జనసందేశ్ పూర్వ సంపాదకుడు ఏఎస్సార్ ప్రసాద్ అస్తమయం
భారతీయ జనతా పార్టీ తొలితరం కార్యకర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి అధికారిక పక్షపత్రిక జనసందేశ్ పూర్వ కార్యనిర్వాహక సంపాదకుడు అన్నాప్రగడ శివరాం ప్రసాద్ (ఏఎస్సార్ ప్రసాద్) డిసెంబర్ 7, ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. అయన వయసు 70 సంవత్సరాలు. ప్రస్తుత పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట సమీపంలోని కారుమంచిలో 1955 మార్చి 22న జన్మించారు. నర్సరావుపేటలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన కృష్ణా జిల్లా నందిగామకు వచ్చి ఇన్ కమ్ టాక్స్, కమర్షియల్ టాక్స్ ప్రాక్టీషనర్ గా తన ఉద్యోగ జీవితం మొదలు పెట్టారు. మొదటి నుంచి జాతీయభావాలు కలిగిన ప్రసాద్ జనసంఘ్, బిజెపి సిద్దాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. విజయవాడ కేంద్రంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాద్యాయ ప్రబోధించిన ఏకాత్మ మానవతావాద సిద్ధాంతం ఆయన్ను అమితంగా ఆకట్టుకుంది. ఈ సిద్ధాంతాన్ని నందిగామ ప్రాంతంలో ప్రచారం చేయడంలో ఏఎస్సార్ కీలక పాత్ర పోషించారు. మరోవైపు, రాజకీయ, సామాజిక, సాహిత్య అంశాలపై పలు పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవారు. ఒక సందర్భంలో శ్రీ శ్రీ కవిత్వంపై ఆయన రాసిన వ్యాసం చదివిన ఆర్ఎస్ఎస్ ప్రచారక్, బిజెపి ఉమ్మడి ఏపీ పూర్వ సంఘటనా ప్రధాన కార్యదర్శి పి. వేణుగోపాల్ రెడ్డి ఆయనలోని జర్నలిస్టు కోణాన్ని గమనించి, ఆంధ్రప్రభ నందిగామ విలేకరిగా ఏఎస్సార్ కు అవకాశం కల్పించారు.
ఆంధ్రప్రభ విలేకరిగా నందిగామ ప్రాంతంలో మంచి పేరు సంపాదించారు. ఆయన రచనా శైలి నాయకులను విశేషంగా ఆకట్టుకునేది. అనతి కాలంలోనే పార్టీలకతీతంగా పలువురు నేతలు తమ రాజకీయ జీవితానికి సంబంధించి సలహాలు, సూచనలు వీరి నుంచి తీసుకునేవారు. మొదటి నుంచి హోమియో వైద్యంపై మక్కువ ఉన్న ఏఎస్సార్ ఆ వైద్య శాస్త్రాన్ని స్వంతంగా ఔపోసన పట్టి దానిపై విశేషమైన పట్టు సాధించారు. తన సన్నిహితుల కుటుంబాల్లోని పలువురికి దీర్ఘకాల వ్యాధులను హోమియోతో నయం చేశారు. వైద్యం కోసం ఎవరి వద్దా ఒక్క రూపాయి కూడా తీసుకునేవారు కాదు, పైగా మందులు తానే ఉచితంగా ఇచ్చేవారు. వేణుగోపాల్ రెడ్డి సూచన మేరకు 1994 ప్రాంతంలో జనసందేశ్ సంపాదక బాధ్యతలు స్వీకరించారు. జనసందేశ్ ను పార్టీ కార్యకర్తలే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా చదివి తీరాల్సిన అనివార్యతను కల్పించడంలో వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఏఎస్సార్ చేసిన కృషి అనన్య సామాన్యం. జనసందేశ్ తో పాటు కమలవాణి , ఉదయ కమలం లాంటి పత్రికల సంపాదక బాధ్యతలు చూసేవారు. రెండు దశాబ్దాల పాటు పని చేసిన ఆయన 2004లో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు.
బిజెపి కేవలం కొద్దిమంది పార్టీయే అన్న భావనను తొలగించి ఇది అందరి పార్టీ అనే ఓ స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వడంలో ఏఎస్సార్ చేసిన కృషి ప్రశంసనీయం. బిజెపి ప్రస్తుతం ఈ స్థితిలో ఉండడానికి ఏఎస్సార్ లాంటి ఎందరో త్యాగమూర్తుల కృషి ఉంది. నమ్మిన సిద్ధాంతం కోసం మంచి జీవితాన్ని సైతం త్యాగం చేసి పార్టీ భావజాల వ్యాప్తి కోసం కట్టుబడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్నా జనసందేశ్, జాగృతి పత్రికలకు అవసరమైనప్పుడు తన సూచనలు అందిస్తూ, ప్రత్యేక సందర్భాల్లో వ్యాసాలు రాస్తూ, తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. సుమారు ఐదు దశాబ్దాల పాటు సంఘ్ పరివార్ కు తన సేవలందించిన ఏఎస్సార్ ప్రసాద్ కు శ్రద్దాంజలి ఘటిస్తున్నాం.

