DDU State Office

దీన్‌దయాళ్ జీకి ఘన నివాళులు

DDU Birth anniversaryప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పారిశ్రామికవేత్తలు దేశీయ వస్తువులను ఉత్పత్తి చేయాలని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా ప్రజలకు మేలు జరిగేలా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు స్వదేశీ విధానంతో ముందుకు పోవాలని సూచించారు. సెప్టెంబర్ 25న బిజెపి సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. డా.కె.లక్ష్మణ్, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, రాష్ట్ర పదాధికారులు, సీనియర్ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘‘పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ ద్వారా సామాజిక న్యాయానికి కొత్త దిశను సూచించారు. చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన సిద్ధాంతం, సమగ్ర అభివృద్ధికి మార్గదర్శిగా భారత్ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తోంది. భారతీయ విలువలపై ఆధారపడి, పండిట్ దీనదయాళ్ ఇచ్చిన మార్గదర్శకం, ఈనాటికీ సమకాలీన సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తుంది. పండిట్ దీన్‌దయాళ్ ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం సమాజంలోని పేదల్లోని అత్యంత పేదలకే మొదటి ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకబడిన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ద్వారా బ్యాంకు ఖాతాలు లేని పేదలకు ఖాతాలు తెరిచారు, ఫలితంగా సుమారు 60 కోట్ల మందికి బ్యాంకు సేవలు అందుతున్నాయి. చిరు వ్యాపారులకు రుణ సదుపాయాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్వావలంబనకు మద్దతు అందిస్తున్నారు. 

మోదీ ప్రభుత్వంలో కోట్లాది మంది స్వయం సమృద్ధి సాధించడానికి ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు సుమారు నాలుగు కోట్ల మందికి ఇండ్లు నిర్మించారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాలలో కూడా కనీసం మరుగుదొడ్లు లేకుండా ఉన్న పేదలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరుగుదొడ్లు నిర్మించి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడింది. 

ఆత్మనిర్భర్ భారత్ సాధించడానికి స్వయం సమృద్ధి సాధించి మన కాళ్ల మీద మనమే నిలబడాలి. ఇతర దేశాల మీద ఆధారపడితే సమస్యలు వస్తాయి. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిపీన్స్, పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక అస్థిరతలకు గురవుతున్నాయి, ప్రజలు కష్టాల్లో పడుతున్నారు. అందుకే, ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ ధ్యేయంతో మేక్ ఇన్ ఇండియా ప్రణాళికను ప్రోత్సహిస్తూ, స్వదేశీ వస్తువులే వాడాలని, స్వదేశీ వస్తువులను విక్రయించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విధంగా, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కలలను సాకారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే భారతదేశాన్ని నాలుగవ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే కాక, పేద మధ్యతరగతి ప్రజలకు మరింత చౌకగా వస్తువులు, సౌకర్యాలు అందించడానికి జీఎస్టీ తగ్గింపు, ఇతర సంస్కరణలు తీసుకొచ్చారు. మధ్యతరగతి ప్రజలు రూ.12 లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించకుండానే పన్ను మినహాయింపు పొందగలుగుతున్నారు. ఇవన్నీ భారతదేశం సమగ్ర అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు. వీటన్నింటికీ ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా నిర్మించుకోవాలంటే.. మనమందరం కూడా స్వదేశీ వస్తువులు వాడి, స్వదేశీ ఉత్పత్తులను విస్తృతంగా ప్రచారం చేయాలి. ఇదే దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు అర్పించే నివాళి.’’ అని అన్నారు.