చరిత్రను తిరగరాసిన నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విరామం లేకుండా అత్యధిక కాలం అధికారంలో కొనసాగిన రెండవ ప్రధానిగా ఘనతను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వరుసగా 4,077 రోజుల పదవీకాలంలో ఉండగా, దీనిని నరేంద్ర మోదీ అధిగమించారు. జూలై 25 నాటికి మోదీ వరుసగా 4,078 రోజులు ప్రధానిగా సేవలందించారు. 2014 మే 26న తొలిసారి ప్రధాని అయిన మోదీ 2025 జూలై 25 నాటికి 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు. 6,129 రోజులతో దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు.
విరామం లేకుండా అత్యధిక కాలం అధికారంలో కొనసాగడం మోదీ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్యానికి ప్రజలు చూపిన విశ్వాసానికి అద్దం పడుతుంది. వరుసగా మూడు సార్లు ప్రధాని పదవికి ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఈ విశ్వాసం దేశానికి గొప్ప సేవలను అందించేలా ఆయనను ప్రేరేపిస్తోంది. భారత రాజకీయ చరిత్రలో మోదీ ఒక ప్రత్యేక స్థానం సాధించారు. అంతేకాక, ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత గౌరవం తీసుకొచ్చారు.
స్వాతంత్ర్యానంతర కాలంలో జన్మించిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావడం విశేషం. మోదీ గుజరాత్‌కు చెందిన నేత. హిందీయేతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి దశాబ్ద కాలానికి పైగా దేశానికి నాయకత్వం వహించడం మరో చారిత్రక ఘట్టం. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ వరుసగా 24 సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా పరిపాలన అందించిన ఘనతనూ సొంతం చేసుకున్నారు. పదవుల కోసం కాకుండా, సేవ కోసం పని చేయాలన్న ఆయన ధ్యేయం ప్రజల మన్ననలు పొందడమే కాదు, యువతకు ప్రేరణగా నిలిచింది. ఇది దేశభక్తికి, జాతి సమైక్యతకు, మోదీ ప్రజాదరణకు నిదర్శనం. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో మోదీ గ్లోబల్ లీడర్‌గా అవతరించారు. భారతదేశానికి ప్రపంచంలో గౌరవనీయ స్థానం కల్పించడమే కాదు, దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ఆయన నాయకత్వ లక్షణాలు, కార్యశైలి పూర్తిగా ఆధునిక భారత తరం విలువలతో మిళితమై ఉండడమే కాదు, దేశ నిర్మాణం పట్ల ఆయన అంకిత భావం, విజనరీ ఆలోచనలు, పట్టుదల భారత ప్రజల్లో గొప్ప విశ్వాసాన్ని కలిగించాయి.
గుగులోతు వెంకన్న నాయక్,
బిజెపి నాయకులు

