బిజెపిలో కొత్త అధ్యాయం ప్రారంభం
కొత్త తరానికి ప్రతీక అయిన నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడు కావడంతో బిజెపిలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. స్వయంకృషితో ఎదిగి, కేవలం 45 ఏళ్ల వయసులోనే బిజెపి జాతీయ అధ్యక్ష స్థాయికి చేరుకున్న వ్యక్తి నితిన్ నబీన్! ఈ ఘనత ఒక్క రోజులో సాధించినది కాదు, రెండు దశాబ్దాల కృషి.. క్షేత్రస్థాయి అనుభవం.. నిరంతర సేవ.. అచంచలమైన క్రమశిక్షణ ఫలితమే పార్టీలో అత్యున్నత పదవి. నితిన్ నబీన్ ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నితీష్ కుమార్ క్యాబినెట్లో కీలక శాఖలను నిర్వహిస్తూ పాలనలో తనదైన ముద్ర వేశారు. రహదారుల నిర్మాణం, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం వంటి కీలక రంగాల్లో స్పష్టమైన మార్పులను తీసుకువచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల పరిపాలనా, సంస్థాగత అనుభవం ఆయనకు బలంగా నిలిచింది. నాయకత్వం అంటే కేవలం పదవి కాదు.. ప్రజలతో కలసి నడిచే సామర్థ్యం. నితిన్ నబీన్ చిన్న వయసులోనే ప్రజాజీవితంలో అడుగుపెట్టి, వివిధ వర్గాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ క్షేత్రస్థాయిలో బలమైన నాయకుడిగా ఎదిగారు. యువమోర్చాలో అనేక బాధ్యతలు చేపట్టి యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించారు.
నితిన్ నబీన్ సిన్హా 1980 మే 23న రాంచీలో జన్మించారు. ఆయన తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా బిహార్ బిజెపిలో కీలక నేత. విద్యాభ్యాసం దిల్లీలో పూర్తయ్యింది. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నితిన్ చిన్ననాటి నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో సేవలు అందించారు. 2005లో తండ్రి ఆకస్మిక మరణం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. కేవలం 26 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 2006 ఉప ఎన్నికల్లో 65 వేల ఓట్ల భారీ మెజారిటీతో తొలి విజయం సాధించారు. అప్పటి నుంచి నితిన్ నబీన్ ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచారు. బాంకీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు శతృఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హాపై 84 వేల ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఆయన ప్రజాదరణకు నిదర్శనం. ప్రభుత్వంలో ఆయన 2021–22 మధ్య రాష్ట్ర రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా సేవలందించారు. 2024లో న్యాయశాఖ, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పాలనలో వేగం, నిర్ణయాల్లో స్పష్టత ఆయన ప్రత్యేకతగా నిలిచింది.
పార్టీ వ్యవస్థలోనూ ఆయన ప్రయాణం అంతే ప్రభావవంతమైనది. యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, బిహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీని బలోపేతం చేశారు. 2023 ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేసి బిజెపి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. 2019లో సిక్కిం బిజెపి ఎన్నికల, సంస్థాగత ఇన్ఛార్జీగానూ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. రాజకీయాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ ఆయన ముందుంటారు. 2011లో జాతీయ ఐక్యతా యాత్రకు నాయకత్వం వహించారు. గౌహతి నుంచి తవాంగ్ వరకు షహీద్ శ్రద్ధాంజలి యాత్ర నిర్వహించారు. పాట్నాలో గత 14 ఏళ్లుగా శ్రీరామ నవమి శోభాయాత్రను నిర్వహిస్తూ సామాజిక ఐక్యతకు దోహదపడుతున్నారు. ప్రతిభావంతుల కోసం “నబిన్ సిన్హా ప్రతిభా సమ్మాన్” పురస్కారాన్ని ప్రారంభించి యువతను ప్రోత్సహిస్తున్నారు. 2013లో అమెరికాలో జరిగిన ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్లో పాల్గొని ప్రపంచ పాలనా విధానాలపై అవగాహన సంపాదించారు. ఈ అంతర్జాతీయ అనుభవం ఆయన ఆలోచనలకు మరింత విస్తృతి ఇచ్చింది.
వ్యక్తిగత వివరాలు
- పేరు: నితిన్ నబీన్ సిన్హా
- జన్మదినం: 23 మే 1980 (45 ఏళ్లు)
- తండ్రి: నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా (పాట్నా పశ్చిమ మాజీ ఎమ్మెల్యే)
- తల్లి: మీరా సిన్హా
- భార్య: డా. దీపమాలా శ్రీవాస్తవ
- సంతానం: ఇద్దరు (ఒక కొడుకు, ఒక కూతురు)
- వృత్తి: ప్రజాసేవ, వ్యాపారవేత్త (రియల్ ఎస్టేట్)
సంస్థాగత బాధ్యతలు
- 2008: బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు
- 2010-2016: బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి
- 2016- 2019: బీజేవైఎం బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు
- 2019: బిజెపి సిక్కిం రాష్ట్ర ఎన్నికల, సంస్థాగత ఇంచార్జ్
- 2021-2024: ఛత్తీస్గఢ్ బిజెపి సహ ఇంచార్జ్
- 2024: ఛత్తీస్గఢ్ లోక్సభ ఎన్నికల ఇంచార్జ్
- 2024-ప్రస్తుతం: ఛత్తీస్గఢ్ బిజెపి ఇంచార్జ్
- 2025: బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు
- 2026: బిజెపి జాతీయ అధ్యక్షుడు
ప్రజాప్రతినిధిగా
- 2006-2010: పాట్నా పశ్చిమ ఎమ్మెల్యే
- 2010-2025: బాంకీపూర్ ఎమ్మెల్యేగా వరుసగా ఐదు సార్లు
- 2021-2022: బిహార్ రాష్ట్ర రహదారుల నిర్మాణ శాఖా మంత్రి
- 2024-2024: బిహార్ న్యాయ, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి
- 2025: బిహార్ రహదారుల నిర్మాణం, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి

