కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలను చైతన్యం చేయాలి
రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజాసమస్యల పరిష్కారంలో, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిరక్ష్య వైఖరిని ఎండగట్టేలా బిజెపి తెలంగాణ విస్తృత కార్యాచరణకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు చేసిన మోసాలను వివరించి ప్రజల్లో చైతన్యం కలిగించేలా జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 24న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన బిజెపి తెలంగాణ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పదాధికారుల సమావేశంలో రాంచందర్ రావు పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై కీలక సూచనలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు చేపట్టే సేవా కార్యక్రమాలను సమీక్షించి ప్రణాళిక రూపొందించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఎంఎస్ఎంఈలకు.. ఇలా అనేక వర్గాలకు లబ్ధి కలిగేలా జీఎస్టీ తగ్గిస్తూ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో వినియోగదారులను కలిసి వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా స్వదేశీ ఉద్యమంలో భాగంగా అన్ని జిల్లాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి జీవన ప్రయాణంపై సెప్టెంబర్ 30న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రత్యేకంగా ‘మేరా దేశ్ పహలే’ సాంస్కృతిక కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు 10 వేల మంది పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రణాళికలు రచించారు. అదేవిధంగా రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనా చర్చ జరిగింది. ఈ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని పదాధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.

