Chargesheet

కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బిజెపి ఛార్జ్‌షీట్‌

chargesheete release

లవికాని హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలను ఎండగడుతూ బిజెపి తెలంగాణ ఛార్జ్‌షీట్‌ ప్రజల ముందుంచింది. 6 అబద్ధాలు, 66 మోసాలతో కాంగ్రెస్ గ్యారంటీల పేరిట చేసిన గారడీలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోంది. డిసెంబర్ 1న ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్ల పేరుతో మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ, మెదక్, ఆదిలాబాద్ ఎంపీలు రఘునందన్ రావు, గోడం నగేశ్, బిజెపి ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పల్వాయి హరీష్ బాబు, బిజెపి తమిళనాడు, కర్నాటక సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రా రెడ్డి, ఎండెల లక్ష్మినారాయాణ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు, బిజెపి రాష్ట్ర కార్యదర్శులు డా. ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్.వి.సుభాష్, రాణి రుద్రమ, మేధావులు, ప్రముఖులు ఉన్నారు.

కాంగ్రెస్‌ గ్యారంటీల గారడి

6 అబద్ధాలు… 66 మోసాలు

తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి అనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. కాని నమ్మి ఓటేసిన ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. మార్పు సంగతి దేవుడెరుగు.. కాంగ్రెస్‌ పాలనలో ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారింది. తెలంగాణ ప్రజలకు అనేక రకాల అబద్ధపు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఒక సంవత్సరంలోనే విపరీతమైన అపకీర్తిని మూటగట్టుకుంది. 6 గ్యారంటీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని, వాటికి అనుబంధ హామీలు సంవత్సర కాలంలో పూర్తిచేస్తామని సోనియా గాంధీ సంతకంతో ఇంటింటా కరపత్రాలు పంచిన కాంగ్రెస్‌ పార్టీ.. ఏడాది పాలనలో 66 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా దగా చేసింది. బీఆర్‌ఎస్‌ పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఓటు వేసి తరిమికొట్టగా.. గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పార్టీ అదే పంథాను కొనసాగిస్తూ ప్రజావ్యతిరేక, అరాచక పాలనతో వేధిస్తోంది.

ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ.. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను నిలదీస్తే అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలు, నిర్బంధాలతో అణచివేస్తున్నది. భూసేకరణ పేరుతో రైతుల భూములు గుంజుకుంటోంది. మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చివేస్తోంది. నియామక పరీక్షలు, ఉద్యోగాల కోసం నిరసన తెలిపిన వారిపై దాడులకు తెగబడుతోంది. రాష్ట్రంలో గురుకులాలు, సర్కారు బడుల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై, నరక కూపాల్లా మారుతుంటే చలనం లేకుండా వ్యవహరిస్తున్నది. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనను మించిన కష్టాలు గత ఏడాది కాలంలో అనుభవిస్తున్నారు.

అబద్ధపు హామీలు, గ్యారంటీల గారడీలతో తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా దగా చేస్తున కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు విజయోత్సవాల పేరిట మరిన్ని అబద్ధాల ప్రచారానికి తెరలేపుతోంది. డిసెంబరు 7న కాంగ్రెస్‌ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా.. రేవంత్‌ సర్కారు వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున సంధిస్తున్న ఛార్జ్‌షీట్‌..

 అన్నదాత అరిగోసలు

  • రైతులందరికీ రూ.2 లక్షల పంట రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నరు. కొందరు రైతులకే రుణమాఫీ చేశారు.
  • ప్రతి ఏటా రైతుభరోసా కింద రైతులు, కౌలురైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ.15,000 ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైతుకూలీలకు రూ.12 వేల సాయం ఇచ్చిన పాపానపోలేదు. కనీసం విధివిధానాలు కూడా రూపొందించలేదు.
  • పంటల బీమా పథకం 2024 సంవత్సరం వానాకాలం సీజన్‌ నుంచే అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్‌ రైతులు పండించిన 10 పంటలపైన ఎమ్‌ఎస్పీపై రూ.500 బోనస్‌ ఇస్తామని సన్న వడ్లకు మాత్రమే పరిమితం చేశారు.
  • రూ.3 లక్షల వరకు వడ్డీలేని పంట రుణాలను ఇంతవరకు ఇవ్వలేదు.
  • మల్లన్నసాగర్‌, తదితర ప్రాజెక్టులకు బలవంతంగా భూములను సేకరించిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును వ్యతిరేకించిన కాంగ్రెస్‌ తాము అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. తీరా బీఆర్‌ఎస్‌ బాటలోనే నడుస్తోంది.
  • ఫార్మాసిటీ, ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని విస్మరించింది. ఫార్మాసిటీకి భూ సేకరణ విషయంలో రైతులకు 2017 భూసేకరణ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
  • పాల ఉత్పత్తిదారులకు ప్రతి లీటరుకు రూ.5 బోనస్‌ ఇస్తామని ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు.

 దగాబడ్డ యువత

  • విద్యారంగానికి ప్రస్తుత వాటా 6 శాతం నుంచి 15 శాతం వరకు పెంచుతామని వాగ్ధానం చేసింది. బడ్జెట్‌లో నిధుల పెంపు జరగలేదు. జీతాలకు తప్ప పాతబడిన ప్రభుత్వ స్కూళకు కొత్త బిల్డింగులకు గాని, రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌కు గాని ఎలాంటి నిధుల కేటాయింపు జరగలేదు.
  • నగర పాలక, మున్సిపాలిటీ కేంద్రాల్లో అన్ని ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టలేదు.
  • మూతబడిన దాదాపు 6 వేల పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభిస్తామన్నారు. కాని, రాష్ట్రంలో మరిన్ని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో తగిన సౌకర్యాల్లేక, చాలీచాలని సిబ్బందితో మూతబడే పరిస్థితి ఏర్పడిరది.
  • గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలో గురుకులాలు, సర్కారు బడులు, వసతి గృహాల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలతో నరకకూపాలుగా మారాయని ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. విద్యార్థులకు నాసిరకం భోజనంతో విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతుంటే దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు.
  • రాష్ట్రవ్యాప్తంగా 2021 నుంచి విద్యార్థులకు ఇవ్వాల్సిన సుమారు రూ.6,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ఇంతవరకు రూపాయి కూడా చెల్లించలేదు.
  • యువ వికాసం కింద విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు హామీ అమలుకు నోచుకోలేదు
  • రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో ఏడాదిలో ఫుడ్‌ పాయిజనింగ్‌తో, ఆత్మహత్య చేసుకొని, ఇతర అనుమానాస్పద కారణాలతో అనేక మంది విద్యార్థుల మృతి చెందారు.
  • కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఏడాది వ్యవధిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ భర్తీ చేస్తామని చేయలేదు. ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేయడం లేదు.
  • నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు.
  • ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, సాంపుల్‌ ఇంప్లిమెంటేషన్‌కే పరిమితమయ్యింది.
  • మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ల మంజూరులో కాంగ్రెస్‌ ప్రభుత్వం జాప్యం చేస్తుంది. 900 మంది విద్యార్థులకు రెండవ విడత ఉపకారవేతనాలను పెండింగ్లో పెట్టింది.
  • ప్రైవేటు సెక్టారులోని ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పి మాట తప్పింది.

 మోసపోయిన మహిళలు

  • మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2500 చొప్పున ఆర్థిక సాయం అందని ద్రాక్షగానే మిగిలింది. దీంతో రాష్ట్రంలో ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.27,500 బాకీ పడిరది.
  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. బస్సులను తగ్గించడంతో రద్దీ పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు.
  • నిరుపేద హిందూ, మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే రూ.1 లక్షతో పాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇస్తానన్న కాంగ్రెస్‌ హామీ అమలుకు నోచుకోలేదు.
  • పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయంతో కూడిన బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తామని వాగ్ధానం చేసి, ఇంతవరకు అమలు చేయలేదు.
  • 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతికి స్కూటీలను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చి మాట తప్పింది.

 పత్తా లేని పెన్షన్లు

  • తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ అమరవీరుల తల్లి/తండ్రి/ భార్యకు రూ.2500ల నెలవారీ గౌరవ పెన్షన్‌, మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నరు. ఇప్పటివరకు ఒకరిని కూడా గుర్తించలేదు. ఒక్కరికి కూడా పెన్షన్‌, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన పాపానపోలేదు.
  • మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్‌ తాము అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని వాగ్ధానం చేసి, తీరా బీఆర్‌ఎస్‌ ధోరణినే అవలంబిస్తూ తీవ్ర అన్యాయం చేసింది.
  • ప్రస్తుతం ఉన్న సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్‌ పెన్షన్‌ (ఓపీఎస్‌) విధానాన్ని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ఏడాది గడిచినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కనీసం సీపీఎస్‌ రద్దు ఊసే ఎత్తడం లేదు.
  • తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేసి, వారికి 250 గజాల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఇచ్చిన వాగ్ధానాన్ని మరిచింది.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావొస్తున్నా ఇంతవరకు ఏ ఒక్కరికీ కొత్తగా పెన్షన్‌ మంజూరు చేయలేదు.
  • 50 సంవత్సరాలు దాటిన జానపద కళకారులకు నెలకు రూ.3 వేల పెన్షన్‌ చెల్లింపు హామీ అమలు కాలేదు.
  • చేయూత కింద వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్ల పెంపు హామీ అమలుకు నోచుకోలేదు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పెన్షన్‌ పెంచుతామని చెప్పి, పెంచలేదు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.22 వేల చొప్పున బాకీ పడ్డట్టు అయ్యింది.

ఆగమైన ఆటో డ్రైవర్లు

  • ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12000లు ఆర్థిక సహాయం అందచేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు.
  • తెలంగాణలో ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైంది. గత ఏడాది కాలంలో అనేక మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు.

భూ అక్రమాలపై మెతక వైఖరి

  • ‘‘ల్యాండ్‌ కమీషన్‌’’ ఏర్పాటు చేసి, అన్ని భూహక్కుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ప్రజల భూహక్కుల సమస్యలు పరిష్కరించలేదు.
  • ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో పడేసి, భూమాతను తీసుకొస్తామంది. రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, తీరా అమలులో వైఫల్యం చెందింది. కాంగ్రెస్‌ నిర్లక్ష్య వైఖరితో భూహక్కులు కోల్పోయిన రైతులకు న్యాయం జరగలేదు.
  • గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అనేక భూ అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని, తాము అధికారంలోకి వచ్చాక దోషులను శిక్షిస్తామని కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయినట్లు స్పష్టంగా తెలుస్తున్నది.
  • ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీని రద్దు చేస్తామని, సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఫార్మాసిటీ, ఫ్యూచర్‌ సిటీ పేరుతో రైతులు, ప్రజలకు జీవనాధారమైన భూములను మరింతగా గుంజుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నది.

 ఇటుక పడని ఇందిరమ్మ ఇండ్లు

  • తెలంగాణలో సొంత జాగా ఉండి ఇండ్లు లేని నిరుపేదలకు తొలిదశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరుతో పాటు స్థలం లేని వారి కోసం ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది. ఇంతవరకు అడుగు మందుకు పడలేదు.
  • సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్‌ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను గాలికి వదిలేసింది.

 ఉద్యోగుల గోసలు – నిరుద్యోగుల వెతలు

  • ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ పెండింగ్లో వున్న మూడు డీఏలను తక్షణమే చెల్లిస్తమన్నది. అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్క డీఏను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకోవడంతో మొత్తం పెండింగ్ డీఏలు ఐదుకు పెరిగాయి.
  • అంగన్‌వాడీ టీచర్లకు నెలసరి వేతనం రూ.18వేలుకు పెంచలేదు. ఈపీఎఫ్‌ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రతను కల్పించిందీ లేదు.
  • నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చి, చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు ఇస్తామన్న వాగ్ధానం ఇంతవరకు అమలుకు చర్యలు తీసుకోలేదు.
  • మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5 లక్షల నగదు ఇస్తామని ప్రకటించింది. కనీసం మృతి చెందిన జర్నలిస్టుల వివరాలు కూడా సేకరించలేదు.
  • రాష్ట్రంలో రేషన్‌ డీలర్లకు రూ.5వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్‌ అమలు కావడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18 వేలకు పైగా రేషన్‌ డీలర్లు ప్రభుత్వ వేతనాల కోసం ఎదురుచూస్తున్నరు.
  • హోంగార్డుల వేతన సవరణలతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపిన హోంగార్డులపై కేసులు బనాయిస్తోంది.
  • పోలీసుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది. ‘వన్‌ స్టేట్‌, వన్‌ పోలీస్‌’ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) 8వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగారు.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలల నుండి 6,200 మంది పార్ట్‌ టైమ్‌ లెక్చరర్లు మరియు ఉపాధ్యాయులను ముందస్తు నోటీసు లేకుండా అకస్మాత్తుగా తొలగించింది.

 ఓబీసీలు, ఈబీసీలకు వెన్నుపోటు

  • కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచినా కూడా బీసీ డిక్లరేషన్‌ కానీ, సబ్‌ప్లాన్‌ కానీ అమలు చేయలేదు.
  • ప్రమాదశాత్తు చనిపోయే గీత కార్మికులకు రూ.10 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా పెంపు హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.
  • బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నిధులు కేటాయించకుండా మోసం చేసింది.
  • ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి, ఏడాది గడిచినా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదు.
  • పద్మశాలీలలకు పవర్‌ లూమ్స్‌లో 90 వాతం సబ్సిడీతో పాటు ఉపకరణాలు అందిస్తామని ఇచ్చిన హామీని మరిచింది. దీంతో ఆర్థిక స్థోమత లేని నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు.
  • రజకులకు ఉపాధి అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సబ్సిడీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌.. ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదు.
  • యాదవ, కురుమలకు గొర్రెల పెంపకానికి దళారీలు లేకుండా నేరుగా రూ.2 లక్షల సహాయం చేస్తామన్న హామీకి ఇంతవరకు దిక్కులేదు.

 ఎస్సీ, ఎస్టీలకు దోకా

  • గిరిజన ప్రాంతాల్లో అర్హులైన రైతులకు పోడు భూముల పట్టాలిస్తామని హామీ ఇచ్చి.. అమలులో మాత్రం చేతులెత్తేసింది.
  • జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు పెంపుతో పాటు వర్గీకరణ చేసి న్యాయం చేస్తామని వాగ్ధానం చేసి మాట తప్పింది.
  • అంబేద్కర్‌ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చి, ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు.
  • ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదు.
  • సమ్మక్క-సారలక్క గ్రామీణాభివృద్ధి పథకం కింద ఎస్టీ తండాలు, గూడేలకు ప్రతి ఏడాది రూ.25 లక్షల చొప్పున అందిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు.
  • ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాలు లేని ప్రతి దళిత, గిరిజనులకు ఇంటిస్థలంతో పాటు రూ.6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఏ ఒక్కరికీ సాయం అందించిన పాపాన పోలేదు.
  • మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉప కులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు చేసి, ప్రతీ ఏడాది ఒక్కో కార్పొరేషన్‌కు రూ.750 కోట్ల నిధులు కేటాయిస్తామని డిక్లరేషన్‌లో చేర్చింది. ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు.
  • తుకారాం ఆదివాసి కార్పోరేషన్‌, సంత్‌ సేవాలాల్‌ లంబాడా కార్పొరేషన్‌, ఎరుకుల కార్పొరేషన్ల ఏర్పాటు చేసి, ప్రతి ఏటా ఒక్కో కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచింది.
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పదవ తరగతి పాస్‌ అయితే రూ.10 వేలు, ఇంటర్‌ పాసైతే రూ.15 వేలు, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తే రూ.25 వేలు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తే రూ.1 లక్ష అందజేస్తామని వాగ్ధానం చేసింది. ఇప్పటివరకు ఏ ఒక్కరికీ సాయం అందించలేదు.
  • అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఖాళీలు భర్తీ చేస్తామన్న హామీని మరిచిపోయింది.
  • నిరుద్యోగుల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్టడీ సర్కిల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇంతవరకు చర్యలు చేపట్టలేదు.

ఇతర వైఫల్యాలు

  • రాష్ట్ర పురపాలక సంఘాలు, కార్పోరేషన్లు, గ్రామ పంచాయతీలలో ఆస్తి పన్ను, ఇంటి పన్ను బకాయిలపై ఉన్న ఫెనాల్టీలు రద్దు చేయనేలేదు.
  • ఇకపై తెల్ల రేషన్‌ కార్డు దారులకు సన్న బియ్యం సరఫరా చేస్తామని వాగ్ధానం చేసి, మాట తప్పారు.
  • గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాలనలో కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా ప్రజలను ప్రభుత్వ పథకాలకు దూరం చేసిందని ఆరోపించిన కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ఒక్క కొత్త రేషన్‌ కార్డు కూడా ఇవ్వకుండా అదే పంథాను కొనసాగిస్తున్నది.
  • 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారము, మూడంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేసి, విధులు, నిధులు మరియు నిర్వహణ భాద్యతలను అప్పగిస్తామని ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేసింది. సర్పంచులు చేసిన పనులకు కూడా నిధులు ఇవ్వలేదు. ఇప్పటివరకు మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా స్థానిక సంస్థలకు ఇవ్వడం లేదు.
  • రాష్ట్రంలో రేషన్‌ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్‌ అమలు కావడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18 వేలకు పైగా మంది రేషన్‌ డీలర్లు ప్రభుత్వ వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.
  • ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. రాజకీయాలే ఎజెండాగా 11 నెలల్లో 29 సార్లు ఢల్లీి పర్యటించారు.

క్షీణించిన శాంతి భద్రతలు

  • బెల్ట్‌షాపులను పూర్తిగా రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మద్యం ఆదాయ వనరుగా చేసుకుని పాలన చేస్తున్నది. రాష్ట్రంలో మద్యం క్రయ విక్రయాలతో వచ్చిన రూ.35 వేల కోట్ల ఆదాయానికి అదనంగా రూ.10 వేల కోట్లు రాబట్టేలా టార్గెట్లు పెట్టి మరీ లిక్కర్‌ షాపులను నడిపిస్తున్నది.
  • రేవంత్‌ ప్రభుత్వంలో మహిళా భద్రత ప్రమాదంలో పడిరది. మహిళలపై వేధింపుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
  • ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని ఇచ్చిన వాగ్ధానాన్ని వమ్ము చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒకే ఒక్కరోజు తంతు నిర్వహించారు. అర్జీలను పట్టించుకోవడం లేదు.
  • మొదటిసారిగా రిజర్వ్‌డ్‌ కానిస్టేబుళ్లు తిరగబడ్డ ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుంది.
  • తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, పూర్తిస్థాయి ప్రజాస్వామిక పరిపాలనను అందిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు అడిగితే దాడులు.. ఎరువులు, విత్తనాల కోసం, భూసేకరణకు వ్యతిరేకంగా నిలదీస్తే రైతులకు బేడీలు,.. ముత్యాలమ్మ ఆలయం, శంషాబాద్‌లోని హనుమాన్‌ ఆలయంలో విగ్రహ ధ్వంసం వంటి ఘటనలకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే లాఠీచార్జ్‌లు చేయిస్తున్నది. మూసీ ప్రక్షాళన పేరుతో ఇండ్ల కూల్చివేతలను వ్యతిరేకించినా లాఠీచార్జ్‌లు చేయిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ నిర్బంధ పాలన కొనసాగిస్తున్నది.

ఆర్థిక నిర్వహణలో వైఫల్యం

  • కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థ పాలనతో తెలంగాణ రాష్ట్రం మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతుంది.
  • జూలై నెలలో రూ.10,228 కోట్ల ఆదాయం ఉంటే రూ.10,392 కోట్ల రుణం తీసుకుని అప్పుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. కొత్త ప్రాజెక్టులు ఏవీ చేపట్టకుండానే 9 నెలల్లో ఆర్బీఐ నుంచి రూ.46,118 కోట్ల అప్పు తీసుకోవడం ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యానికి ప్రతీక.
  • ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించనందున పేదలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు.ఎన్నికలసందర్భంగా ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఒక్క రూపాయి బకాయి కూడా చెల్లించలేదు.
  • పెండింగ్‌ బిల్లులు చెల్లింపుల కోసం సర్పంచ్‌లు నిరసన తెలిపే పరిస్థితి నెలకొంది.

కాంగ్రెస్‌ ఏడాది పాలన వైఫల్యాలు, నెరవేర్చని హామీలు, మరిచిపోయిన వాగ్ధానాలపై తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసి, రేవంత్‌ ప్రభుత్వం నియంతృత్వ, అప్రజాస్వామిక, మోసపూరిత పాలనలో గోస పడుతున్న బాధితులకు భరోసానిచ్చేందుకు భారతీయ జనతా పార్టీ భరోసా కల్పించేలా పోరాటం చేస్తున్నది. ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసి, ఎన్నికల హామీలను సాధించుకుందాం.