కాంగ్రెస్ కార్యక్రమంలా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలా?: డా. లక్ష్మణ్
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర పండగలా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించారని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. చరిత్రను సీఎం వక్రీకరిస్తున్నారని 1,200 మంది ఉద్యమకారుల బలిదానాలపై తెలంగాణ ఏర్పడిందని అన్నారు. సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చినట్లు సీఎం చెబుతున్నారని తెలంగాణను ఎవరూ ఇవ్వలేదని.. ప్రజలే తెచ్చుకున్నారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో డా. లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివంగత నేత సుష్మాస్వరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులను సన్మానించారు. తర్వాత పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్‌పాటిల్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, ఎంపీ రాములు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ సహా పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం వీటిని నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వానిదీ అదే తీరు. గత ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛను హరించి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడితే ఈ ప్రభుత్వం ఆ వ్యవహారంపై విచారణలో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతించకపోవడంతోనే ఈ కేసును సీబీఐకి అప్పగించలేదు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేస్తే ఈ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో బిజెపి నిర్వహించిన పాత్ర అత్యంత కీలకమైంది. తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విద్యార్థి సంఘం ఏబీవీపీ. 1997లోనే కాకినాడలో రెండు రాష్ట్రాల తీర్మానాన్ని బిజెపి ఆమోదించింది. బిజెపి నేత, తెలంగాణ చిన్నమ్మగా గుర్తింపు పొందిన సుష్మాస్వరాజ్ నాడు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరొకటి అంగీకరించేది లేదని స్పష్టం చేయడంతో పాటు బిల్లు ఆమోదం పొందేవరకూ ఎనలేని కృషి చేశారని గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.


