pule dr laxman

బిజెపి ఎక్కడ అడ్డుపడిందో చెప్పాలి!

Pule Nivaliబీసీలకు 42% మంత్రి పదవులు ఇవ్వడానికైనా, బీసీ సబ్-ప్లాన్‌కు చట్టబద్ధత ఇవ్వడానికైనా బిజెపి ఎక్కడ అడ్డుపడిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆడలేక మద్దెల డోలు అన్నట్లుగా బిజెపిపై నిందలు వేస్తూ, “మోదీ అడ్డుకుంటున్నారు” అని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. నవంబర్ 28న మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్థంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలు, స్ఫూర్తిదాయక ఆలోచనలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారి, వేముల అశోక్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. ”తెలంగాణలో బీసీల పట్ల ఎన్నో దశాబ్దాలుగా అన్యాయాలు, అక్రమాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. వారికి న్యాయం జరిగేలా ఏ ముఖ్యమంత్రి కూడా కృషి చేయకపోవడం బాధాకరం. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. బీసీలు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాల ప్రకారం సంఘటితమవుతున్నారనే విషయం గ్రహించిన కాంగ్రెస్, గత ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు గుప్పించి, అధికారం చేపట్టిన తర్వాత మోసం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో 42% కాంట్రాక్టులు బీసీలకు ఇస్తామని, బీసీ సబ్-ప్లాన్‌ను చట్టబద్ధం చేస్తామని ప్రకటించారు. జనాభాకు అనుగుణంగా 136 కులాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత ఇస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ రెడ్డి మాటలు చెప్పారు. కానీ చివరికి ఇవన్నీ మోసంగానే మిగిలిపోయాయి. ఎన్టీఆర్ హయాంలో 1988లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేవి. ఇవాళ వాటిని కేవలం 17%కి తగ్గించారు.

‘తెలంగాణ రోల్ మోడల్’ అంటూ చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయ సర్వేలు, తూతూ మంత్ర విధానాలు, కోరలు లేని డెడికేషన్ కమిషన్, ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో చేసిన అసంబద్ధ సర్వేలు.. ఇవన్నీ చివరికి బీసీలను మోసం చేసే కుట్రగానే మారాయి. కులగణన, సర్వేలు, కోటా నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఆర్డినెన్సులు, జీవోలు.. ఇలా వెనుకబడిన వర్గాలను మభ్యపెట్టి, చివరికి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. అశాస్త్రీయ డేటాతో కోర్టుల్లో కూడా అభాసుపాలయ్యారు. మహారాష్ట్రలో ఎన్నికల సమయంలో బీసీ ఓట్ల కోసం తెలంగాణలో అశాస్త్రీయంగా బీసీ రిజర్వేషన్ల పేరిట హడావుడిగా సర్వేలు జరిపారు. ఆ తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్ బీసీలను మోసం చేసిన తీరుకు ప్రజలు చెంపపెట్టు తీర్పు ఇచ్చారు.

నెహ్రూ కుటుంబం నుండి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ బీసీలను అడుగడుగునా మోసం చేస్తూనే ఉంది. కాకా కాలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్ నివేదికలను పట్టించుకోకుండా అడ్డుకున్నది కాంగ్రెసే. బీసీ మేధావులు, యువత, విద్యార్థులు నెహ్రూ కుటుంబం నుండి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వరకు బీసీలపై కొనసాగుతున్న ద్వంద్వ నీతి, మోసపూరిత రాజకీయాలకు బుద్ధి చెప్పాలి. మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో బీసీ సమాజం మొత్తం కదలి కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలకు తగిన గుణపాఠం చెప్పాలి.” అని అన్నారు.