మోదీ పురస్కారాలు భారత్ ప్రతిష్టకు నిదర్శనాలు
2014లో భారత్ 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా గౌరవ పురస్కారాలు అందుకున్న భారత నేతగా కీర్తి గడించారు. జూలై 2025 నాటికి ఆయనకు 25 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. గత ప్రధానులందరూ కలిపి పొందిన అవార్డుల కన్నా ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. విభిన్న ఖండాల నుంచి లభించిన ఈ గౌరవాలు మోదీ వ్యూహాత్మక విదేశాంగ విధానానికి, అలాగే ప్రపంచశక్తిగా పెరిగిన భారత్ ప్రతిష్టకు నిదర్శనం. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో ప్రతి ఒక్కటీ ఒక విశిష్ట భౌగోళిక, రాజకీయ ప్రాధాన్యం కలిగి ఉంది.
2016లో సౌదీ అరేబియా మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ ను ప్రదానం చేసింది. ఇది ఆ దేశంలో అత్యున్నత పౌర పురస్కారం. మధ్యప్రాచ్యంలో భారత్ అనుసరిస్తున్న సమతుల్య విధానానికి గుర్తింపునకు నిదర్శనంగా 2018లో పాలస్తీనా ప్రాధికార సంస్థ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనాను ఆయనకు ఇచ్చారు. 2019లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ జాయెద్‌ను ప్రధానికి ప్రదానం చేసింది. భారత్-అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేసినందుకు 2020లో అమెరికా లీజియన్ ఆఫ్ మెరిట్ పురస్కారం ఇచ్చింది. భూటాన్ 2021లో ఆర్డర్ ఆఫ్ ద్ ద్రక్ గ్యాల్పోను ప్రదానం చేయగా, ఫ్రాన్స్ 2023లో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్‌ను అందజేసింది. కువైట్ 2024లో ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్-కబీర్, ఘనా 2025లో ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్‌ను ఇచ్చింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ను, సైప్రస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మాకారియాస్ IIIను ప్రదానం చేశాయి. ఈ అవార్డుల జాబితాలో ఈజిప్టు, నైజీరియా, మారిషస్, శ్రీలంక, పాపువా న్యూగినియా, ఫిజీ, మాల్దీవులు వంటి దేశాలూ ఉన్నాయి. చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల వరకు ఈ పురస్కారాలు భారత విదేశాంగ విధాన ప్రాబల్యాన్ని, ప్రభావాన్ని సూచిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రభుత్వేతర గౌరవాలూ ప్రధానికి లభించాయి. 2018లో చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు (పర్యావరణ పరిరక్షణలో నాయకత్వానికి గాను), 2019లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు (స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గాను) ఆయన అందుకున్నారు.
ఈ అవార్డులు కేవలం వ్యక్తిగత గౌరవాలే కాకుండా భారత్‌ను ప్రపంచం చూసే దృక్కోణానికి కూడా అద్దం పడతాయి. మోదీ ‘భారత్ ప్రయోజనాలకు ప్రాధాన్యం’ (ఇండియా ఫస్ట్) భావనతో దేశ విదేశాంగ విధానాన్ని అమలు చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ దేశాలు రెండింటితోనూ బలమైన సంబంధాలను అభివృద్ధి చేస్తున్నారు. రష్యా 2019లో ఆయనకు ప్రదానం చేసిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ పురస్కారం, ఫ్రాన్స్ ఇచ్చిన పురస్కారం ఇందుకు ఉదాహరణ. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న దేశాల తరపున మోదీ తన గళాన్ని వినిపించారు. 2023లో జీ-20 అధ్యక్ష హోదాలో అభివృద్ధి చెందుతున్న దేశాల వాదనలను బలంగా ముందుకు తీసుకువెళ్ళారు. నైజీరియా (2024లో గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్), ఘనా వంటి దేశాల నుంచి వచ్చిన అవార్డులు దీన్ని రుజువు చేస్తున్నాయి. పర్యావరణ రంగంలో మోదీ నాయకత్వం ప్రపంచస్థాయిలో ప్రశంసలు పొందింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందాయి. సెరావీక్ అనే సంస్థ 2021లో ఇచ్చిన గ్లోబల్ ఎనర్జీ & ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు దీనికి నిదర్శనం.
మోదీ సంస్కృతిక దౌత్యానికి, ప్రవాస భారతీయులతో అనుబంధానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మారిషస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి దేశాల్లో భారతీయ సంతతి వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తమ భారతీయ వారసత్వంతో తమను తిరిగి అనుసంధానించినందుకు, తమ మూలాలను మళ్లీ గుర్తు చేసిన నాయకుడిగా ఆ దేశాలు మోదీని గౌరవించాయి. ఈ చర్యలు భారత్ మృదు శక్తిని (సాఫ్ట్ పవర్‌ను) మరింత బలోపేతం చేశాయి. అంతర్జాతీయ సంక్షోభాలను ఎదుర్కొనడంలో మోదీ సంయమనంతో, విజ్ఞతతో, న్యాయంగా వ్యవహరించారు. పాలస్తీనా, మాల్దీవుల వంటి దేశాల నుంచి వచ్చిన గౌరవాలు ఈ నిష్పక్షపాత దౌత్యనీతికి గుర్తింపు. 2018లో ఆయనకు లభించిన సియోల్ శాంతి బహుమతి అంతర్జాతీయ సుస్థిరత, సమ్మిళిత వృద్ధికి అంకితమైన ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా ఆయన గౌరవాన్ని పెంచింది.
మోదీకి లభించిన గౌరవాలను గత ప్రధానులకు లభించిన వాటితో పోలిస్తే వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్‌లకు కలిపి లభించిన విదేశీ గౌరవాల సంఖ్య ఆరు మాత్రమే. అవి కూడా ఏవో కొన్ని దేశాల బృందాల నుంచే వచ్చాయి. అందుకు భిన్నంగా మోదీకి వచ్చిన 25 పురస్కారాలు వివిధ ఖండాలు, ప్రాంతాలలోని దేశాల నుంచి రావడం భారత్ ప్రభావం ఏ మేరకు విస్తరించిందో తెలియజేస్తుంది. ఇందులో ముస్లిం మెజారిటీ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, పాలస్తీనా, కువైట్ల నుంచి లభించిన పురస్కారాలు, మోదీపై దేశంలో అంతర్గతంగా వినిపించే మతపరమైన విమర్శలకు సమాధానం. ఈ అవార్డులు భారత్ అనుసరించే బహుళవాద, సామరస్యపూర్వక విదేశాంగ విధానానికి లభించిన ఆమోదం.
ఈ రోజు ప్రపంచం బహుళధ్రువంగా మారుతున్న సమయంలో మోదీ నాయకత్వంలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా, సమర్థమైన భాగస్వామిగా ఎదుగుతోంది. వాణిజ్యం, భద్రత, వాతావరణం, సాంస్కృతిక సంబంధాల పరంగా భారతదేశం తన స్ధానాన్ని బలోపేతం చేసుకుంది. మోదీకి వచ్చిన ఈ అంతర్జాతీయ అవార్డులు వ్యక్తిగతంగా కాకుండా భారతదేశ ప్రాభవానికి ప్రతీకలు. మొత్తంగా చెప్పాలంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లభించిన 25 అంతర్జాతీయ పురస్కారాలు భారతదేశ విదేశాంగ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి. భారత్ ఒక ప్రాంతీయ శక్తిగా మాత్రమే కాకుండా, ఒక ప్రపంచ నాయకత్వ శక్తిగా ఎదిగిందనడానికి ఈ గౌరవాలు నిదర్శనం. దీనిని దీర్ఘకాలిక విజయాలుగా మలచడం, మోదీ తరువాత కూడా భారత్ ప్రాధాన్యాన్ని కొనసాగించడం అనేది సవాలు అనే చెప్పాలి.
డా. ఎస్.జి. సూర్య

