హామీల అమలులో చతికిలపడ్డ కాంగ్రెస్
బీఆర్ఎస్ దోపిడీ విధానాన్ని ప్రజలు అరికట్టి, కాంగ్రెస్ కు పట్టం కట్టబెడితే అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని, హామీని నిలబెట్టుకోలేక చతికిలపడిందని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. అప్పు పుట్టడం లేదన్నారు. ఆ రాష్ట్రాల్లో కూడా మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు చుక్కలు చూపెడుతుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పొయ్యి మీద నుంచి పెనంపై పడ్డట్టు తెలంగాణ ప్రజల పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలకు బిజెపి శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
గ్రామస్థాయి నుంచి బలోపేతం చేద్దాం
బిజెపి సంస్థాగత ఎన్నికలలో భాగంగా నవంబర్ 7న సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యశాలలో కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యశాలలో మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యులున్న పార్టీ బిజెపియేనని తెలిపారు. ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకమారు గ్రామస్థాయి నుంచి సంస్థాగత ఎన్నికలను నిర్వహించుకునే ఏకైక పార్టీ బిజెపినే అని అన్నారు. పదేళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు చేసే పార్టీ బిజెపి అన్నారు. తెలంగాణలో 31 లక్షల సభ్యత్వ సేకరణ పూర్తయిందన్నారు. నవంబర్ 15 వరకు సభ్యత్వ సేకరణ చేపట్టాలన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో నిర్దేశించుకున్న సమయంలోపు లక్ష్యాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో కుటుంబాల ఆధారంగా పార్టీలు నడుస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. జమ్మూకశ్మీర్ మొదలు తమిళనాడు వరకూ కొడుకు, అల్లుడు, బిడ్డ విధానం కొనసాగుతుందన్నారు. ఈ విధానానికి బిజెపి పూర్తి వ్యతిరేకమని ఇందుకు ప్రతీ ఒక్కరూ గర్వపడాలన్నారు.
గ్యారంటీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్..
మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ అహంకారపూరితంగా పాలించిందని, దోపిడీ చేసిందని ప్రజలు భావించారన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి యేడాది గడిచినా ఒక్క రేషన్ కార్డు, పెన్షన్ రూ.4వేలు, గృహ నిర్మాణాలకు భూమిపూజ చేయలేదన్నారు. అప్పులు మాత్రం విపరీతంగా చేశారన్నారు. కేసీఆర్ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పులు చేస్తే, కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు ఏ భూములను తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలా అని చూస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తరువాత బిజెపి వైపు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం బిజెపి సంస్థాగత వ్యవస్థ ఊపిరిలాంటిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజల సమస్యపై నిలదీద్దాం
గ్రామీణ, మండల, జిల్లా కమిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపు సంస్థాగతంగా ముందుకు వెళ్తూనే గ్యారంటీలు, హామీల వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతాంగ, బడుగు బలహీన, నిరుద్యోగ, విద్యారంగ, మహిళల, నిరుపేదల సమస్యలపై బిజెపి తరఫున ప్రజలకు అండగా నిలవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రతిగింజను కొంటాం
కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి సంబంధించి చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు ఎన్నివేల కోట్లయినా ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఇక్కడి ప్రభుత్వం మధ్యవర్తులు, మిల్లర్లు, దళారీలతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం ఒక్క రూపాయి కూడా రాష్ట్రంపై భారం పడనీయదన్నారు. ప్రతి నయా పైసా లెక్కపెట్టి ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. సీఎం మాటలు కోటలు దాటుతాయే తప్ప పనులు మాత్రం కనిపించవన్నారు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. మహారాష్ట్రకు వెళ్లి చెప్పుకుంటోందని ఆరోపించారు.
ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధం కావాలి
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ ఒకవైపు దివాళా తీసే పరిస్థితి ఉందన్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయని విమర్శించారు. అప్పులు పుట్టే పరిస్థితులు లేవన్నారు. వీటన్నింటిపై బిజెపి పోరాటం చేయాలన్నారు. సంస్థాగత సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం, పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల పాటు ప్రజల పక్షాన నిలిచి పోరాడదామన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి జెండా ఎగరాలంటే ప్రజల పక్షాన పోరాడాలని, పార్టీని పటిష్ఠం చేయాలని అన్నారు. బీఆర్ఎస్ పైన విశ్వాసం లేదని తేలిపోయిందని, కాంగ్రెస్ పై ప్రజలకు ఆక్రోశం, ఆగ్రహం ఉన్నాయని అన్నారు. ఈ పార్టీలను నిలదీయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, మహబూబ్ నగర్ ఎంపీ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ, బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి పక్షనేత ఏవిఎన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండెల లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.