BJP Formation Day

తెలంగాణ ప్రజలకు అండగా, అభివృద్ధికి భరోసాగా బిజెపి

BJP Flag hoisting‘‘తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగవుతోంది. కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. తెలంగాణలో ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు అండగా, అభివృద్ధికి భరోసాగా భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది.’’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఎవరెంత తప్పుడు ప్రచారం చేసినా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ లాంటి వారు బిజెపిని ఏం చేయలేరన్నారు. నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి డబుల్ డిజిట్ తో మెజారిటీ స్థానాలు గెలుస్తుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఎగరేశారు. బిజెపి కార్యకర్తలు, ప్రజలకు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలకు, బిజెపి కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ‘‘1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. నేడు నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రతి కార్యకర్త ఆత్మవిశ్వాసంతో పని చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయింది. కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ లో జిన్నా రాజ్యాంగం నడిచేది. ఆర్టికల్ 370ని రద్దు చేసి.. నేడు జమ్మూ కశ్మీర్ లో కూడా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం. నరేంద్ర మోదీ నాయత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ము కశ్మీర్ ప్రజలకు అనేక రకాల హక్కులు కల్పించి, అభివృద్ధి చేస్తున్నాం.

హిమాచల్ ప్రదేశ్ లో లాల్ కృష్ణ అద్వానీ ఇచ్చిన హామీ ప్రకారం మోదీ నేతృత్వంలో అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగింది. ముస్లిం ఆడబిడ్డలకు సోదరుడుగా మోదీ అన్నిరకాల హక్కులు కల్పించి అండగా నిలబడ్డారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ విధానం ద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలనే లక్ష్యానికి అనుగుణంగా.. నరేంద్ర మోదీ నేతృత్వంలో పేద మహిళలకు ఇండ్ల నిర్మాణం, వంట గ్యాస్ కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ కార్డులు వంటి అనేక పథకాల ద్వారా సంక్షేమం అందుతోంది. ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోదీ నిలిచారు. ప్రపంచంలో భారత్ కు అత్యున్నత గౌరవం పెరిగింది. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపిలా మోదీ కృషి చేస్తున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు సాధించే లక్ష్యంతో ‘‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’’, ‘‘అబ్ కీ బార్ 400 పార్’’ నినాదాన్ని దేశంలో ఇంటింటా నినదిస్తున్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ రోజురోజుకీ కనుమరుగవుతోంది. కాంగ్రెస్ గ్యారంటీలను గాలికొదిలేసింది. గారడీ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి 100 రోజుల్లోనే అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ ఆ హామీలు అమలు కాలేదు. సీఎం రేవంత్ రెడ్డికి హామీల అమలుపై దృష్టి లేదు.. కాని, పార్టీ ఫిరాయింపులపై మాత్రమే దృష్టి ఉంది. ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. గ్యారంటీలను నమ్మి ప్రజలు ఓటేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన బాధ్యతను నిర్వర్తించడంలేదు.

తెలంగాణ అభివృద్ధి, ప్రజలకు సంక్షేమం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నారు. తెలంగాణలో బిజెపి బలమైన శక్తిగా ఎదుగుతోంది. రానున్న రోజుల్లో అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో బిజెపిని ఒక శక్తిశాలిగా తీసుకెళ్తాం. అందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరుతున్నాను. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి మెజారిటీ సీట్ల సాధించేలా అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్, బిజెపి నాయకులు డా. విజయ రామారావు, ఉమారాణి, జయశ్రీ, ఆనంద్ గౌడ్, కళ్యాణ్ నాయక్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.