Supreme Court

హెచ్‌సీయూ భూముల విధ్వంసంపై రేవంత్ ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయలు  

నిస్సిగ్గుగా చట్టాలను, న్యాయస్థానాల ఆదేశాలను పట్టించుకోకుండా కంచ గచ్చిబౌలి భూములను ప్రైవేట్ వ్యక్తుల పరం చేసేందుకు ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఆ భూములతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదంటూ పర్యావరణ విఘాతంకు పాల్పడుతున్న తన నేరాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి ప్రశ్నిస్తే బిక్కమొహం వేసింది. కనీసం విధ్వంసానికి పాల్పడిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధిస్తారో చెప్పాలని నిలదీయడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దీనిపై నాలుగు వారాల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలో అడవులు లేవని వాదిస్తే అదే ప్రాంతంలో జైలు కట్టి అందులోనే అధికారులను పెట్టాల్సి ఉంటుందని జస్టిస్‌ బీఆర్‌ గవాయి హెచ్చరించడం గమనిస్తే ప్రభుత్వం ఎటువంటి నేరానికి పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు.

అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయమూర్తి హెచ్చరించారు. చెట్ల నరికివేతపై సమర్థించుకొనే ప్రయత్నం పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని కోరారు. వారంతపు సెలవుల్లో మూడు రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. మీరు చెట్లు కొట్టడం వల్ల అక్కడ జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని, ఆ వీడియోలను చూసి ఆందోళనకు గురయ్యామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలివ్వాల్సి వస్తుందని తెలిపారు. ఈ మొత్తం పరిణామం గమనిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత దారుణంగా పర్యావరణ విధ్వంసంకు పాల్పడినట్టు స్పష్టం అవుతుంది. మరోవంక, కాంగ్రెస్‌ ప్రభుత్వం చెట్లను నరికేసిన 400 ఎకరాల భూములు న్యాయబద్ధంగా హెదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకే చెందుతాయని సుప్రీంకోర్టు నియమించిన సాధికారికత కమిటీ తన మధ్యంతర నివేదికలో తేల్చిందని విద్యార్థి సంఘ నేతలు వెల్లడించారు. 

చారిత్రక రికార్డులు, న్యాయపరమైన ఆధారాల ప్రకారం 400 ఎకరాలతోపాటు హెచ్‌సీయూ పరిధిలో ఉన్న భూములన్నీ వర్సిటీకే చెందుతాయని సీఈసీ ఆధారాలతో సహా తేల్చిందని విద్యార్థులు పేర్కొన్నారు. ఆ భూములపై హక్కులను టీజీఐఐసీకి బదాలయించడంలో లోపాలను ఎత్తి చూపిందని తెలిపారు. కంచ గచ్చిబౌలిలోని 2,300 ఎకరాల భూమి రికార్డుల ప్రకారం యూనివర్సిటీకే చెందుతుందని, అప్పటి రికార్డుల్లో ‘కంచ అస్తాబల్‌ పోరంబోకు సర్కారీ’గా నమోదు చేసినట్టు తెలిపారు. కంచ గచ్చిబౌలి పరిధిలోని 400 ఎకరాల్లోని అడవిని ఎలాంటి అనుమతులు లేకుండా ధ్వంసం చేసి కాంగ్రెస్‌ సర్కారు ప్రజలు, పర్యావరణవేత్తల ఆగ్రహానికి గురైందని స్పష్టం అవుతుంది. ఆ ప్రాంతంలో వలస పక్షులు, 220 జాతుల పక్షులు, వందల జింకలు, 700 జాతుల మొక్కలు, నక్షత్రపు తాబేళ్లున్నా అడవి కాదనటంతో హాస్యాస్పదంగా మారింది.

పర్యావరణాన్ని పరిరక్షిస్తామని, వృక్షాలు, జంతుజాలాన్ని కాపాడుతామని ఎన్నికల వేళ కాంగ్రెస్ వాగ్దానం చేసింది. అందుకు విరుద్ధంగా కంచ గచ్చిబౌలిలోని 100 ఎకరాల అటవీ ప్రాంతాన్ని బుల్డోజర్లు ఉపయోగించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేలమట్టం చేసింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని స్వయంగా అత్యున్నత న్యాయస్థానమే స్పష్టం చేసింది. ‘అడవి’ అనే పదానికి సుప్రీం నిర్వచనం ప్రకారం కంచ గచ్చిబౌలి భూముల్లో ఉన్న పచ్చదనం, వృక్ష సంపదే సాక్ష్యమని స్పష్టం చేశారు. 2025 ప్రారంభంలో సుప్రీంకోర్టు అన్ని రాష్ర్టాల్లో క్షేత్రస్థాయి అటవీ ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించింది. సంబంధిత కమిటీ మార్చి 15న తెలంగాణకు వచ్చింది. కానీ ఆ కమిటీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం సహకరించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించిందని విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పుడు కంచ గచ్చిబౌలి ప్రాంతం కూడా అడవి కాదని సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పైగా, ఈ భూముల విధ్వంసం విషయంలో ఓ బిజెపి ఎంపీ పాత్ర ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకారం అందిస్తున్నారని అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ దీనికి రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు. కంచె గచ్చిబౌలి భూముల్లో విధ్వంసంపై 8 మంది బిజెపి ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు కలిసి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు వినతిపత్రాలు సమర్పించారని మరచిపోతున్నారా? స్వయంగా ఈ పర్యావరణ విధ్వంసంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేయడం చూడలేదా? 

పర్యావరణ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్దగా తేడా కనిపించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పర్యావరణ విధ్వంసంనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పక తప్పదు. పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న కేటీఆర్ 111 జీవోను ఎత్తివేసి లక్షలాది ఎకరాల భూములను కాంక్రీట్ జంగిల్‌గా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఎందుకు ప్రయత్నించిందో చెప్పగలరా? ఫాం హౌస్‌లు నిర్మించుకునేందుకు ఆ ప్రభుత్వం ఏవిధంగా అనుమతులు ఇచ్చింది? భాగ్యనగరానికి ‘లంగ్ స్పేస్’గా ఉన్న 111 జీవో పరిధిలో చెట్లు నరికివేసి నిర్మాణాలు జరిపినప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పక తప్పదు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో దిగివచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్‌సీయూ విధ్వంసంపై నిరసనలకు దిగిన యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించు కొంటున్నట్టు ప్రకటించింది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ మేరకు ప్రకటించి రెండు వారాలైనా ఆ కేసులు వీటిని ఉపసంహరించుకోలేదు.

కాంగ్రెస్ తప్పులను అడ్డుకుంటూనే ఉన్నాం

‘‘పర్యావరణ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్దగా తేడా లేదు. హెచ్‌సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 400 ఎకరాల విధ్వంసాన్ని బిజెపి మొదటి నుంచీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను బిజెపి మొదటి నుంచే అడ్డుకుంటూ వస్తోంది. ఈ బుల్డోజర్ విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్ లను కలిసి ఫిర్యాదు చేశాం. సాధికారత కమిటీ ముందు బిజెపి ఎంపీలు హాజరై, అవసరమైన డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాం. సాధికారత కమిటీ ఇంకా కొన్ని ఆధారాలు కోరుతోంది. కమిటీ నివేదిక మేరకు వచ్చే తీర్పును బిజెపి గౌరవిస్తుంది. కంచె గచ్చిబౌలి భూముల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాత భారత ప్రభుత్వం నూరుశాతం చర్యలు తీసుకుంటుంది. 111 జీవోను ఎత్తివేసి లక్షలాది ఎకరాల భూములను కాంక్రీట్ జంగిల్‌గా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఎందుకు ప్రయత్నించింది? ఫాం హౌస్‌లు నిర్మించుకునేందుకు అనుమతులు ఎలా ఇచ్చారు? భాగ్యనగరానికి ‘లంగ్స్ స్పేస్’గా ఉన్న 111 జీవో పరిధిలో చెట్లు నరికివేసి నిర్మాణాలు జరిపినప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదా?’’

-రఘునందన్ రావు, మెదక్ ఎంపీ

కృష్ణ చైతన్య