దేశవ్యాప్తంగా బిజెపి హవా, కాంగ్రెస్ గల్లంతు

నెలలో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఘోర పరాజయం పాలవడం, కొనసాగుతున్న బిజెపి హవా, కాంగ్రెస్ పతనానికి మరో నిదర్శనం. ఎన్డీఏ సీట్లు డబుల్ సెంచరీ దాటడం, ఇండీ కూటమి దాదాపు తుడిచిపెట్టుకుపోయేలా ఫలితాలు రావడం నరేంద్ర మోదీ-నితీశ్ జోడి నాయకత్వ ఘన విజయాలను, రాహుల్-తేజస్వి ఘోర వైఫల్యాలను చాటి చెబుతుంది.

ఈ సారి బిహార్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 67 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. ఇది ప్రజాస్వామ్య ఘన విజయమే కాదు, బిహార్ లో ఎన్డీఏ ప్రభుత్వ పనితనానికి ప్రజామోదాన్నీ తెలియచేస్తుంది. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత హరియాణా, మహారాష్ట్ర, దిల్లీలో కూడా బిజెపి రికార్డ్ విజయాలు సాధించగా, కాంగ్రెస్ ఘోర పరాభవాలతో వాష్ అవుట్ దిశగా పయనిస్తోంది. బిహార్ అఖండ విజయం ఇచ్చిన ఉత్సాహంతో బిజెపి వచ్చే సంవత్సరం జరుగనున్న అస్సాం, పుదుచ్చేరిల్లో అధికారాన్ని పటిష్ట పర్చుకొని, బెంగాల్ లో దీదీని గద్దె దింపి కాషాయ జెండా ఎగరేసి, తమిళనాడు, కేరళలల్లో మెరుగైన పలితాలు సాధించడంపై పార్టీ దృష్టి కేంద్రీకరించింది. 

ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే, 2027లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలో బిజెపి మరోసారి అఖండ విజయం ఖాయం అన్న విశ్వాసం రోజురోజుకు బలపడుతోంది. కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం కుర్చీపై కొనసాగుతున్న కొట్లాట ఒకవైపు, సిద్ధరామయ్య పాలనపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత మరోవైపు, వెరసి రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించి మరోసారి కన్నడనాట కాషాయ జెండాను రెపరెపలాడించడం గ్యారెంటీ అని స్పష్టమవుతోంది. రానున్న కొన్ని దశాబ్దాల వరకు దేశంలో బిజెపికి తిరుగుండదని ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు ఢంకా బజాయించి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీనే శాశ్వతంగా బొంద పెట్టగలడని కూడా అంటున్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు దీటుగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కర్ణాటక గెలుపు శుభసూచకం అవుతుందని తెలంగాణలోని బిజెపి అభిమానులు, మద్దతుదారులు గాఢంగా విశ్వసిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఉప ఎన్నికల్లో ఒకటి రెండు అసెంబ్లీ స్థానాలు గెలిస్తే గల్లీలో చేసుకునే సంబరాలను దిల్లీ వరకు తీసుకుపోయే పరిస్థితి. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం చందంగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు సంబరాలు దిల్లీలో జరుపుకొంది. అది కూడా జూబ్లీహిల్స్ లో ప్రచారానికి రాని రాహుల్ గాంధీని సత్కరించడం మరీ విడ్డూరంగా ఉంది. బహుశః జూబ్లీహిల్స్ ప్రచారానికి రాహుల్ గాంధీ రాకపోవడం వల్లే గెలిచామని, ప్రచారానికి రాకుండా ఉన్నందుకు సత్కరించారా? అని ప్రత్యర్థులు వేళాకోళం చేస్తున్నారు. 

2026లో జరిగే పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమి పార్టీలే పరస్పరం పోటీ పడుతున్నాయి. ఇది ఇండీ కూటమి ద్వంద్వ వైఖరిని అద్దం పడుతుంది. అస్సాంలో కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న ఏఐయూడీఎఫ్ హస్తం పార్టీతో తమకు ప్రయోజనం లేదని గ్రహించి, తెగతెంపులు చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ వైఫల్యాలు ఇండీ కూటమి పార్టీల పైనా ప్రభావం చూపిస్తుండడంతో, ఆ పార్టీలన్నీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా గళమెత్తుతూ, నాయకత్వ మార్పును బలంగా కోరుకుంటున్నాయి. అయితే, ఎంత ఘోరంగా ఓడినప్పటికీ, రాహుల్ గాంధీని మార్చడానికి సోనియా గాంధీ ఒప్పుకోదు కాబట్టి, ఇండీ కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో బిజెపి మరింత బలపడి, ఐక్యత, సంక్షేమం, అభివృద్ధి, సురక్ష దిశగా దేశం మరింత ముందుకు సాగడానికి ఆస్కారమేర్పడుతుంది. అటు బీఆర్ఎస్ లోనూ కవిత పెడుతున్న చిచ్చుతో కేటీఆర్, హరీష్ రావుల మధ్య పోటీ పెరిగి, విచ్ఛిన్నం దిశగా కారు పార్టీ పయనిస్తోంది. ఇది తెలంగాణలో బిజెపి విజయానికి మార్గాన్ని మరింత సుగమం చేస్తుంది.