హిందూ ఉగ్రవాదం – రాజకీయ కుట్ర
17 సంవత్సరాల అనంతరం దేశంలోని వంద కోట్లకు పైగా హిందువులపై ముద్ర పడ్డ అతిపెద్ద మచ్చ తొలగిపోయింది. ఆ మచ్చ పేరు ‘భగవా ఆతంక్‌వాద్, కాషాయ తీవ్రవాదం, హిందూ తీవ్రవాదం’. మహారాష్ట్రలోని మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, కర్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. హిందూ ధర్మాన్ని బోధించేవారు, ఆ జీవన విధానాన్ని అవలంబించేవారు, హిందూ ధర్మం కోసం తీవ్రవాదులుగా మారే అవకాశం లేదని, హిందూ ధర్మ బోధనల్లో ప్రతీకారానికి, మారణహోమానికి ప్రస్తావనే లేదని ఈ కోర్టు తీర్పు ద్వారా యావత్ ప్రపంచానికి మరోసారి స్పష్టమైంది.
”సర్వే జనా సుఖినోభవంతూ..” హిందూ జీవన విధానంలో ఉన్న ప్రాథమిక సూత్రం. హిందూ ధర్మాన్ని బోధించే ప్రతి యోగి, ప్రతి సిద్ధాంతి, ప్రవచనకారుడు, స్వామిజీ చెప్పే మొదటి బోధనా మంత్రం ఇది. హిందూ ధర్మాన్ని ఆచరించని వారిని కాని, ధర్మాన్ని కించపరిచేవారిని కాని, వేరే మతాచారాలను అవలంబించే వాళ్లను కాని శిక్షించండి, లేదా వెలివేయండి అని భగవద్గీతలో, ఏ పురాణాల్లో, ఇతిహాసాల్లో లేదు. హిందుత్వాన్ని అవలంబించేవారు ”లోకా సమస్తాం సుఖినోభవంతూ” అంటూ ప్రపంచ మానవులు అందరూ సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. మతం పేరుతో హిందువు ఏనాడు ఉగ్రవాది కాడు, కాలేడు. కాని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌ను నడిపించిన సోనియా గాంధీ కుటుంబం ఒక వర్గాన్ని సంతోషపెట్టడం కోసం దేశంలో ఉన్న100 కోట్ల హిందువులను బద్నాం చేసింది. ఇప్పటివరకు మతం పేరిట సాగే ఉగ్రవాదం ఏంటో యావత్ ప్రపంచానికి తెలుసు. ఇస్లామిక్ టెర్రరిస్టులు భారతదేశంలో చేసే మారణహోమంలో ఆ వర్గానికి చెందిన వాళ్లనే అరెస్ట్ చేస్తూ పోతే మైనార్టీలు నొచ్చుకుంటారని భావించి ఆ నేరాన్ని దేశంలో మెజార్టీ వర్గమైన హిందువులపై నెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగానే ”భగవా ఆతంక్ వాద్ ” అంటే కాషాయ ఉగ్రవాదం అనే కల్పిత కథనాన్ని రచించింది. అందులో భాగంగానే 29 సెప్టెంబర్ 2008 నాడు మహారాష్ట్రలోని మాలేగావ్ మర్కెట్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ వెనుక ఉన్నది ‘హిందూ తీవ్రవాదం’ అని ఆనాటి ప్రభుత్వం ప్రకటించింది. ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఉంది.
హిందూ ఉగ్రవాదం పేరుతో సాధారణ హిందువులను ఇరికిస్తే పెద్దగా ప్రభావం ఉండదనుకున్నారో ఏమో ఏకంగా సన్యాసిని, కాషాయ దుస్తుల్లో ఉండే సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్‌ను, ఆరెస్సెస్ ప్రతినిధి, కాషాయ దుస్తులనే ధరించే స్వామి అసిమానంద, ఆర్మీ ఆఫీసర్ కర్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌తో పాటు పలువురు హిందువులను మాలేగావ్ బ్లాస్ట్ కేసులో నిందితుల్ని చేశారు. వీళ్లలో కొందరిని ఇదే కాకుండా సంజౌతా ఎక్స్‌ప్రెస్ బ్లాస్ట్, హైదరాబాద్ మక్కా మసీద్ బ్లాస్ట్, అజ్మీర్ దర్గా బ్లాస్ట్ లాంటి కేసుల్లో కూడా నిందితుల్ని చేశారు. వీళ్లంతా నిరపరాధులని ఏటీఎస్‌కు తెలుసు. కాని పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఏటీఎస్ అధికారిగా ఉన్న పరమ్ బీర్ సింగ్ లాంటి వాళ్లు రెచ్చిపోయారు. బాంబ్ బ్లాస్ట్ వెనుక బిజెపి పెద్దల హస్తం ఉందని చెప్పాలని సాధ్వీ ప్రగ్యాసింగ్ ను టార్చర్ చేశారు. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్న మోహన్ భగవత్ జీ ని అక్రమంగా అరెస్టు చేసి తీసుకురావాలని తనపై అధికారి పరమ్ బీర్ సింగ్ తీవ్ర ఒత్తిడి పెట్టారని మాజీ ఏటీఎస్ అధికారి మెహబూబ్ ముజావర్ ఆరోజు నుంచి చెబుతూనే ఉన్నాడు. ఆనాటి యువ ఎంపీ, నేటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ పేరు చెప్పాలని మరో సాక్షిని తీవ్రంగా టార్చర్ చేశారని ఆయన మీడియా ముందు చెప్పాడు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ మరియు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు హిందూ తీవ్రవాదానికి సంబంధించిన ఒక కొత్త సిద్ధాంతాన్ని దేశం ముందు ప్రవేశపెట్టాయి. ఇంకా రాహుల్ గాంధీ అయితే దీన్ని పాకిస్తాన్ ఉగ్రవాదం కన్నా కూడా తీవ్రమైనదిగా అభివర్ణించారు.
మాలేగావ్ పేలుళ్ల కంటే 3 ఏళ్ల ముందే ప్రగ్యా సింగ్ ఠాకూర్ సన్యాసినిగా మారారు. తన వస్తువులు, వాహనాలన్నింటిని ఏనాడో తీసేశానని ఆమె చెప్పినప్పటికీ వినకుండా ఆ బ్లాస్ట్‌కు వాడింది ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు చెందిన ద్విచక్రవాహనమే అంటూ మహారాష్ట్ర ఏటీఎస్ ఆమెను ప్రధాన నిందితురాలిని చేసి తీవ్రంగా టార్చర్ చేసింది. న్యాయస్థానంలో వీళ్ల కుట్ర సునాయాసంగా బట్టబయలైంది. ఆ కేసు దర్యాప్తు, విచారణలో న్యాయస్థానం ఏం చెప్పిందో చూడండి. మొదటి విషయం, విచారణ సంస్థ కోర్టులో ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైందని న్యాయస్థానం చెప్పింది. పేలుడు జరిగినది సత్యమే కానీ ఆ బాంబు మోటార్‌సైకిల్‌లో ఉందని కూడా నిరూపించలేకపోయారని న్యాయమూర్తి చెప్పారు. రెండో విషయం, లెఫ్టినెంట్ కర్నల్ పురోహిత్ ఇంట్లో పేలుడు పదార్థాలకు సంబంధించి, బాంబు తయారీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఏటీఎస్ చెప్పినప్పటికీ ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు. మూడో విషయం, విచారణ సమయంలో ఫింగర్ప్రింట్లు, మొబైల్ డేటా లేదా కాల్ డిటెయిల్స్ కూడా సేకరించలేదు – అంటే ఈ దర్యాప్తులో నిర్లక్ష్యం జరిగింది. నాలుగో విషయం, ‘అభినవ్ భారత్’ అనే సంస్థ నుంచి తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు వచ్చాయని ఎలాంటి ఆధారం రుజువు కాలేదు. ఒక్కసారి ఆలోచించండి ఆ పేలుడు తర్వాత ‘కాషాయ తీవ్రవాదం’ అనే సిద్ధాంతాన్ని రచించిన కాంగ్రెస్, ఆ తప్పుడు కేసును నిరూపించలేకపోయింది. ఇది కావాలని, ఒక కుట్రపూరితంగా, ఆరంభంలోనే విచారణ తప్పుదారి పట్టించినట్టు బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రయోగశాలలో హిందువులపై ద్వేషాన్ని పెంచే ఈ ప్రయోగం జరిగినట్టు స్పష్టమవుతోంది.
ఈ విధమైన సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం ద్వారా ఒకవేళ ఎన్నికలు గెలిచినా, కొన్ని స్థానాలు పొందినా, దాంతో ప్రజాస్వామ్యం బలపడుతుందా? లేక ప్రజాస్వామ్యం బలహీనమవుతుందా? అన్నది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక ప్రత్యేక వర్గాన్ని ఆకర్షించేందుకు, ఓటు బ్యాంక్ ఆధారంగా సంతుష్టీకరణ రాజకీయం చేస్తే, అది ప్రజాస్వామ్యానికి బలమా? లేక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమా అన్నది విజ్ఞులు తేల్చాలి. “హిందూ ఉగ్రవాదం” అనే అబద్ధపు ఆరోపణతో 17 సంవత్సరాల పాటు కేసు నడిచింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా మొదటి పేరు 55 ఏళ్ల సాథ్వీ ప్రగ్యా ఠాకూర్, రెండో పేరు 53 ఏళ్ల కర్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్. వీరిద్దరిపై చేసిన ఆరోపణలు కోర్టులో నిరూపణ కాలేదు. వీరిని ఈ కేసులో ఇరికించారు. మాలేగావ్ బ్లాస్ట్ కేసు మొదట్లో మహారాష్ట్ర ఏటీఎస్ విచారణ చేసింది. తర్వాత 2011 లో ఎన్ఐఏకి ఇచ్చారు. 2016లో ఎన్ఐఏ చార్జిషీట్ వేసింది. 17 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. ఈ కేసులో మొత్తం మూడు దర్యాప్తు సంస్థలు, నాలుగు న్యాయమూర్తులు మారిపోయారు.
సంసారిక జీవితాన్ని వదిలేసి, అపర బ్రహ్మచారిణిగా, నిస్వార్థమైన సన్యాసినిగా మారిన ప్రగ్యా సింగ్ ఠాగూర్‌తో పాటు మరో ప్రధాన నిందితుడు కరడుగట్టిన దేశ భక్తుడు, ఆర్మీ అధికారి అయిన లెఫ్టినెంట్ కర్నల్ శ్రీకాంత్ పురోహిత్‌పై బాంబు పేలుళ్ల కోసం RDX సమకూర్చడం, ఆయుధాలు కొనుగోలు చేయడంలో సహాయం చేయడం, బాంబు తయారీలో సాంకేతిక సహాయం అందించడం వంటి ఆరోపణలు మోపారు. అంతేకాకుండా, ఆయనపై ‘అభినవ్ భారత్’ అనే సంస్థను ప్రారంభించడం, ఆ సంస్థ కోసం రూ.21 లక్షలు సేకరించడం అనే ఆరోపణలు కూడా పెట్టారు. వీరిద్దరినీ అరెస్టు చేసి సాంకేతిక ఆధారాలు లేకున్నా ఏళ్ల తరబడి జైలులో ఉంచారు.
విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్న ఏటీఎస్ అధికారులు వాళ్లపై చేసిన థర్డ్ డిగ్రీ క్రూరత్వానికి పరాకాష్టగా ఉండేదని సాథ్వీ ప్రగ్యా ఎన్నో సార్లు మీడియాకు వివరించారు. ఒక మహిళా సన్యాసిని అని కూడా చూడకుండా పరమ్ బీర్ సింగ్ అనే ఏటీఎస్ అధికారి విచక్షణారహితంగా థర్డ్ డిగ్రీ నిర్వహించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండు వారాలపాటు విచారణ పేరుతో చేసిన అకృత్యాలను సాథ్వీ ప్రగ్యా సింగ్ మాటల్లో వింటుంటే కన్నీళ్లు ఆగవు. ఆ టార్చర్‌ను తట్టుకుని ఆమె ఎలా బతికిందో అని ఆశ్చర్యం కలుగుతుంది. పోలీసు దెబ్బలకు తాళలేక ఎంతో మంది లాకప్ డెత్ అయ్యారని, వాళ్ల డెడ్ బాడీలను పోలీసులే మాయం చేశారని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. 17 ఏళ్లుగా సాధ్వి ప్రగ్యాసింగ్, కర్నల్ పురోహిత్‌తో పాటు నిందితులంతా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్లందరి జీవితం ఒక నరకంగా మారింది. జామీన్ వచ్చిన తర్వాత, కర్నల్ పురోహిత్‌ను మళ్లీ భారత సైన్యంలో తీసుకున్నారు. కానీ జైలు జీవితం, కేసు కారణంగా, ఆయనకు ఒక్క ప్రమోషన్ కూడా రాలేదు. దాంతో ఆయన, తాను పనిచేసిన సహచరుల కంటే వెనుకబడిపోయారు, పైగా తప్పుడు నిందనూ మోస్తూ ప్రతీక్షణం కుమిలిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత కూడా, కర్నల్ శ్రీకాంత్ తనపై జరిగిన అన్యాయంపై ఎవరినీ నిందించలేదు, ఎటువంటి ఆవేదన వ్యక్తం చేయలేదు. ఆయన ఏమన్నారంటే… “ఈ దేశం నాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చింది. ముందూ ఇచ్చింది, ఇప్పుడు తిరిగి ఇచ్చింది. భగవంతుడికి ధన్యవాదాలు. నా కోరిక ఒకటే, భగవంతుడు, మాతృభూమి ప్రతి ఒక్కరికీ ఇలాగే సేవ చేయడానికి అవకాశాలు ఇవ్వాలి. దేశం కోసం పని చేయండి సోదరులారా.. ఎందుకంటే దేశం కన్నా గొప్పది ఇంకొకటి లేదు. ఇది మన దేశం. మనం పనిచేయాలి.” ఇంతటి దేశభక్తుడైన సైనికుడిని యూపీఏ ప్రభుత్వం ఉగ్రవాదిని చేసింది.
ఈ కేసులో ఉన్నవాళ్లలో ఎవరు కూడా ఉగ్రవాదులు కారని ఏటీఎస్‌కు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కాని వాళ్లను ఎందుకంత టార్చర్ చేశారనేది తీర్పు వచ్చాక చాలా విషయాలు బయటకు వచ్చాయి. హిందూ ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకుని భారత్‌లో ఎప్పుడు ఏ పేలుళ్లు జరిగినా వాటికి హిందువులను బాధ్యులను చేయాలన్నది రాహుల్ గాందీ, మన్మోహన్ సింగ్ ఆలోచన. సాఫ్రాన్ టెర్రరిజం అనే నరేషన్ ను ప్రపంచం ముందు పెట్టి బిజెపి, ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతల్ని జైల్లో పెట్టి భవిష్యత్తు ఎవరూ హిందూ అన్న పేరు పలకకుండా భయబ్రాంతులకు గురిచేయాలన్నది వాళ్ల లక్ష్యంగా స్పష్టమవుతోంది. 100 కోట్ల హిందువులపై ఇంతటి కుట్ర చేసిన రాహుల్ గాంధీ మాత్రం కోర్టు తీర్పుపై స్పందించండి అని మీడియా ప్రతినిధులు ఆయన ముందు మైకులు పెడితే దానికి సమాధానం చెప్పలేక భారత ఆర్థిక స్థితి గురించి మాట్లాడారు. ”మనది డెడ్ ఎకానమీ అని అమెరికా అధ్యక్షుడు అన్నది మీరు వినలేదా ” అని మీడియా వాళ్లను ప్రశ్నించారు. మైనార్టీ వర్గం ఓట్లను ఆకర్షించడం కోసం రాహుల్ గాంధీ చేసిన దారుణమైన రాజకీయ కుట్ర ఈరోజు బట్టబయలైంది. కాంగ్రెస్ పార్టీకి, ఆనాటి యుపీఏ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత ద్వేషం అంటే హైదరాబాదులో మక్కా మసీదు పేలుడు, అదే ఏడాది సంజౌతా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన బాంబు పేలుడు కేసుల్లోను హిందువులనే ఇరికించారు.
2008లో మాలేగావ్ బాంబు పేలుళ్ల తర్వాత, ‘సాఫ్రన్ టెర్రర్’ అనే పదాన్ని ఇంగ్లిష్‌లో, ‘భగవా ఉగ్రవాదం’ అనే పదాన్ని హిందీలో తొలిసారిగా వినియోగించారు. అప్పుడు రాహుల్ గాంధీ, కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం, ప్రతి వేదికపై ‘కాషాయ టెర్రరిజం’ అనే ఓ నరేటివ్‌ను ప్రజల ముందు తీసుకురావడం ప్రారంభించింది. జూలై 2009లో, రాహుల్ గాంధీ భారతదేశంలోని అమెరికా రాయబారి టిమోతి రోమర్‌ను కలిశారు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందూ ధార్మిక సంస్థలు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబా కంటే కూడా ప్రమాదకరమైనవి అని చెప్పారు. ఈ విషయాన్ని అమెరికా రాయబారి వెంటనే వాషింగ్టన్కు పంపించారు. ఈ విషయం 2010లో వికీలీక్స్ ద్వారా బట్టబయలైంది. లష్కరే తోయిబా కంటే హిందూ ఉగ్రవాదంతోనే దేశానికి పెద్ద ప్రమాదం అని రాహుల్ గాంధీ ముంబై ఉగ్రదాడి తర్వాత మాట్లాడిన విషయం దేశ ప్రజలందరికీ తెలుసు.
మాలేగావ్ పేలుడు జరిగిన కొద్దిసేపటికే, అంటే 30 నవంబర్ 2008న పి. చిదంబరం కేంద్ర హోంమంత్రిగా బాధ్యత స్వీకరించారు. హిందూ సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు, వారు ఎన్నో బాంబు పేలుళ్లకు బాధ్యులు అని ఆగస్టు 2010లో పి. చిదంబరం దేశానికి ఓ కొత్త సిద్ధాంతం చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, 2008 నుంచి 2011 వరకు ప్రతి వేదికపై హిందూ ఉగ్రవాదం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోందని, బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలు నడుపుతోందని చెప్పారు. అంతే కాదు, 2008లో ముంబయి 26/11 ఉగ్రదాడి వెనుక కూడా హిందూ సంస్థలే ఉన్నాయంటూ ఆరోపించారు. ఒకవేళ పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ పోలీసులకు దొరికి ఉండకపోతే, లష్కరే తొయిబా ముంబాయి ఉగ్రదాడి పని తమదే అని చెప్పి ఉండకపోతే ఇంకా ఎంత మంది హిందువులను ఈ కేసులో ఇరికించి చంపేవారో ఊహించుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ఇది భారత దేశ భద్రతకు ఎంతటి ప్రమాదకరమో ప్రజలు అలోచించాలి. దేశంలో జరిగే పేలుళ్లకు హిందూ ఉగ్రవాదం పేరుతో కేసులు పెడుతూ పోతే, నిజమైన టెర్రరిస్టులకు ఎలాంటి స్వేచ్ఛ లభిస్తుందో ఊహిస్తేనే భయమేస్తోంది. దీనికి ఆనాటి బాంబు పేలుళ్లే ఉదాహరణగా చెప్పొచ్చు. 2008లో, దేశంలో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి. దిల్లీతో పాటు అనేక ఇతర నగరాల్లో 8 భారీ పేలుళ్లు జరిగాయి. అందులో 4 చోట్ల సీరియల్ బ్లాస్ట్స్ జరిగాయి. ఈ ఉగ్రవాద ఘటనల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని వాడటం ప్రారంభించింది. వాస్తవానికి ఈ పేలుళ్ల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉందని దర్యాప్తు సంస్థలకు సమాచారం ఉంది. కాని ఈ పేలుళ్లకు వాస్తవ బాధ్యులుగా ఉన్న పాకిస్థానీ ఉగ్రవాదులపై నేరంగా చూపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై దుష్ప్రచారం మొదలుపెట్టింది. అంతే కాదు, “హిందూ ఉగ్రవాదం కూడా ఉంటుంది” అన్న నరేటివ్ కాంగ్రెస్ నిర్మించింది. దీని ద్వారా కాంగ్రెస్ రెండు ప్రయోజనాలు ఆశించింది:
- అంతర్గత భద్రత విషయంలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం.
- ఒక ప్రత్యేక మైనారిటీ ఓటు బ్యాంకును సంతృప్తి పరచడం ద్వారా ఓట్లు కొట్టేయడం.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక రాజకీయ వ్యూహంగా మార్చి, భారతదేశ హిందువులపై అపవాదులు మోపారు. కాంగ్రెస్ చెప్పాలనుకుంటున్నదేమిటంటే ‘ఉగ్రవాదం ఒక్క మతానికి మాత్రమే పరిమితం కాదు’ అని. దీన్ని సాధించడానికి దేశంలోని పెద్ద సంఖ్యలో హిందువులను విలన్ లుగా మార్చే ప్రయత్నం చేసింది. ఇది ప్రజాస్వామ్య దేశానికి చాలా ప్రమాదకరమైన విషయం. ఈ రోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ గగ్గోలు పెడుతున్నావాళ్లకు ఆరోజు వాళ్లు చేసింది ప్రజాస్వామ్యం ఖూనీ కాదా? భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లిన ప్రతిసారి న్యాయవ్యవస్థ దాన్ని కాపాడుతుంది అనేందుకు మాలేగావ్ పేలుళ్ల తీర్పు మరో ఉదాహరణగా నిలుస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికైనా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు ఆపి ప్రజాస్వామ్యయుతంగా రాజకీయం చేస్తే మంచిది, లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఆ మూడు రాష్ట్రాలు కూడా మిగలవు. కాంగ్రెస్ ముక్త్ భారత్ కార్యాన్ని ప్రజలు అతి త్వరలో నిర్వహిస్తారన్న విషయాన్ని ఇప్పటికైనా రాహుల్ గాంధీ గుర్తిస్తే మంచిది.
జెనవాడే సంగప్ప,
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి

