musi revanth

కాంగ్రెస్ ప్రాజెక్టుల్లో ప్రయోజనం నాస్తి, అవినీతి జాస్తి

ఆనాటి కాకతీయుల కాలం నుంచి జలసిరులు తిరుగులేని వైభవానికి ప్రతీకలుగా నేటికీ స్వర్ణయుగాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అటు ప్రజలపై ఉన్నది. దేశంలో, రాష్ట్రంలో పర్వతాలు, నదులు జీవనాధారంగా ఉన్నవి. వీటితో పాటు వర్షపు నీటిని ఎక్కడిక్కడ ఆపి, చెరువులుగా మార్చి సాగు, తాగునీటికి కొరత లేకుండా ఆనాటి కాకతీయులు మనకు అందించారు. నేడు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక గ్రావిటీ ఆధారంగా వచ్చే నీటిని వదిలి, అత్యంత ఖర్చుతో కూడుకున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దీనికి తోడు విద్యుత్, విద్యుత్ మోటార్లు, ప్రాజెక్టు నిర్వహణకు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అయినా ఖర్చుకు తగ్గ ఫలితాలు సాధించలేక రాష్ట్రం అప్పులపాలవుతున్నది. గత పాలకుల కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రయోగంగా మన కళ్లకు కనిపిస్తున్నది. మళ్లీ ప్రస్తుత ప్రభుత్వం కూడా లిఫ్ట్ ప్రాజెక్టుల వైపే ఆలోచిస్తున్నది. 

కాకతీయులు తాగు, సాగు నీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చి కరువు బారిన పడకుండా ప్రజలను రక్షించి అన్నం పెట్టారు. తెలుగు నేలను అన్నపూర్ణగా తీర్చిదిద్దారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా, దానికి వర్షాధారమే జీవనాధారంగా కాకతీయులు తెలుగు నేలపై లక్షలాది చెరువులు నిర్మించి నీటి పారుదల సౌకర్యం కల్పించారు. రామప్ప, లక్నవరం, పాకాల వంటి అనేక మధ్యతరహా సాగునీటి చెరువులను ప్రకృతి సిద్ధంగా నిర్మించారు. ‘రిడ్జ్ టు రివర్’ ఆదర్శంతో గొలుసుకట్ట చెరువులు నిర్మించారు. ఉదాహరణకు వరంగల్ పట్టణం కృష్ణా, గోదావరి నదుల రిడ్జ్ పైన ఉన్నది. వరంగల్ రిడ్జ్ నుండి అటు కృష్ణా నది వరకు, ఇటు గోదావరి నది వరకు గొలుసుకట్ట చెరువులు నిర్మించారు. వర్షపు నీటిని ఎక్కడిక్కడ గొలుసుకట్టి నిలువ చేశారు. ప్రతి గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ చెరువులు నిర్మించారు. కాకతీయుల నీటి నిర్వహణ దేశంలో ఇప్పటికీ ఎక్కడా కనిపించదనడంలో ఆశ్చర్యం లేదు. శిఖరంలో రాక్ ఫీల్డ్ డ్యామ్స్, పాండ్స్ నిర్మించి భూములు కోత పడకుండా, ఇసుక రాకుండా, ప్రణాళిక బద్ధంగా నిర్మించి, వరదలను అరికట్టారు. ఆనాటి చెరువులు నేటికీ ఇసుక రాకుండా కట్టలు, తూములు, మత్తడిలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇవి కాకతీయుల గొప్ప సామాజిక స్పృహగా చెప్పుకుంటున్నాం. చెరువులకు అప్రోచ్ కాలువలు, చెరువుల వెనకాల పంట కాలువలు అద్భుతంగా నిర్మించారు. ఎక్కువైన నీరు కాలువల ద్వారా వాగులోకి, వాగుల నుండి నదుల్లోకి వెళ్లే విధంగా నిర్మించారు. కానీ నేడు వర్షపు నీటిని వాగుల ద్వారా నదిలోకి వెళ్లాక లిఫ్టుల ద్వారా పైకి తీసుకొస్తున్నారు. కాకతీయులు సహజసిద్ధంగా రిడ్జ్ టు రివర్ విధానాన్ని పాటిస్తే మన పాలకులు రివర్ టు రిడ్జ్ విధానాన్ని పాటించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు.

చతుర్విధ జల ప్రక్రియ

పర్యావరణంతో కూడుకున్న అభివృద్ధి కొనసాగిస్తే అభివృద్ధికి, పర్యావరణానికి ఘర్షణ ఉండదనేది పర్యావరణవేత్తల అభిప్రాయం. ప్రముఖ ఇంజనీర్ హనుమంత రావు చతుర్విధ జల ప్రక్రియను ఆవిష్కరించి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకెళ్లారు. మన రాష్ట్రంలో కూడా రైతులు, సాగునీటి నిపుణుల సమక్షంలో అనేక ప్రజంటేషన్లు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాజస్థాన్ లో అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా మొదట రెండు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఆ తర్వాత 13 జిల్లాలకు విస్తరించారు. అనంతరం 50 జిల్లాల్లో ఈ చతుర్విధ జల ప్రక్రియను కొనసాగించి రాజస్థాన్ నీటి కొరతను అధిగమించారు.

రిడ్జ్ టు వ్యాలీ (శిఖరం నుంచి లోయ) విధానంతో, ప్రజల భాగస్వామ్యంతో ఎలాంటి సిమెంట్ కాంక్రీట్ లేకుండా ఒక వాటర్ షెడ్ ఏరియాను సృష్టించడం, ప్రజలే దానిని నిర్వహించుకునే విధంగా ప్రణాళిక రూపొందించడం ఇందులోని ప్రధానాంశం. చతుర్విధ జల ప్రక్రియలో 4 అంశాలు ప్రధానమైనవి. అవి 1.వాననీటిని నిలువరించడం, 2. భూగర్భంలోకి నీటిని పంపడం, 3.లోయ ఉపరితలంలో నీటిని నిల్వ చేయడం, 4. భూమిలో తేమను కాపాడడం. జహీరాబాద్ లోని గొట్టిగార్ పల్లి గ్రామం వద్ద ఈ చతుర్విధ జల ప్రక్రియ ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజనను చతుర్విధ జల ప్రక్రియకు అనుసంధానం చేసి సుమారు 10 రకాల నిర్మాణ పనులు ఎలాంటి సిమెంట్ లేకుండా నిర్మించవచ్చు. రైతులకు తగిన శిక్షణనిచ్చి, ఉపాధి హామీకి దీనిని అనుసంధానించి చతుర్విధ జల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ సమతల భూమి కాదు, కాబట్టి కాకతీయుల రిడ్జ్ టు రివర్ విధానం, హన్మంతరావు రిడ్జ్ టు వ్యాలీ చతుర్విధ జల ప్రక్రియ లాంటివి రాష్ట్రానికి మేలైనవి. ఇందులో ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. పంటల అవసరాన్ని బట్టి నీటి లభ్యతను సమకూర్చాల్సి ఉంటుంది.

హైడ్రా

హైదరాబాద్ తో పాటు 13 కార్పొరేషన్లు, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో హైడ్రాను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మొదలు హైదరాబాద్ లో పనులు ప్రారంభించింది. మొదట్లో ప్రజలు, పత్రికలు హైడ్రాను స్వాగతించాయి. కానీ రానురాను హైడ్రాకు సరైన లక్షణం లేక చెరువులు, కుంటలు కాపాడుడట దేవుడెరుగు, పేదల ఇండ్లు కూల్చి పెద్దలతో అంటకాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. హైడ్రాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అనుమతులున్న వాటినీ కూల్చేశారు. పట్టణ చెరువులు, కుంటల్లో ఒక్క దానికీ శాస్త్రీయమైన ఎఫ్టీఎల్ లేదు. హైదరాబాద్ నగరానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ లేదు. పాత మాస్టర్ ప్లాన్ లో చెరువులు, కుంటలు చేర్చలేదు. వివక్షతో కేవలం కొన్ని ప్రాంతాలు ఎంపిక చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. హైడ్రా చట్టబద్ధతను హైకోర్టు ప్రశ్నించింది. అర్బన్ ట్యాంక్స్ కు చెరువు వెనక వ్యవసాయం లేదు, చెరువు ముందు పరివాహక ప్రాంతం లేదు. చెరువులు మురికికూపాలుగా మారిపోయాయి. భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. వీటిని పరిష్కరించే ప్రణాళిక ఏదీ ప్రభుత్వం వద్ద లేదు. చెరువులు ఉన్న ప్రైవేటు భూములలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి నిర్మాణాలు చేపట్టి, ప్రజలకు విక్రయించారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు చూసి బ్యాంకులు రుణాలిచ్చాయి. అనుమతులిచ్చి, బ్యాంకు రుణాలిచ్చిన వాటిని చట్ట వ్యతిరేకంగా కూలగొట్టారు. తద్వారా హైడ్రాకు ఒక నిర్దిష్ట లక్ష్యం లేక ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. హైడ్రా చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సుమారు రూ.3-4 వేల కోట్ల ఆదాయం పడిపోయింది. నిర్మాణరంగం కుదేలైంది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక ఉపాధి దెబ్బతిని, నిరుద్యోగం పెరుగుతున్నది. ప్రభుత్వ పెద్దలు వారి కేంద్ర పార్టీని సంతృప్తి పరచేందుకే హైడ్రా అన్న ఆరోపణలు వస్తున్నాయి. పేదలను కొట్టి, పెద్దలను కాపాడి, కుర్చీని కాపాడుకోవాలన్న లక్ష్యమే తప్ప మరొకటి కనిపించడం లేదని హైడ్రాపై ప్రజలు ఆరోపిస్తున్నారు.

మూసీ ప్రక్షాళన

హైడ్రా మాదిరిగా మూసీకి కూడా ఒక ప్రణాళిక లేదు. రూ.1లక్షా 50వేల కోట్లతో సుందరీకరణ అన్నారు. ఆ తర్వాత రూ.1లక్షా 50వేల కోట్లు అని మేమెప్పుడు అన్నామని బుకాయిస్తున్నారు. 13వేల మందికి పునారావాసం కల్పిస్తామన్నారు, కానీ రెండు వైపులా అధికారులు పెట్టిన మార్కింగ్ చూస్తే లక్ష కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తున్నది. గండిపేట నుంచి ఎల్బీనగర్, తారామతిపేట వరకు ఉన్న నివాసితులు నిరాశ్రయులుగా మారే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షాలు తప్పుబట్టగానే రూ.141 కోట్లతో సమగ్ర డీపీఆర్ తయారు చేస్తున్నామని మాట మార్చారు. గుజరాత్ లో సబర్మతి నదిని కేవలం రూ.1400 కోట్లతో ఎటువంటి విఘాతం లేకుండా నాటి మోదీ ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. రెండవది, 2500 కి.మీ పొడవున్న గంగానది ప్రక్షాళనను గత 10 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. దీనికి ఇప్పటికి రూ.20వేల కోట్ల లోపే ఖర్చయింది. మూసీ ప్రక్షాళనలో పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోకుండా పునరావాసం, ఉపాధి కల్పించాలి. మూసీకి రెండు పక్కల ప్రైవేటు భూములు, ఇండ్లకు మార్కెట్ రేటు కట్టించాలి. పెద్దలు లాభపడి, పేదలకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజావ్యతిరేకత ఎదుర్కొనక తప్పదు.

ప్రస్తుత ప్రభుత్వం నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ప్రణాళిక సిద్ధం చేసినా, హైడ్రాను తీసుకొచ్చినా, మూసీ పునరుజ్జీవనం అన్నా వారికి నిర్దిష్ట లక్ష్యం, సరైన ప్రణాళిక లేదన్నది స్పష్టమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంగా మార్చుకున్నట్టే… ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ఏటీఎంగా మార్చుకోవాలని భావిస్తోంది. అవినీతి కోసమే ప్రాజెక్టులన్నట్టు ముందుకెళ్తే మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పట్టక తప్పదు.

నరహరి వేణుగోపాల్ రెడ్డి,
బిజెపి సీనియర్ నాయకులు