Shivraj Singh

మెరుగైన మార్కెట్ కావాలంటే పొలాలకు రోడ్లు వేయాలి

Shivraj Singhరీఫ్ పంట విత్తన సీజన్ ప్రారంభానికి ముందు విత్తనాలు, రసాయనాలు, ఉత్తమ పద్ధతులకు సంబంధించిన కొత్త సాంకేతికతల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ‘వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్’ పేరుతో మే 29 నుంచి జూన్ 12 వరకు 15 రోజుల దేశవ్యాప్త కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR), విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు చెందిన కనీసం నలుగురు శాస్త్రవేత్తలతో కూడిన 2,170 నిపుణుల బృందాలు 723 జిల్లాల్లోని 65,000 గ్రామాల్లో పర్యటించారు. ఈ అభియాన్‌లో భాగంగా కేంద్రమంత్రి తెలంగాణలో కూడా పర్యటించారు. ఈ సందర్భంగా ఒక జాతీయ ఆంగ్ల పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు: 

ప్ర: మీ అంచనా, రైతుల స్పందన ఎలా వున్నాయి? గత అవగాహనా కార్యక్రమాలకు ఈ యాత్ర ఎలా భిన్నంగా ఉంది?

జ: ఇప్పటికే లక్షల మంది రైతులతో మాట్లాడాం. ICARకు చెందిన 2,170 మంది శాస్త్రవేత్తల బృందం తొలిసారిగా రైతులతో నేరుగా సంభాషించి విలువైన అవగాహన కల్పించింది. రైతులు నేల నాణ్యత, పోషకాలు, తెగుళ్ల నియంత్రణ గురించి నేర్చుకుంటారు, అదే సమయంలో శాస్త్రవేత్తలు రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పొందుతారు. పూణేలోని కిసాన్ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించినప్పుడు, రైతులు తమ సమస్యలను పంచుకోవడానికి, పరిష్కారాలను అన్వేషించడానికి చక్కటి చొరవ చూపడం చూశాను. ద్రాక్ష, క్యాప్సికమ్, టమోటా, మిరప పెంపకందారులను కలిశాను. ఉద్యాన రైతులు గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను, చాలా మంది యువకులు వ్యవసాయానికి తిరిగి వస్తున్నారు.

ప్ర: భారతదేశం ఎక్కువగా ఉత్పత్తి చేయని ఆవాలు, పప్పుధాన్యాల వంటి పంటలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఇటీవలి సమాచారం ఆవాల ఉత్పత్తిలో క్షీణతను చూపిస్తుంది. ఇప్పటికీ దేశం అవసరమైనన్ని పప్పుధాన్యాలు పండించలేకపోతోంది. 

జ: పప్పుధాన్యాలు, నూనెగింజలకు సంబంధించిన మన ఉత్పత్తి అవసరాలను తీర్చలేక దిగుమతులపై ఆధారపడుతున్న మాట వాస్తవమే. అయితే, మేం మొత్తంగా మన ఉత్పత్తిని పెంచాం. పప్పుల ఉత్పత్తి చూస్తే గత ఏడాది 242.5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ ఏడాది 2024-25లో 252.4 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. అయితే కందిపప్పు ఉత్పత్తి తగ్గింది. రాప్ సీడ్, ఆవాలు ఉత్పత్తి అంచనాలు గత ఏడాది 132.6 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 126.06 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గాయి. నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు ఎలా తీసుకెళ్లాలనే అంశంపై కూడా ఈ యాత్ర దృష్టి సారించింది.

ప్ర: పూణెలో సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో ద్రాక్ష, టమోటాల రవాణాపై ప్రభావం పడింది. వ్యవసాయ సబ్సిడీలు అందుకోవడంలోనూ జాప్యం జరుగుతోంది?

జ: ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) లేదా గ్రామీణ రహదారి నిర్మాణ కార్యక్రమం కింద మా ప్రభుత్వం అన్ని గ్రామాలను సమీప పట్టణాలు, నగరాలు, జిల్లా కేంద్రాలతో అనుసంధానించింది. కానీ పొలాలను సమీప రహదారులకు అనుసంధానం చేయడం రాష్ట్ర ప్రభుత్వాల విధి. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాను మెరుగుపరచడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పొలాలను రహదారులకు అనుసంధానించడానికి పథకాలు ప్రకటించాయి.

ప్ర: 2022-23 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని ఒక తాజా నివేదిక వెల్లడించింది. మొత్తంగా 25 శాతం లోటు ఉంది. ఎంఎస్పీని చట్టబద్ధం చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది?

జ: అలాంటి నివేదికలతో నేను ఏకీభవించను. రైతుల పరిస్థితి తెలుసుకోవాలంటే నాతో పాటు పొలాల్లోకి రండి. వివిధ రాష్ట్రాలకు వెళ్లి కూరగాయలు, ద్రాక్ష ఉత్పత్తుల ద్వారా లక్షల్లో సంపాదిస్తున్న రైతులను చూస్తున్నాను. రైతుకు కనీస భరోసా ఇవ్వాలి, కానీ అది పరిష్కారం కాదు. పంటల వైవిధ్యం, ఉత్పత్తిని పెంచడం, వ్యయాలను తగ్గించడం, అంతర పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతర పంటలు వేయడం ద్వారా ఎన్నో పంటలు పండించుకోవచ్చు. ఈ యాత్రలో చాలా మంది అభ్యుదయ రైతులు తమ పొలాల్లో వివిధరకాల పంటలు పండించడం ద్వారా వారి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకున్న ఉదంతాలను నేను తెలుసుకున్నాను. వారి సమస్యలను కూడా అర్థం చేసుకుని ఇతర రైతులు వారిని స్ఫూర్తిగా తీసికునేందుకు వాటి పరిష్కారానికి కృషి చేస్తాను.

ప్ర: ప్రభుత్వం జిల్లా స్థాయి వ్యవసాయ సేవలను నిలిపివేయడంతో సకాలంలో వాతావరణ వివరాలు రాలేదని రైతులు వాపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను ఆదుకునేందుకు ఈ సేవలను పునరుద్ధరించాల్సిన అవసరం లేదా?

జ: డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద పంటలను రక్షించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలకు సంబంధించి రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికింద ఆధునిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించేందుకు డిజిటల్ ప్లాట్ ఫారాలను సృష్టించబోతున్నాం. ప్రతి పంచాయతీ, మండలంలో ఏఐ నమూనాతో అధునాతన రెయిన్ గేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ముందస్తు హెచ్చరిక వ్యవస్థల గురించి అధిక నిర్దిష్టతతో రైతులకు ఈ కొత్త సాంకేతికత సహాయపడుతుంది.

ప్ర: ఇటీవల జన్యువులను సవరించిన రెండు వరి వంగడాలను విడుదల చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న జన్యు మార్పిడి పంటలకు, వీటికి తేడాలేదని వీటిని వ్యతిరేకించేవారు ఆరోపిస్తున్నారు?

జ: కొందరు తరచూ కొత్త టెక్నాలజీ చుట్టూ వివాదాలు సృష్టిస్తుంటారు. పరిమిత ప్రాంతాల్లో వరి ఉత్పత్తిని పెంచడానికి, దాదాపు 50 లక్షల హెక్టార్ల వరి సాగు స్థానంలో పప్పుధాన్యాలు, నూనె గింజలు పండించేందుకు మేం వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి కట్టుబడి ఉన్నాం. కమల, పూసా డీఎస్టీ రైస్ 1 అనే రెండు వరి రకాలు భారతదేశ వరి పొలాలను మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి, ఇవి ఉత్పాదకతను వరుసగా 30 శాతం, 20 శాతం పెంచుతాయి. రెండు రకాలు కరవును తట్టుకుంటాయి, త్వరగా పండుతాయి, తక్కువ మీథేన్ ఉత్పత్తి చేస్తాయి, తక్కువ నత్రజని తీసుకుంటాయి. 1989 పర్యావరణ (రక్షణ) చట్టంలోని నిబంధనలు 7-11 లో పేర్కొన్న బయోసేఫ్టీ నిబంధనల నుండి దీనిని మినహాయించాలని మేం నిర్ణయించుకున్నాం. ప్రస్తుత జన్యు సాంకేతికత బయటి సూక్ష్మజీవులు లేదా బ్యాక్టీరియాను చేర్చకుండా స్థానిక పంట జాతులకు చెందిన జీవులను ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను పెంచుతుంది. అందువల్ల ఇది నియంత్రణల పరిధిలోకి రాదు. 

ప్ర: మీరు గత సంవత్సర కాలంగాను, ఇప్పుడు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ సమయంలోను అధికారులను, శాస్త్రవేత్తలను కలిశారు. వారి అభిప్రాయం ప్రకారం భారతీయ వ్యవసాయం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి?

జ: ఎవరైనా చెబితేనే నాకు సమస్యలు తెలుస్తాయని కాదు. నేను పొలంలో నివసిస్తున్నాను. కానీ పరస్పర సంబంధాలు సమస్యల వివిధ కోణాలను వెల్లడిస్తాయి. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన నాయకత్వంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 40 శాతానికి పైగా పెరిగిందన్న మాట నిజం. ఈసారి కూడా మునుపెన్నడూ లేనంత అధికోత్పత్తి సాధించాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తిలో చాలా వృద్ధి సాధించాం. మన శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేస్తున్నారు. పనులు జరుగుతున్నాయి, కానీ ప్రధాని సంకల్పమైన వికసిత్ భారత్ కోసం అభివృద్ధి చెందిన వ్యవసాయం, సంపన్న రైతులు కీలకమని నమ్ముతున్నాను. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ బృందాలు, పరిశోధక శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అభ్యుదయ రైతులు ఇలా వ్యవసాయంలో పనిచేసే అన్ని శక్తులు ఒకే దిశలో పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం నాకు ఆ లోటు కనిపిస్తోంది. వివిధ దిశల్లో పనులు జరుగుతున్నాయి. అందుకే ‘ఒక దేశం, ఒక వ్యవసాయం, ఒక బృందం’ను తీసుకొచ్చాం. ఆ బృందం ఇప్పుడు పొలాల్లో రైతుల మధ్య కూర్చుని వారితో మాట్లాడుతోంది.

ప్ర: వ్యవసాయ భూములు తగ్గిపోతున్నాయి, రైతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ధోరణిని మీరు ఎలా చూస్తారు?

జ: భూమి తగ్గుతున్నా సాంకేతిక పరిజ్ఞానం మారుతోంది. ఉదాహరణకు, మేం ఇప్పుడు పైన సోలార్ ప్యానెళ్ళు, కింద పండ్లు, కూరగాయలను పెంచడంపై ప్రయోగాలు చేస్తున్నాం. తక్కువ భూమి అవసరమయ్యే చాలా చోట్ల నీళ్లలో పంటలు పెంచే విధానం (హైడ్రోపోనిక్స్) ప్రారంభమైంది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వేగంతో నగరాలు విస్తరించి, సాగుభూమి క్రమంగా తగ్గుతుంది. తక్కువ భూమిలో ఎక్కువ ఉత్పత్తి చేయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది, అది జరుగుతోంది.

ప్ర: రహదారుల నిర్మాణం కోసం వ్యవసాయ భూముల మళ్లింపుపై ప్రభుత్వంలో ఏ స్థాయిలోనైనా మీరు ఆందోళన వెలిబుచ్చారా?

జ: విజ్ఞతతో ఆలోచించాలి. హైవేలు కావాలి, ఓడరేవులు కావాలి, రైల్వే లైన్లు కావాలి, విమానాశ్రయాలు కావాలి, పరిశ్రమలు కావాలి, వ్యవసాయం కావాలి. వ్యవసాయం లేకుండా భారతదేశం నడవదు. దేశం మొత్తం గురించి ఆలోచిస్తే చాలా విషయాలు మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.

ప్ర: ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ముగిసింది. ఇక తదుపరి దశ ఏమిటి?

జ: ప్రతి రాష్ట్రం ఒక నోడల్ అధికారిని నియమిస్తుంది, అతను శాస్త్రవేత్తలతో కలిసి ప్రతి ప్రాంతం, వ్యవసాయ-వాతావరణ జోన్ నుండి నివేదికలను సంకలనం చేస్తాడు. ఈ వివరాలను సేకరించిన తరువాత, మేం నిపుణులతో కలిసి వినూత్న వ్యవసాయ వ్యూహాన్ని అభివృద్ధి చేస్తాం. అత్యాధునిక శాస్త్రీయ పద్ధతుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, రైతుల ఆదాయాలను పెంచడం లక్ష్యంగా ‘స్వయం సమృద్ధ భారతదేశం’ కోసం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను ఈ కార్యక్రమం నిజంగా ప్రతిబింబిస్తుంది. అందరం కలిసి ఉజ్వల భవిష్యత్తును పెంపొందించుకోవచ్చు!