్మభూమి వివాదంతో సహా అనేక చట్టాలను, తీర్పులను పక్కన పెట్టి న్యాయవ్యవస్థ చరిత్రాత్మక తీర్పులను వెలువరించింది. ఇది అధికరణం 370 రద్దును ధృవీకరించింది, అదేవిధంగా ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడికి బెయిల్ మంజూరు చేసింది. అయితే రాఫెల్ విమానాల కేసులో తీర్పుపై రాహుల్ గాంధీ న్యాయవ్యవస్థను విమర్శించారు. కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించినప్పుడు ఆయన క్షమాపణ చెప్పవలసి వచ్చింది. 97 కోట్ల ఓటర్లు, దాదాపు 10 లక్షల పోలింగ్ బూత్‌లున్న భారీ దేశంలో ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు విశిష్టమైన కృషి చేసింది.
విశ్వసనీయ, బలమైన వ్యవస్థలు
బీహార్‌కు చెందిన నాకు ఎన్నికల సమయంలో బ్యాలెట్ పేపర్‌లు లాక్కోవడం, బూత్ ల స్వాధీనం, హింస, హత్యలు సాధారణమైన బాధాకరమైన రోజులు ఎప్పుడూ గుర్తుంటాయి. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలకు సమానావకాశాలు ఉండేలా ఎన్నికల సంఘం అనేక సాహసోపేతమైన చర్యలు తీసుకుంది. ఈవీఎంలు ఓటింగ్ ప్రక్రియ పవిత్రతను పెంపొందించాయి. అనేక సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఈవీఎంల చెల్లుబాటును సమర్థించాయి. ప్రతిపక్షాలు ఓడిపోయినప్పుడు, వారు ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని బ్యాలెట్ పేపర్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చారు. కానీ వారు గెలిచినప్పుడు, వారికి ఈవీఎంలతో ఏ పేచీ లేదు. ఇది అసంబద్ధం, హాస్యాస్పదం. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం మాదిరిగానే కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికైందని మనం గుర్తుంచుకోవాలి. అఖిలేష్ యాదవ్ ఈవీఎంల ద్వారా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. సీపీఎం కూడా కేరళలో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లోనే గెలిచింది. ఇటీవల కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో ఈవీఎంల ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
మోదీ నేతృత్వంలోని బిజెపి జాతీయ ఎన్నికల్లోనూ, అనేక రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే విధంగా విజయం సాధించింది. ఈవీఎంలపై ప్రతిపక్షాల హాస్యాస్పదమైన వాదన న్యాయవ్యవస్థ పట్ల అవి అనుసరిస్తున్న వైఖరిలో భాగమే. కోర్టులు బెయిల్ ఇవ్వడం అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నాయనడానికి సంకేతం. కానీ కోర్టులు బెయిల్ తిరస్కరిస్తే న్యాయవ్యవస్థ పాడైపోయిందని, కేంద్రంలోని ప్రభుత్వంతో కుమ్మక్కైందని విమర్శించారు. ఇది కూడా వారిలో పేరుకుపోయిన నిరాశానిస్పృహలకు సంకేతం. కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి, జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ వంటి అనేకమంది నాయకులను జైల్లో పెట్టడం మనం మర్చిపోకూడదు.
ప్రధాని మోదీ కూడా సిక్కుగా మారువేషంలో తిరిగి ఒక ఆదర్శప్రాయమైన అజ్ఞాత ఉద్యమంలో భాగంగా ఎమర్జెన్సీని ఎదుర్కొన్నారు. చాలా మంది ప్రముఖ సంపాదకులను ప్రభుత్వం అరెస్టు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పక్కన పెట్టింది. వీరిలో ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులను సమర్థించిన జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా కూడా ఉన్నారు. ఎమర్జెన్సీపై పోరాడినందుకు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కి చెందిన దివంగత రామ్‌నాథ్ గోయెంకాకు నేను అభివందనం చేస్తున్నాను. ఆ రోజుల్లో వామపక్షాలలో ఒక వర్గం కాంగ్రెస్‌తో కలిసి నడిచిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి.
అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పాలనలోని కేంద్రం ముఖ్యమంత్రిపై కోపంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించింది. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేయడంలో కాంగ్రెస్ చేసిన పాపాలు అన్నీఇన్నీ కావు. వ్యవస్థలను నిందించే వారికి, సమానావకాశాలు లేకపోవడమే తమ పరాజయాలకు కారణమని సాకులు చెప్పే వారికి దేశ ప్రజలు మరోసారి తగిన గుణపాఠం చెబుతారని విశ్వసిద్దాం. ఎక్కువగా అనువంశిక పార్టీలే ఇటువంటి ఫిర్యాదులు చేస్తున్నాయి. వారి నాయకులు అవినీతికి పాల్పడ్డారు, అనేక సందర్భాల్లో దోషులుగా తేలారు.
రవిశంకర్ ప్రసాద్,
కేంద్ర మాజీ మంత్రి

