డిజిటల్ పరివర్తన ద్వారా ఆర్థిక సాధికారత
భారత్ చేపట్టిన డిజిటల్ పరివర్తన అత్యధిక జనాభాకు అనుసంధానతను, సాంకేతికత ఆధారిత పౌర సేవలను విస్తరించడంతో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. 2015లో ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రాతిపదికగా ప్రతి పౌరుడికి డిజిటల్ మౌలిక సదుపాయాలను ఒక ప్రాథమిక సౌకర్యంగా అందించడం, డిజిటల్ అంతరాన్ని తొలగించడం, కోరిన వెంటనే పాలన, సేవలను అందించడం, డిజిటల్ సదుపాయాల లభ్యత ద్వారా ప్రజలను సాధికారీకరించడంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. పదేళ్ళ క్రితం దేశంలో డిజిటల్ అంతరం స్పష్టంగా కనిపించేది. హై-స్పీడ్ ఇంటర్నెట్ ఎక్కువగా పట్టణాలకే పరిమితమై ఉండేది, గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధానత తక్కువగా ఉండేది. ఆన్‌లైన్ సేవల లభ్యత అనేది ప్రాంతం, ఆదాయం, డిజిటల్ అక్షరాస్యత (పరిజ్ఞానం)పై ఆధారపడి ఉండేది. గత దశాబ్దకాలంలో నిరంతర ప్రభుత్వ పెట్టుబడులు బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లను విస్తరించాయి. ఆప్టికల్ ఫైబర్ మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది గ్రామాలు, మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ నాణ్యతను, విస్తృతిని మెరుగుపరిచింది. నేడు ఈ అంతరం వేగంగా తగ్గుతోంది. తక్కువ ధరకే డేటా, డిజిటల్ సేవా కేంద్రాలు, పరస్పర అనుసంధానత కలిగిన పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లు పౌరులకు సంక్షేమ పథకాలను పొందడానికి, డిజిటల్ చెల్లింపులు చేయడానికి, ఆన్‌లైన్ విద్యను అభ్యసించడానికి, పాలనలో భాగం కావడానికి వీలు కల్పిస్తున్నాయి. కేవలం అనుసంధానత కార్యక్రమం (కనెక్టివిటీ మిషన్)గా ప్రారంభమైన ఈ ప్రయాణం, ప్రతి సంవత్సరం మరింత మంది భారతీయులను డిజిటల్ ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తూ విస్తృత సాధికారత దిశగా ముందుకు సాగుతోంది.
డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం
భారత్ డిజిటల్ వెన్నెముక మూడు పరస్పర అనుసంధానత స్తంభాలపై ఆధారపడి ఉంది: సార్వత్రిక అనుసంధాన మౌలిక సదుపాయాలు, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు (DPI), కంప్యూటింగ్ సామర్థ్యం. ఈ సమగ్ర విధానం ద్వారా కనెక్టివిటీ కేవలం ఇంటర్నెట్ సదుపాయంగా కాకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అర్థవంతమైన భాగస్వామ్యంగా మారుతోంది. సార్వత్రిక డిజిటల్ అనుసంధానత భారత డిజిటల్ విప్లవానికి పునాది. 2011లో ప్రారంభమైన ‘భారత్‌నెట్’ కింద భారీ ఆప్టికల్ ఫైబర్ విస్తరణ గ్రామీణ భారతాన్ని హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో జోడిస్తోంది. 2026 ప్రారంభం నాటికి 2.15 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలు అనుసంధానమయ్యాయి. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ విస్తరణ 2019లో 19.35 లక్షల కిలోమీటర్ల నుండి 2025 నాటికి 42.36 లక్షల కిలోమీటర్లకు పెరిగింది. దీనికి తోడు, భారత్ 5G విస్తరణ ఇప్పుడు 99.9 శాతం జిల్లాలకు చేరింది. డిసెంబర్ 2025 నాటికి 5.18 లక్షలకు పైగా బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023, నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ వంటి చర్యలు కనెక్టివిటీని ఒక విలాసం స్థాయి నుంచి అత్యావశ్యక హక్కుగా మార్చాయి. 2014లో ఒక గిగాబైట్ (GB)కి రూ.269గా ఉన్న డేటా ధరలు, 2025-26 నాటికి సుమారు రూ.8-10 కి పడిపోయాయి. దీనివల్ల బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారుల సంఖ్య నవంబర్ 2025 నాటికి 100 కోట్లు దాటింది.
అనుసంధానత పెరిగిన తర్వాత, ఆ ఇంటర్నెట్ సదుపాయాన్ని పౌర-కేంద్రిత సేవలుగా మార్చడంలో డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు (DPI) కీలక పాత్ర పోషిస్తున్నాయి.
- ఆధార్: ఫిబ్రవరి 2026 నాటికి 143 కోట్లకు పైగా డిజిటల్ ఐడీలను జారీ చేసింది, ఇది సంక్షేమ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీని (DBT) సులభతరం చేసింది.
- UPI: జనవరి 2026 నాటికి నెలకు రూ.28.33 లక్షల కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహిస్తోంది.
- డిజిలాకర్: ఫిబ్రవరి 2026 నాటికి 62 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులను కలిగి ఉంది. ఇది కాగిత రహిత పత్రాల నిల్వను సాధ్యం చేసింది.
జాతీయ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద దేశవ్యాప్తంగా 44 పెటాఫ్లోప్స్ (కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ‘ఫ్లోప్స్ తో కొలుస్తారు) సామర్థ్యం కలిగిన 38 సూపర్‌కంప్యూటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఏఐ, వాతావరణ నమూనాలు, బయోటెక్నాలజీ రంగాలలో పరిశోధనలకు ఊతమిస్తోంది. ప్రభుత్వ క్లౌడ్ ‘మేఘరాజ్’ ద్వారా 2,170కి పైగా ప్రభుత్వ విభాగాలు తమ అప్లికేషన్‌లను హోస్ట్ చేస్తున్నాయి.
సమ్మిళిత డిజిటల్ పర్యావరణ వ్యవస్థ
ఒక సమ్మిళిత డిజిటల్ వ్యవస్థను నిర్మించాలంటే కేవలం మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోదు. దీనికి స్థానిక సేవా కేంద్రాలు, విస్తృతమైన డిజిటల్ అక్షరాస్యత, సరసమైన ధరకే ఇంటర్నెట్, అధునాతన నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతకు తగిన అవకాశాలు అవసరం. అట్టడుగు స్థాయి వరకు సేవలను చేరవేయడంతో పాటు సామర్థ్య పెంపు, మార్కెట్ అనుసంధానాన్ని జోడించడం ద్వారా ఈ కార్యక్రమాలు దేశంలోని గ్రామాలు, పట్టణాల్లో డిజిటల్ సదుపాయాల లభ్యతను సామాజిక, ఆర్థిక సాధికారతగా మారుస్తున్నాయి.
నైపుణ్యాలు, అవకాశాల కల్పన
ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ ద్వారా 2024 మార్చి నాటికి 6.39 కోట్ల మందికి శిక్షణ ఇచ్చారు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలలో ఒకటి. అలాగే నూతన విద్యావిధానం (NEP) 2020 ద్వారా పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ విద్యను పాఠ్యాంశాలలో అంతర్భాగం చేశారు.
డిజిటల్ అభ్యసన వేదికలు
- దీక్ష: పాఠశాల విద్య కోసం 19,698 కోర్సులను అందిస్తోంది.
- స్వయం: ఉన్నత విద్య కోసం 18,500కి పైగా కోర్సులను అందిస్తోంది, దీని ద్వారా 53.7 లక్షల సర్టిఫికేషన్లు జారీ అయ్యాయి.
- ఇన్‌స్పైర్-మనక్ : 6-10 తరగతుల విద్యార్థులలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. 2025-26లో వచ్చిన ఆలోచనలలో 52 శాతం బాలికల నుంచే రావడం విశేషం.
మకాన్ సర్వీస్ సెంటర్లు: అట్టడుగు స్థాయి వరకు డిజిటల్ సేవలు
6.5 లక్షలకు పైగా గ్రామ స్థాయి వ్యవస్థాపకులు నిర్వహిస్తున్న CSCలు ఇంటర్నెట్ పరికరాలు లేని గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నాయి. ఇవి గ్రామ స్థాయిలో డిజిటల్, భౌతిక ప్రపంచానికి మధ్య వారధిగా పనిచేస్తున్నాయి.
గ్రామాల ఆర్థిక అనుసంధానం
- ఇ-నామ్: జనవరి 2026 నాటికి 1.79 కోట్ల మంది రైతులు, 1,522 మండీలు (మార్కెట్లు) డిజిటల్‌గా అనుసంధానమయ్యాయి.
- బీసీ సఖీలు: 1.49 లక్షల మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను అందిస్తున్నారు.
- పీఎం-వాణి : ఫిబ్రవరి 2026 నాటికి దేశవ్యాప్తంగా 4,09,111 వై-ఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసి, చౌకగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది.
భావి భారత్ కోసం డిజిటల్ నైపుణ్యాలు
కేవలం డిజిటల్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రజలు అత్యాధునిక సాంకేతికతలలో నైపుణ్యం సాధించేటట్టు చూడటంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
- అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM): 722 జిల్లాల్లో 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది.
- ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్: ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో 29 లక్షల మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ఇస్తోంది.
- ఇండియా ఏఐ మిషన్: రూ.10,300 కోట్ల బడ్జెట్‌తో స్టార్టప్‌లకు, పరిశోధకులకు ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని తక్కువ ధరకు అందిస్తోంది.
- స్టార్టప్ ఇండియా: గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 2016లో 400 నుండి 2025 నాటికి 2 లక్షలు దాటింది. వీటిలో 50 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఉండటం గమనార్హం.
పదేళ్ళ కాలంలో భారత్ డిజిటల్ పరివర్తన సాంకేతికత, పాలన, విద్యను ప్రజలకు చేరువ చేయడంలో ప్రధానపాత్ర వహించింది. సార్వత్రిక కనెక్టివిటీ, పటిష్టమైన డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు, అత్యాధునిక కంప్యూటింగ్ సామర్థ్యాల కలయిక ద్వారా గ్రామీణ, పట్టణ, మారుమూల ప్రాంతాల ప్రజలు నేడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములుగా మారుతున్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా భారత్ కేవలం డిజిటల్ అంతరాన్ని పూడ్చడమే కాకుండా ఎవరూ వెనుకబడిపోకుండా చూస్తూ సమ్మిళిత వృద్ధికి, స్థితిస్థాపక జ్ఞాన ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తోంది.

