BJP flag

బిజెపి విశిష్టతను ప్రతిబింబించే నవ నాయకత్వం

భారతీయ జనసంఘ్ (BJS) స్థాపించి ఈ ఏడాదితో 75 వసంతాలు పూర్తవుతున్నాయి. ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించడంలో తమ ఉద్దేశం ఏమిటో ఆ సంస్థ వ్యవస్థాపకులకు స్పష్టమైన అవగాహన ఉంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మాటల్లో చెప్పాలంటే.. ఇతర పార్టీల మాదిరిగా జనసంఘ్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన ‘అసంతృప్త లేదా నిర్లక్ష్యం చేయబడిన’ నాయకుల బృందంతో ఏర్పడిన పార్టీ కాదు. ఈ ఉద్దేశం వెనుక ”కాంగ్రెస్ దృక్పథంతోనూ, విధానాలతోనూ ప్రాథమికంగా విభేదించే” వారు ఉన్నారు.

బీజేఎస్, నేటి బిజెపి కనీసం నాలుగు అంశాల్లో ఇతర రాజకీయ పార్టీల కంటే భిన్నంగా నిలుస్తాయి:

  1. అంతర్గత ప్రజాస్వామ్యం
  2. ‘దేశమే సర్వోన్నతం’ సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం
  3. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు కార్యకర్తలను తీర్చిదిద్దడం
  4. పాలనలో సమర్థత ప్రదర్శించడం

దేశంలోని చాలా రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా బిజెపి జాతీయ స్థాయిలో మాత్రమే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా వారసత్వ రాజకీయాలకు ఎప్పుడూ తావివ్వలేదు. ఎల్. కె. అద్వానీ నుంచి జె పి నడ్డా వరకు ఏ జాతీయ అధ్యక్షుడూ తమ పిల్లలను రాజకీయంగా ప్రోత్సహించడం గురించి ఆలోచించలేదు. పార్టీ ముఖ్యమంత్రుల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. నేటికీ, పక్కాగా నిర్ణయించిన అంతర్గత ఎన్నికల క్యాలెండర్‌ను అనుసరిస్తున్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమే. భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకోవడానికి ఏళ్ల తరబడి ఒక వ్యవస్థను ఇది అభివృద్ధి చేసుకుంది. అందుకే బిజెపిలో ఎన్నడూ నిలువునా చీలికలు రాలేదు.

స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ ప్రధాన జాతీయవాద శక్తిగా ఉండేది. కానీ 1947 తర్వాత అధికారం కోసం అది తన కీలక సిద్ధాంతాలను వదులుకుంది. ముస్లిం ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి జాతీయవాదం అనే సాంస్కృతిక నేపథ్యం నుంచి కాంగ్రెస్ వైదొలిగింది. సంపద సృష్టికర్తలకు వెన్నుపోటు పొడిచి, వామపక్ష పార్టీలతో చేతులు కలిపి ‘లైసెన్స్-పర్మిట్ రాజ్’ వర్థిల్లడానికి కారణమైంది. అంతేకాకుండా ప్రజాస్వామ్య సూత్రాలను గాలికొదిలేసి పార్టీ పగ్గాలను ఇందిరా గాంధీకి, ఆమె కుటుంబానికి అప్పగించింది. దీనికి విరుద్ధంగా 1990 లేదా 1999లో అధికారం కోల్పోయినప్పుడు కూడా అలాగే అసోం గణ పరిషత్, తెలుగుదేశం పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూటమిని వీడినప్పుడు కూడా బిజెపి తన సైద్ధాంతిక మూలాలను కోల్పోలేదు.

బిజెపి విలక్షణంగా నిలబెట్టే మూడవ అంశం దాని సంస్థాగత పనితీరు. బిజెపిలో జాతీయ లేదా రాష్ట్ర స్థాయి ‘సంస్థాగత (సంఘటనా) ప్రధాన కార్యదర్శి’ పదవికి కేవలం అధికారిక హోదా మాత్రమే కాదు, నైతిక అధికారం కూడా ఉంటుంది. విధాన పరిశోధన, సుపరిపాలన కోసం నిర్మాణాత్మక విభాగాలను కలిగిన ఏకైక పార్టీ బిజెపి. నియామకం నుంచి శిక్షణ ద్వారా కార్యకర్తలను మెరుగుపరచడం వరకు ప్రతి స్థాయిలో తదుపరి తరం నాయకులను ఇది సిద్ధం చేస్తూనే ఉంది. అయితే బిజెపి విశిష్టతను చాటిచెప్పే అత్యంత ముఖ్యమైన అంశం పాలనలో దాని పనితీరు. 70వ దశకం చివరలో రాజస్థాన్‌లో భైరాన్ సింగ్ షెకావత్ లేదా హిమాచల్ ప్రదేశ్‌లో శాంతా కుమార్ శర్మ వంటి హేమాహేమీలు నేతృత్వం వహించిన రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రశంసలు పొందాయి. పొఖ్రాన్-II అణు పరీక్షలు, నూతన రాష్ట్రాలను సాఫీగా ఏర్పాటు, పార్లమెంటు ఉమ్మడి సమావేశం ద్వారా పోటా (ఉగ్రవాద నిరోధక) చట్టాన్ని తీసుకురావడం వంటి పలు అంశాల్లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి సాధించిన అద్భుత విజయాలను చరిత్రకారులు కాదనలేరు. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో ఎదగడానికి కూడా పాలనా రంగంలో ఆయన సాధించిన విశేష విజయాలే కారణం. సుపరిపాలనను ఎలా వాస్తవం చేయవచ్చో ఆయన నిరూపించారు. బిజెపి ఇవన్నీ సాధించగలిగింది ఎందుకంటే దానికి ‘లక్ష్యం’ విషయంలో ఎప్పుడూ సందిగ్ధత లేదు. దాని స్పష్టమైన సిద్ధాంత దృక్పథమే విధానాలకు పునాది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిరంతరం స్ఫూర్తినిచ్చే వనరుగా, బలమైన మద్దతుగా నిలుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం, ‘ది ఎకనామిస్ట్’ పత్రిక ప్రధాన ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ పార్టీలను ”ఖాళీ పాత్రలు”గా అభివర్ణించింది. ఒకప్పుడు అంటరాని పార్టీగా పరిగణించబడిన బిజెపి నేడు ఆ వర్ణనకు గౌరవప్రదమైన మినహాయింపుగా నిలుస్తోంది.

వినయ్ సహస్రబుద్ధే,
బిజెపి నాయకులు