Farmer

“ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన”తో 100 జిల్లాల్లో వ్యవసాయాభివృద్ధి వేగవంతం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం మరో పథకాన్ని ప్రకటించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టే “ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన”ను ప్రవేశపెట్టింది. ఈ పథకం 2025-26లో ప్రారంభమై ఆరేళ్ళ పాటు కొనసాగనుంది. ఇటీవల మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. నీతీ ఆయోగ్ ‘ఆకాంక్ష జిల్లాల’ కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొందిన ఈ పథకం 100 జిల్లాల్లో అమలవుతుంది.

వ్యవసాయ ఉత్పాదకత పెంపు.. పంటల్లో వైవిధ్యం.. పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతుల అనుసరణ.. పంచాయితీ, బ్లాక్ స్థాయుల్లో గోదాముల సామర్థ్య పెంపు.. పంటలకు సాగునీటి సౌకర్యాల పెంపు.. స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణ సౌకర్య కల్పన వంటి చర్యల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. 2025-26 బడ్జెట్ లో ప్రకటించిన విధంగా “ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన” ద్వారా 100 జిల్లాలను అభివృద్ధి పరుస్తారు. 11 విభాగాలకు సంబంధించి… రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రైవేటు రంగంతో భాగస్వామ్యం ఉన్న పథకాలతో కలిపి ప్రస్తుతం అమల్లో ఉన్న 36 పథకాల సమన్వయం ద్వారా పథకం అమలవుతుంది. తక్కువ దిగుబడులు, పరిమితమైన విస్తరణ, పరిమితమైన వ్యవసాయ రుణాల పంపిణీ అంశాల ఆధారంగా దేశంలోని 100 జిల్లాలను గుర్తిస్తారు. సాగు భూమి, వ్యవసాయానికి పనికి వచ్చే భూమి విస్తీర్ణం ఆధారంగా ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన జిల్లాల ఎంపిక జరుగుతుంది. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు.

పథకానికి సంబంధించి సమర్థవంతమైన ప్రణాళికలు, ఆచరణ, పర్యవేక్షణ కోసం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో కమిటీలు ఏర్పాటవుతాయి. స్థానిక అభ్యుదయ రైతులు కూడా భాగమయ్యే జిల్లా ధన-ధాన్య సమితి.. జిల్లా వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తుంది. పంట వైవిధ్యం… వ్యవసాయ నేలలు, సాగు నీటి ఆరోగ్య పరిరక్షణ… వ్యవసాయం, అనుబంధ రంగాల్లో స్వయం సమృద్ధి… సహజ, సేంద్రీయ వ్యవసాయ విస్తరణ జాతీయ లక్ష్యాలతో జిల్లా ప్రణాళికలను అనుసంధానిస్తారు. ఒక్కో ధన-ధాన్య జిల్లాలో పథకం సాధించిన అభివృద్ధిని 117 కీలక సూచీల ఆధారంగా నెలవారీ పర్యవేక్షిస్తారు. జిల్లా ప్రణాళికలను నీతీ ఆయోగ్ కూడా సమీక్షించి మార్గనిర్దేశనం చేస్తుంది. అంతేకాక, పథకం పురోభివృద్ధిని ప్రతి జిల్లాకు నియమితులైన కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారులు క్రమం తప్పక సమీక్షిస్తారు. ఈ పథకం ద్వారా అధిక దిగుబడులు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు విలువ జోడింపు, స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పన, తద్వారా దేశీయోత్పత్తి పెంపు, స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం) సాధ్యపడతాయి. ఎంపిక చేసిన వంద జిల్లాల్లో సూచీలు మెరుగైతే, సహజంగానే జాతీయ సూచీల్లో కూడా వృద్ధి కనిపిస్తుంది.