భారత ప్రజాస్వామ్యంలో చీకటి శకం ఎమర్జెన్సీ
సరిగా 50 ఏళ్ళ క్రితం దేశంలో ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి శకాన్ని సూచిస్తుంది. 1975లో జూన్ 25 రాత్రి అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ అభ్యర్థన మేరకు, కనీసం మంత్రివర్గం తీర్మానం కూడా లేకుండా దేశవ్యాప్తంగా అంతర్గత అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఎమర్జెన్సీ జూన్ 25, 1975 నుండి మార్చి 21, 1977 వరకు అమలులో ఉంది. ఈ సమయంలో మొదటిసారి ప్రజల ప్రాథమిక హక్కులను తొలగించారు. పత్రికా స్వాతంత్రంపై గొడ్డలి పెట్టు అన్నట్టు సెన్సార్‌షిప్ అమలు జరిపారు. లక్ష మందికి పైగా ప్రతిపక్ష శ్రేణులను, స్వేచ్ఛకోసం నినదించిన విద్యార్థులు, యువత, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల కార్యకర్తలతో జైళ్లను నింపేసారు. హద్దులేని ప్రభుత్వ నిర్బంధాలు కొనసాగాయి. ప్రాథమిక హక్కులు అమలులో లేనందున ప్రభుత్వం ఎవరినైనా కాల్చి చంపినా కోర్టులు ప్రశ్నిపలేవని అంటూ దిల్లీ హైకోర్టులో ఓ ప్రభుత్వ న్యాయవాది వాదించారంటే ఎటువంటి నిరంకుశ వ్యవస్థ కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. అసమ్మతిని అణిచివేయడం, పౌర హక్కులను కాలరాయడం, మీడియాను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయడం జరిగింది.
జూన్ 12, 1975 నాటి అలహాబాద్ హైకోర్టు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటిస్తూ, ఆమె ఆరేళ్ల వరకు మరే ఎన్నికలో పాల్గొనరాదని తీర్పు ఇవ్వడంతో దేశంలో ఓ చీకటి పాలనకు అంకురార్పణ జరిపారు. అప్పటికే లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ప్రతిపక్షాలు, విద్యార్థి, యువజనులు అవినీతికి వ్యతిరేకంగా, సంపూర్ణ మార్పు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుపుతున్నారు. గుజరాత్ అసెంబ్లీకి అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చిన రోజుననే జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవినీతికి మారుపేరుగా నిలిచిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి చమన్ భాయ్ పటేల్ ప్రభుత్వం కూలిపోయి జనతా ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. దాంతో దేశంలో కాంగ్రెస్ పాలనకు చివరి ఘడియలు ఏర్పడ్డాయనే భయంతో అత్యవసర పరిస్థితికి పాల్పడ్డారు. ఇందిరా గాంధీ 1971 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుండి సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్‌ను ఓడించి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె ఎన్నికల అక్రమాలు, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమె ఎన్నికను రాజనారాయణ్ సవాల్ చేశారు. యశ్‌పాల్ కపూర్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే ఆమె వ్యక్తిగత ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగంకు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. ఇందిరా గాంధీ ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ, జస్టిస్ సిన్హా ఆమెను పార్లమెంట్‌కు అనర్హులుగా ప్రకటించడంతో పాటు ఎన్నుకోబడిన ఏ పదవిని నిర్వహించకుండా ఆరేళ్ల నిషేధం విధించారు. అయితే జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడిందనే సాకుతో అత్యవసర పరిస్థితి విధించడం గమనార్హం.
1971లో బాంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసిన పాకిస్తాన్‌తో ముగిసిన యుద్ధాన్ని ఓ సాకుగా చూపారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అత్యవసర పరిస్థితిని ప్రకటించాలనే ఆలోచనను వ్యతిరేకించినా, అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రేతో సహా కొంతమంది విధేయుల సలహాతో ఇందిరా గాంధీ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని చెబుతారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ “రాజ్యాంగతీత” శక్తిగా అవతరించి అనేక అక్రమాలకు, దూకుడు చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఏదో ఓ సాకు చూపడం కోసం ఎటువంటి సంబంధం లేకపోయినా ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలపై నిషేధం విధించి, వాటి నాయకులను జైళ్లలో ఉంచారు. ప్రతిపక్ష నాయకులు అందరూ జైళ్లలో ఉన్న సమయంలో పార్లమెంట్ లో ఎటువంటి చర్చ లేకుండానే రాజ్యాంగం పీఠికలో ‘సామ్యవాదం’, ‘లౌకికవాదం’ అనే అంశాలను చేర్చుతూ రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చారు. న్యాయవ్యవస్థ, పాలనా యంత్రాంగం పాలకుల విధానాలనే అనుసరించాలని విచిత్ర వాదనలను కాంగ్రెస్ నేతలు తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా నాడు లోక్ సంఘర్ష సమితి నేతృత్వంలో ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘ్, ఏబీవీపీ వంటి సంస్థలు కలిసి సాగించిన నిరసన ఉద్యమం, జరిపిన సత్యాగ్రహాలలో సుమారు 80 వేల మంది అరెస్ట్ అయ్యారు. భారత స్వాతంత్ర పోరాటంలో కీలకమైన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ 30 వేల మందికి మించి అరెస్ట్ కాలేదు. డా. సుబ్రమణ్య స్వామి వంటి వారు తప్పించుకొని విదేశాలకు వెళ్లి అంతర్జాతీయంగా భారత్ లో హక్కుల అణచివేత గురించి ప్రచారం చేశారు.
నిర్బంధాలను ఎదిరించి దేశంలో ఉధృతమవుతున్న నిరసన ఉద్యమాలు ఒకవైపు, అంతర్జాతీయంగా పెరుగుతున్న వత్తిడుల కారణంగా జనవరి, 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తొలగించి ఎన్నికలను ప్రకటించారు. వెంటనే జయప్రకాష్ నారాయణ్, జెపి కృపలానీ వంటి పెద్దల సారథ్యంలో ప్రతిపక్షాలు కలిసి జనతా పార్టీగా ఏర్పడి ఎన్నికలలో ఉమ్మడిగా పోటీచేశాయి. దేశంలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. నాటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం భవిష్యత్ లో మరోసారి అంతర్గత ఎమర్జెన్సీ విధించే అవకాశం లేకుండా రాజ్యాంగ సవరణ చేసింది. ఎమర్జెన్సీ విధించడం ఓ పొరపాటే అని అంగీకరించిన ఇందిరా గాంధీ, ఓటమి తర్వాత మరో వెయ్యేళ్ళ వరకు ఎవ్వరూ దేశంలో అటువంటి సాహసం చేయబోరని ప్రకటించటం గమనార్హం. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికలలో దారుణంగా ఓటమి ఎదుర్కొన్న ఇందిరా గాంధీ తమ కుటుంబానికి హితుడైన బ్లిడ్జ్ పత్రిక సంపాదకుడు కరంజియాను కలిసి నిఘా సంస్థలు గెలుస్తామంటేనే ఎన్నికలకు వెళ్లానని, కానీ ఎందుకు ఓటమి ఎదురైందని ప్రశ్నించారు. మీడియాపై ఆంక్షలు విధించడం వల్లనే జరిగింది అని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. మీడియాలో కేవలం ప్రభుత్వాన్ని పొగడ్తలతో నింపే కథనాలే ఉండడంతో వాస్తవాలు తెలుసుకొనే అవకాశం ఆమెకు లేకుండా పోయిందని, పత్రికలలో వాస్తవాలు ప్రచురించి ఉంటే తమ ప్రభుత్వంలోని పొరపాట్లను సరిదిద్దుకొనే అవకాశం లభించి ఉండేదని చెప్పారు.
ప్రజాస్వామ్య హక్కులను అణచివేసి, అసమ్మతికి అవకాశం లేకుండా చేస్తూ పాలన సాగించాలి అనుకొనే వారికి ఎమర్జెన్సీ ఓ విధంగా హెచ్చరికగా మిగులుతుంది. ఇటీవల ఎన్నికలలో కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్ వంటి వారు ఓటమి చెందడానికి ప్రధాన కారణం తమ పాలనలో ఏమి జరుగుతుందో వారు తెలుసుకోలేక పోవడమే. తమ చుట్టూ ఉన్న ‘కోటరీ’ మాటలతో పరిపాలన సాగించాలి అనుకొంటే ముప్పు తప్పదనే సంకేతం వెలువడింది. ప్రజాస్వామ్యంపై పుట్టుకగా పేరొందిన భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ఎమర్జెన్సీ వంటి సమయంలో సైతం ప్రదర్శించారు. తమకు ఎదురే లేదనుకున్న అత్యంత బలమైన పాలకులను శాంతియుతంగా, ఎన్నికల ద్వారా గద్దె దించగలిగారు. అందుకే భారత ప్రజల ప్రచండ శక్తికి ఓ నిదర్శనంగా ఈ కాలం నిలుస్తుంది.
ఆయుధాలతో విప్లవం తీసుకొస్తామంటూ మతిలేని హింసాకాండకు పాలపడుతూ వచ్చిన నక్సలైట్లు గాని, వర్గపోరాటం ద్వారా అధికారంలోకి వస్తామని కలలుగన్న సీపీఎం వంటి వామపక్ష పార్టీలు గాని ఎమెర్జెన్సీ వంటి ఆపత్కాల పరిస్థితులలో ప్రజా ఉద్యమాలు చేపట్టలేక మౌనంగా ఉండిపోవడం చూసాము. సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్న ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలే ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మొత్తం ప్రపంచం నివ్వెరపోయే విధంగా అతిపెద్ద ప్రజా ఉద్యమాన్ని శాంతియుతంగా నడపగలిగాయి.
చలసాని నరేంద్ర

