కల్తీ ఆహారానికి కేరాఫ్‌గా హైదరాబాద్!
హైదరాబాద్‌ను అంతర్జాతీయ మహానగరంగా మారుస్తున్నామని గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దేశ విదేశాలలో ప్రచారం చేసుకొంటున్నాయి. అయితే, ఆహార భద్రత విషయంలో మాత్రం నగరం అట్టడుగు స్థాయికి పడిపోతుంది. కల్తీ ఆహార పదార్థాలు విచ్చలవిడిగా ప్రజలు చేరుతున్నాయి. ప్రపంచ రుచుల రాజధానిగా వెలిగిపోతున్న హైదరాబాద్ ప్రస్తుతం ఆహార పరిశుభ్రత విషయంలో దేశంలోని మెట్రో నగరాల జాబితాలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అఫ్ ఇండియా (FSSAI) తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ దారుణమైన పరిస్థితులను స్పష్టం చేశాయి. నాణ్యత కంటే లాభాలే పరమావధిగా భావిస్తున్న కొందరు వ్యాపారులకు సర్వత్రా అవినీతిమయమైన ప్రభుత్వ యంత్రాంగం తోడు కావడంతో నగర ప్రజల ఆరోగ్యం విలవిలలాడుతోంది. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ మసకబారుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మంత్రులు గాని, ప్రజా ప్రతినిధులు గాని అంతులేని కల్తీ ఆహార పదార్థాల గురించి పట్టించుకోవడం లేదు.
సాధారణంగా హైదరాబాద్ అనగానే నోరూరించే ఇరానీ చాయ్, ఘుమఘుమలాడే హలీమ్ రుచులు గుర్తొస్తాయి. గ్లోబల్ ఫుడ్ మ్యాప్ టేస్ట్ అట్లాస్ జాబితాలో ప్రపంచంలోనే 50వ ఉత్తమ ఆహార నగరంగా నిలిచిన ఘనత భాగ్యనగరానిది. కానీ ఆ రంగుల వెనుక ఇప్పుడు భయంకరమైన రోగాల ముప్పు పొంచి ఉందని తెలుసుకొని ప్రజలు విస్తుపోతున్నారు. దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఆహార భద్రతా ప్రమాణాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. నగరంలో సుమారు 75,000 ఆహార సంస్థలు నడుస్తుండగా, అందులో కేవలం 25,000 మాత్రమే FSSAI లైసెన్స్ కలిగి ఉన్నాయి. ఈ లైసెన్స్ ఉన్న వాటిల్లో కూడా అధికారికంగా పరిశుభ్రత రేటింగ్ పొందినవి కేవలం 361 (2 శాతం కంటే తక్కువ) మాత్రమే కావడం గమనార్హం. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ 3,394 రేటింగ్ పొందిన సంస్థలతో అగ్రస్థానంలో నిలవగా, ఐటీ హబ్ బెంగళూరు 2,200 సంస్థలతో రెండో స్థానంలో ఉంది. ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాలు సైతం వెయ్యికి పైగా హోటళ్లకు హైజీన్ రేటింగ్స్ ఇప్పించి తమ నగర ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తుంటే హైదరాబాద్‌లో ప్రభుత్వ పెద్దలు ఎవ్వరూ పట్టించుకోక పోవడంతో కేవలం 361 రేటింగ్స్‌తో దేశంలోనే అత్యంత దారుణమైన స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం ‘సీజనల్’గానే దాడులు చేస్తుంటారా? అనే అనుమానాలు ఈ సందర్భంగా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఎప్పటికప్పుడు హోటళ్లు, ఫుడ్ స్టాల్స్‌పై చేసే దాడుల వివరాలను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించేవారు. మీడియాకు కనీసం అధికారిక నివేదికలు కూడా ఇవ్వకుండా కేవలం ఈ ఖాతానే సమాచార వనరుగా మార్చారు. అయితే మే 29న నాగోల్‌లోని ఒక నమ్కీన్ తయారీ యూనిట్‌పై దాడి చేసిన వివరాలే ఈ ఖాతాలో చివరి అప్డేట్. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పూర్తిగా లోపించిందనడానికి అధికారుల తీరే నిదర్శనమని, ఈ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో ఆహార భద్రత ఇంతలా క్షీణించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వెనుక పాతబస్తీలో తిష్ట వేసుకున్న రాజకీయ నాయకుల ఒత్తిడులే కారణమా? అనే అనుమానాలు ప్రజలలో కలుగుతున్నాయి.
స్థానిక ఐటీ కారిడార్ పరిసరాల్లోని ప్రముఖ రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణం, ఇతర లోపాలను అధికారులు గుర్తించారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లలో సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు.ఈ రెస్టారెంట్లలోని కిచెన్లను చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, నాణ్యత లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు సంబంధిత యాజమాన్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. గచ్చిబౌలిలోని షా గౌస్ రెస్టారెంట్‌లో వంటగది అంతా ఈగలు ముసిరి అత్యంత అపరిశుభ్రంగా కనిపించింది. కిచెన్ పరిసరాల్లో డ్రెయిన్లు తెరిచి ఉంచడం, కనీసం లేబుళ్లు కూడా లేని ఆహార పదార్థాలను నిల్వ ఉంచడంపై అధికారులు సీరియస్ అయ్యారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం నిర్వహించిన హైజీన్ రేటింగ్‌లో ఈ హోటల్ కేవలం 65 శాతం స్కోర్ మాత్రమే సాధించడంతో యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా, హైటెక్ సిటీలోని మెహ్ఫిల్ రెస్టారెంట్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తడి నేలపైనే ఆహార వ్యర్థాలను పడేయడమే కాకుండా, ఒకవైపు భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే రూమాలీ రోటీలను తయారు చేస్తుండటం గమనార్హం. అక్కడి సిబ్బందికి మెడికల్ సర్టిఫికెట్లు కూడా లేకపోవడంతో 67 శాతం స్కోర్ కేటాయించి మెహ్ఫిల్‌కు నోటీసులు జారీ చేశారు.
ఇక మాదాపూర్‌లోని ఐడియల్ కిచెన్ లో తనిఖీలు చేసిన అధికారులకు ఫ్రీజర్‌లోని పిండివంటలపై బొద్దింకలు, మినప్పప్పులో పురుగులు కనిపించాయి. ముడి పదార్థాల నిల్వలో తీవ్ర లోపాలు ఉన్నట్లు గుర్తించి 67 శాతం స్కోర్‌తో ఆ హోటల్‌కు నోటీసులు ఇచ్చారు. కొండాపూర్‌లోని పాలమూరు గ్రిల్ లో ఏకంగా లేబుల్ ట్యాంపరింగ్ చేయడమే కాకుండా, గడువు ముగిసిన మష్రూమ్స్ (పుట్టగొడుగులు) వాడుతున్నట్లు గుర్తించారు. దీంతో పాత ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారవేయించారు. తుప్పు పట్టిన ఫ్రీజర్లు, ఈగలతో దారుణంగా ఉన్న వంటగదిని చూసి నివ్వెరపోయిన అధికారులు 60 శాతం స్కోర్ ఇస్తూ పాలమూరు గ్రిల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత యంత్రాంగంతో నగరంలో ఆహార కల్తీని అరికట్టడం సాధ్యం కావడం లేదని ఉన్నతాధికారులు గ్రహించినట్లున్నారు. అందుకే, తెలంగాణలో ఆహార కల్తీ నియంత్రణ కోసం ఓ సరికొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌ల నేతృత్వంలోని ఉన్నత స్థాయి సమావేశంలో ఇటీవల నిర్ణయించారు. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలను కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా ఒకే విభాగాధిపతి పర్యవేక్షణలో ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఇందులో ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ సెల్, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. కల్తీ ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ ఫోర్స్ గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల నుంచి అనుభవజ్ఞులైన సిబ్బందిని ఎంపిక చేస్తున్నారు. కమాండో తరహా నిఘా విభాగం ద్వారా హోటళ్లు, రెస్టారెంట్లు, తయారీ కేంద్రాలపై ఈ బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహిస్తాయి. అయితే ప్రభుత్వ పెద్దలలో రాజకీయ సంకల్పం ఉంటే, రాజకీయ ఒత్తిడులను తట్టుకొనే సామర్థ్యం ఉంటే మాత్రమే ఇటువంటి చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వగలవు.
కృష్ణ చైతన్య

