Nitni Nabin Youth conclave

జెన్ జీ అంటే దేశాన్ని నిర్మించేవారు!

Youth Conclaveకొన్ని ప్రతిపక్ష శక్తులు ఇతర దేశాల్లోని ‘జెన్ జీ’ (Gen Z) ఉద్యమాలను గుడ్డిగా కాపీ కొడుతూ ఇక్కడి యువతను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. అయితే, భారతీయ యువత అరాచకత్వాన్ని నమ్మదని, దేశ నిర్మాణాన్ని (Nation-building) బలంగా నమ్ముతుందని అన్నారు. ‘జెన్ జీ’ (Gen Z) అంటే దేశాన్ని ముక్కలు చేయాలనే ‘తుక్డే-తుక్డే’ మనస్తత్వం కాదన్నారు. విదేశీ శక్తులు లేదా ప్రతికూల అజెండాలు భారతదేశ భవిష్యత్తును శాసించడాన్ని భారతీయ యువత ఎప్పటికీ అనుమతించదని అన్నారు. ఒకప్పుడు కశ్మీర్ యువత అనగానే రాళ్లు రువ్వే దృశ్యాలు గుర్తుకొచ్చేవని, కానీ మోదీ పాలనలో కశ్మీర్ యువత విద్య, క్రీడలు, దేశ సేవలో ముందంజలో ఉన్నారని తెలిపారు. ఈ రోజు కశ్మీర్ యువత క్రికెట్ మైదానాల్లో రాణిస్తూ, రంజీ ట్రోఫీల్లో పోటీ పడుతూ దేశం గర్వపడేలా చేస్తున్నారన్నారు. నిజమైన జెన్ జీ (Gen Z) అంటే.. రాళ్లు రువ్వేవాడు కాదు, దేశాన్ని నిర్మించేవాడు! భారతీయ యువత అంటే సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికత, అచంచలమైన ఆత్మవిశ్వాసం, దేశ ప్రగతిలో భాగస్వామ్యం. ఈ దేశ యువతకు ప్రధాని మోదీ ఇచ్చిన గొప్ప బహుమతి- ‘ఆత్మవిశ్వాసం’. 

”జీవితాన్ని కేవలం మూడు వాక్యాలలో అర్థం చేసుకోవచ్చు. గతం అనేది ఒక చరిత్ర.. అది మనల్ని ఇక్కడి వరకు నడిపించింది. వర్తమానం అనేది ఒక పోరాటం.. దానిని మనం నిరంతరం కొనసాగించాలి. భవిష్యత్తు అనేది ఒక బాధ్యత.. దానిని మనం పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లాలి.” అంటూ జీవితంలో ఎప్పుడూ షార్ట్‌కట్స్ (అడ్డదారులు) వద్దని సూచించారు. దీర్ఘకాలిక లక్ష్యంతో, సంపూర్ణ అంకితభావంతో కష్టపడుతూ, స్పష్టమైన ఆశయంతో దేశ ప్రగతికి తోడ్పడేవారికే విజయం దక్కుతుందని నితిన్ నబీన్ యువతకు సందేశమిచ్చారు. మూడు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ”వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్ క్లేవ్”లో విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించారు. జూన్ 29న బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఘట్కేసర్ లోని విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఈ కార్యక్రమంలో నితిన్ నబీన్ విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా సమాధానాలు ఇచ్చారు. అందులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు-సమాధానాలు చూద్దాం.

ప్ర: ఇంత చిన్న వయసులో జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం గురించి మీ అభిప్రాయం ఏమిటి?

జ: నా తండ్రి మరణం తర్వాత అనుకోకుండా నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయ జీవితం ప్రారంభ దశలో నేను కూడా ఎలా ముందుకు సాగాలి అనే సందేహాలను ఎదుర్కొన్నాను. కానీ కాలక్రమేణా ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను.. జీవితంలో షార్ట్‌కట్స్ అనేవి ఉండవు. జీవితం వేగాన్ని పరీక్షించే పోటీ కాదు. అది సహనాన్ని పరీక్షించే ప్రయాణం. నేను ఎలాంటి అసాధారణమైన పని చేయలేదు, ప్రత్యేకంగా ఏదీ చేయలేదు. కేవలం నిబద్ధతతో, నిజాయితీతో, నిరంతర కృషితో నా బాధ్యతలను నిర్వర్తించాను. ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమై, అధ్యక్షుడి స్థాయికి చేరిన నా ప్రయాణం నాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. మీరు మీ బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తే, పార్టీ మీ కృషిని గుర్తించి సరైన స్థాయికి తీసుకెళ్తుంది. యువతకు నేను చెప్పదలచుకున్న సందేశం ఒక్కటే.. మీ ప్రత్యేకత పట్ల నమ్మకం కలిగి ఉండండి. చాలాసార్లు సమాజ ఒత్తిడి వల్ల మనం నిర్ణయాలు తీసుకుంటాం. కానీ మీపై, మీరు ఎంచుకున్న మార్గంపై విశ్వాసం కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. ఈ మాటలు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కావు. జీవితంలో మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఇవి మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి.

ప్ర: రెండేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది. దీనిని మీరు ఎలా చూస్తున్నారు?

జ: ఒకప్పుడు యువత తమ హక్కులు, అవకాశాల గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండేవారు కాదు. కానీ సాంకేతికత విస్తరించడంతో, ముఖ్యంగా కంప్యూటర్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, యువతలో అవగాహన పూర్తిగా మారిపోయింది. గతంలో రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చేవారు. ఎన్నికలు ముగిశాక ప్రజలు వాటిని మర్చిపోయేవారు. కానీ నేటి యువత అప్రమత్తంగా, సమాచారంతో, స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. వారికి ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంటుంది. గతంలో కొందరు రాజకీయ నాయకులు ఎన్నికలను ఒక తాత్కాలిక అవకాశంగా మాత్రమే చూసేవారు. ఓట్లు సాధించేందుకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చేవారు. కానీ బిజెపి అలాంటిది కాదు. మేం సాధించగలిగిన వాటినే హామీ ఇస్తాం. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సంపూర్ణ నిబద్ధతతో పని చేస్తాం. అందుకే నేడు దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం గురించి, వికసిత భారత్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రాజకీయ దృక్పథం ఖాళీ హామీలపై కాదు.. బాధ్యత, ఫలితాల సాధన, దూరదృష్టిపై ఆధారపడి ఉంది.

ప్ర: మా తరం ఎక్కువగా మోదీ ప్రభుత్వాన్నే చూసింది. 2014కి ముందు పరిస్థితి ఎలా ఉండేది? అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ మార్పు వచ్చింది?

జ: 2014 ముందు యువతలో నిరాశ, అనిశ్చితి ఎక్కువగా కనిపించేది. ఎటు చూసినా ప్రతికూల వాతావరణమే కనిపించేది. ఉగ్రవాద దాడులు, అవినీతి, విధానపరమైన స్థబ్దత, స్పష్టమైన దిశ లేకపోవడం. దేశానికే దిశ లేని పరిస్థితులు ఉండడంతో యువత కూడా తమ భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉండేవారు. ఒక కుటుంబానికి నాయకత్వం వహించే వ్యక్తికే స్పష్టమైన దిశ లేకపోతే, ఆ కుటుంబంలోని పిల్లలు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అదే విధంగా, దేశ నాయకత్వంలో స్పష్టత లేకపోతే యువతలో కూడా అయోమయం పెరుగుతుంది. కానీ నేడు ఆ నిరాశ ఆశగా మారింది. అనిశ్చితి ఆత్మవిశ్వాసంగా మారింది. భారతదేశానికి ఇప్పుడు దృఢమైన, నిర్ణయాత్మక నాయకత్వం ఉంది. ఇలాంటి మార్పును మనం రాష్ట్రాల్లో కూడా చూశాం. బీహార్ లో 2005 తర్వాత నితీష్ కుమార్ నాయకత్వంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. కారణం ఏంటంటే బలమైన, నిర్ణయాత్మక నాయకత్వం. నాయకత్వం బలంగా ఉంటే మార్పు సాధ్యమవుతుందని ఇది నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలు ఒకే జాతీయ లక్ష్యంతో ఐక్యంగా ముందుకు సాగినప్పుడు అభివృద్ధి సాధించాయి. అమెరికా ఒక స్పష్టమైన జాతీయ దృక్పథంతో అభివృద్ధి చెందింది. చైనా కూడా స్పష్టమైన దిశ, సమిష్టి లక్ష్యంతో ముందుకు వెళ్లింది.

భారత చరిత్రలో కూడా దేశాన్ని, సమాజాన్ని కలుపుకొని నడిపిన రాజులు, నాయకులే విజయాన్ని సాధించారు. నేడు స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశమంతా ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతోంది- 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణం. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణం అనే ఏకైక లక్ష్యంతో దేశమంతా ముందుకు సాగుతోంది. 2014 తర్వాత వచ్చిన మార్పు కేవలం మోదీ నాయకుడిగా ఉండటం వల్ల మాత్రమే కాదు; దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం, ప్రజల్లో ఆశావాదాన్ని నింపడం, అభివృద్ధి చెందిన భారతదేశం వైపు నడిపించడం వల్ల కూడా సాధ్యమైంది.

ప్ర: ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్థానం మరింత బలపడింది. నేటి గ్లోబల్ వేదికపై భారతదేశ పాత్రను మీరు ఎలా చూస్తున్నారు?

జ: ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశపు ప్రాచీన నాగరికత గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. దీనికి ఉత్తమ ఉదాహరణ యోగా. మోదీ నాయకత్వంలో యోగా ప్రపంచం నలుమూలలకు చేరుకుంది. దాంతో భారతీయ సంస్కృతి, విలువలు, నాగరికత గురించి ప్రపంచం మరింత లోతుగా తెలుసుకుంది. భారతదేశం దిశానిర్దేశం చేయగల శక్తిగా ఎదిగిందని ప్రపంచం గ్రహించింది. గ్లోబల్ వ్యవహారాల్లో భారత్ ఇక కేవలం పాల్గొనే దేశం మాత్రమే కాదు; ప్రపంచం శ్రద్ధగా వినే దేశంగా మారింది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అమెరికాకు వెళ్లాను. అక్కడ అనేక మంది ప్రముఖులతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ సమయంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాతినిధ్యం, ప్రభావం ఇప్పటిలా బలంగా ఉండేది కాదు. కానీ నేడు, మోదీ నాయకత్వంలో భారతదేశం సాధించిన ప్రగతి వల్ల మన దేశ గౌరవం ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానానికి చేరింది.

యుద్ధ పరిస్థితుల్లో ఉన్న ఉక్రెయిన్, రష్యా మధ్య భారతీయుల సురక్షిత తరలింపునకు మన ప్రధానమంత్రి రెండు దేశాలతోనూ మాట్లాడారు. ఇది నూతన భారతదేశ శక్తి, గౌరవానికి నిదర్శనం. 2011లో నేను బిజెపి యువమోర్చాలో పని చేసినప్పుడు, లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి వెళ్లాం. ఆ సమయంలో అక్కడ జాతీయ జెండాను ఎగరవేయడం శాంతిభద్రతలకు భంగం కలిగిస్తుందని అప్పటి ప్రభుత్వం చెప్పింది. కానీ 2014 తర్వాత దేశమంతా కశ్మీర్ లోని లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకం గర్వంగా ఎగురుతున్న దృశ్యాన్ని చూసింది. ఇదే పరివర్తన. మోదీ నాయకత్వంలో భారతదేశం సాధించిన గొప్ప పరివర్తన ఇదే.

ప్ర: గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలను క్లియర్ చేయలేదు. ఈ అంశంపై బిజెపి అభిప్రాయం ఏమిటి?

జ: ఈ అంశంపై నా అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఈ విధంగా మధ్యలో వదిలేయకూడదు. విద్య అనేది రాజకీయాల కోసం ఆడుకునే విషయం కాదు. అనేక కుటుంబాలకు ఉన్నత విద్య అనేది తమ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది. ఫీ రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు నేరుగా ప్రభావితమవుతున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి గట్టిగా నిలదీస్తుంది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా గొంతెత్తుతాం, ఆందోళనలు చేస్తాం, పోరాడుతాం. పాలనలో స్పష్టమైన ఆలోచన, దృఢమైన నిబద్ధత ఉండాలి. నరేంద్ర మోదీ ఒక హామీ ఇస్తే, దానిని తప్పకుండా అమలు చేస్తారు. దీనికి ‘ప్రధానమంత్రి జన్ ధన్ యోజన’ ఒక గొప్ప ఉదాహరణ. ఇది పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది. ఒకప్పుడు పేదలు బ్యాంక్‌లోకి వెళ్లి ఖాతా తెరవడం అనేది ఊహకు కూడా అందదు. కానీ నేడు కోట్లాది బ్యాంక్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. అందులో మహిళల పేర్లతో పెద్ద సంఖ్యలో ఖాతాలు ఉన్నాయి. ఒకప్పుడు దిల్లీ నుంచి రూ.1 పంపితే కేవలం 15 పైసలే లబ్ధిదారునికి చేరుతాయని గత కాంగ్రెస్ ప్రధాని చెప్పేవారు. కానీ నేడు జన్ ధన్ అకౌంట్లు, నగదు బదిలీ (DBT) వ్యవస్థల వల్ల రూపాయికి రూపాయి నేరుగా పేదలకే చేరుతోంది. అమలుకు నోచుకోని హామీలు, స్పష్టమైన, నిబద్ధతతో కూడిన పాలన మధ్య ఉన్న తేడా ఇదే.

ప్ర: ప్రధాని నరేంద్ర మోదీ ఒకసారి “నితిన్ నబీన్ నా బాస్” అని అన్నారు. ప్రధానమంత్రితో మీ అనుబంధాన్ని వివరించగలరా?

జ: నరేంద్ర మోదీ ఆ మాట చెప్పినప్పుడు, అది బిజెపి సంస్కృతి, ఆత్మను ప్రతిబింబించింది. ఆయన చెప్పాలనుకున్న సందేశం ఏమిటంటే.. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఒక కార్యకర్తగా పార్టీ అధ్యక్షుడి మార్గదర్శకత్వంలో పనిచేస్తారు. ఇదే మా వ్యవస్థ బలం. దీనిని క్రికెట్‌తో పోల్చవచ్చు. సచిన్ టెండుల్కర్ గొప్ప క్రీడాకారుడు. అయినప్పటికీ, ఆయన వేర్వేరు కెప్టెన్ల నాయకత్వంలో సంపూర్ణ క్రమశిక్షణతో, జట్టు భావనతో ఆడారు. అదేవిధంగా బిజెపిలో ప్రతి ఒక్కరూ ఎంత సీనియర్ అయినా సరే.. పార్టీ పట్ల గౌరవంతో, క్రమశిక్షణతో, సంపూర్ణ నిబద్ధతతో పని చేస్తారు.

ప్ర: యువత రాజకీయాల్లోకి రావడంపై మీ అభిప్రాయం..?

జ: నేటి రాజకీయాలు చాలా మారిపోయాయి. రాజకీయాలపై పూర్తిగా ఆధారపడే స్థితిలో ఉండకూడదు. ముందుగా స్పష్టమైన లక్ష్యంతో రాజకీయాల్లోకి రావాలి. నరేంద్ర మోదీ కూడా ఒక లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని, అలాగే మరింత మంది మహిళలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అయితే వారు ఒక స్పష్టమైన లక్ష్యంతో రావాలి.. షార్ట్‌కట్స్ కోసం కాదు, వ్యక్తిగత లాభం కోసం కాదు, సమాజం-దేశ సేవ కోసం రావాలి. రాజకీయాలను క్రికెట్ పిచ్‌తో కూడా పోల్చవచ్చు. పిచ్‌పై ఎక్కువసేపు నిలబడే ఆటగాడు ఆటను బాగా అర్థం చేసుకుని, చివరికి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడు. అదే విధంగా రాజకీయాల్లో సహనం, నిబద్ధత, స్థిరత్వం ఎంతో ముఖ్యమైనవి. కేవలం చివరి ఓవర్లలో సిక్సర్లు కొట్టాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావద్దు. ముందుగా పిచ్‌పై నిలబడాలి, సవాళ్లను ఎదుర్కోవాలి, మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ తర్వాతే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. కాబట్టి నా యువ మిత్రులకు నేను చెప్పదలచుకున్న స్పష్టమైన సందేశం ఏంటంటే.. రాజకీయాల్లోకి రావాలనుకుంటే, ఒక లక్ష్యంతో రండి. సహనంతో రండి. షార్ట్‌కట్స్ కోసం మాత్రం ఎప్పుడూ చూడవద్దు.

ప్ర: తెలంగాణలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్టార్టప్‌లకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి?

జ: మన దేశంలో స్టార్టప్‌ల అభివృద్ధికి సహజసిద్ధమైన ఎకోసిస్టమ్ ఉన్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ వాటిలో ఒకటి. గత 12 ఏళ్లలో భారత్ అద్భుతమైన స్టార్టప్ విప్లవాన్ని చూసింది. నేడు దేశంలో సుమారు 2.5 లక్షల స్టార్టప్‌లు, 100కు పైగా యూనికార్న్ సంస్థలు ఉన్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగినది కాదు. ప్రధాని నరేంద్ర మోదీ యువత ఆలోచనా విధానాన్ని మార్చడం వల్లే ఇది సాధ్యమైంది. ఒకప్పుడు ఎక్కువ మంది యువత ఉద్యోగం సంపాదించడం గురించే ఆలోచించేవారు. కానీ నేడు భారత యువత మరింత పెద్ద కలలు కంటోంది. ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగడం, ఇతరులకు అవకాశాలు సృష్టించడం గురించి ఆలోచిస్తోంది. అంటే యువత ఆలోచనా విధానం ఉద్యోగం కోరేవారి స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించేవారి స్థాయికి మారింది.

ప్ర: క్రీడా మౌలిక సదుపాయాల కల్పనపై బిజెపి విజన్ ఏమిటి?

జ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, ‘ఖేలో ఇండియా’ (Khelo India) వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా క్రీడలకు దేశంలో అపూర్వమైన ప్రోత్సాహం లభించింది. ఈ పథకాలు క్రీడాకారులకు ఏదో ఒక విభాగంలో మాత్రమే కాకుండా.. వారి క్రీడా ప్రయాణంలో ప్రతి దశలోనూ అండగా నిలుస్తున్నాయి. శిక్షణ , కోచింగ్, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, క్రీడా పరికరాల సరఫరా నుండి అంతర్జాతీయ స్థాయి పోటీల సన్నద్ధత వరకు అన్ని రకాలుగా పూర్తి మద్దతును అందిస్తున్నాయి. వివిధ క్రీడలలో రాణిస్తున్న అథ్లెట్ల కోసం ఒక పటిష్టమైన శిక్షణా విధానాన్ని, సహాయక వ్యవస్థను ఇవి నిర్మించాయి. గతంలో కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, ఒలింపిక్స్ కావచ్చు.. భారతదేశానికి వచ్చే పతకాల సంఖ్య చాలా పరిమితంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతోంది. మెరుగైన క్రీడా మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ శిక్షణ, క్రీడాకారులపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా భారతదేశం క్రీడారంగంలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతోంది. గ్రామీణ, క్షేత్రస్థాయి నుండి క్రీడా ప్రతిభను గుర్తించడం, వారికి సరైన వసతులు, శిక్షణ కల్పించడం, ప్రతి యువ అథ్లెట్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి దేశం గర్వించేలా చేసేందుకు సమాన అవకాశాలు కల్పించడమే బిజెపి ముఖ్య ఉద్దేశం, దూరదృష్టి.

ప్ర: వికసిత భారత్ నిర్మాణంలో యువత పాత్ర ఏమిటి?

జ: భారతదేశంలో ఉన్న యువ జనాభా శక్తి మన దేశానికి అతిపెద్ద బలం. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2047 నాటికి ‘వికసిత భారత్’ నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు స్పష్టమైన దూరదృష్టితో పని చేస్తున్నారు. ‘స్టార్టప్ ఇండియా’ వంటి విప్లవాత్మక కార్యక్రమాలు, మరెన్నో పథకాల ద్వారా, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణ ప్రయాణంలో యువతను భాగస్వామ్యం చేసేందుకు మోదీ అనేక అవకాశాలను సృష్టించారు. జీవితం అనేది ఏదో ఒకసారి చేసే ప్రయోగం కాదు. మనం ఒక స్పష్టమైన ఆలోచనను, ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, దాని కోసం సంపూర్ణ అంకితభావం, నిబద్ధతతో శ్రమించాలి. నేటి యువత తమపై తాము నమ్మకం కలిగి ఉండాలి. వారు కష్టపడి పని చేస్తూ, లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి. తాము కేవలం భారతదేశ వృద్ధి వల్ల ప్రయోజనం పొందే లబ్ధిదారులు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును నిర్మించే క్రియాశీలక భాగస్వాములని బలంగా విశ్వసించాలి. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం కేవలం మానవ వనరుల శక్తి స్థాయి నుండి ఒక పటిష్టమైన తయారీ రంగ శక్తిగా ఎదుగుతోంది. నేడు భారత యువత “మేము నవభారతాన్ని నిర్మిస్తాం” అనే పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.

ప్ర: డ్రగ్స్ కల్చర్ బారిన పడుతున్న యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి?

జ: జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన ఒకే ఒక్క అద్భుతమైన అవకాశం. మత్తు పదార్థాలకు (Drugs) బానిసలై దానిని పాడుచేసుకోవద్దు, మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. భారత యువత సామర్థ్యంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. మన యువతకు దేశాన్ని నిర్మించే అద్భుతమైన ప్రతిభ, శక్తి ఉన్నాయి. కానీ ఈ సామర్థ్యాన్నంతటినీ నిర్వీర్యం చేయగల ప్రమాదకరమైన మహమ్మారి ఏదైనా ఉందంటే అది డ్రగ్స్ మాత్రమే. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధ ప్రాతిపదికన పోరాటం జరుగుతోంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు. యువతకు నేను ఇచ్చే సందేశం చాలా సుస్పష్టం- మిమ్మల్ని ఎంతో నమ్ముకున్న మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకండి. మీ కుటుంబానికి, సమాజానికి, దేశానికి ద్రోహం చేయకండి. మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండండి (‘Say No to Drugs’). మనమంతా కలిసికట్టుగా ఈ డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా సమూలంగా నిర్మూలిద్దాం.

ప్ర: నేను 2028లో మొదటిసారిగా ఓటు వేయబోతున్నాను. నేను బిజెపికే ఎందుకు ఓటు వేయాలి?

జ: ఎందుకంటే బిజెపి సిద్ధాంతం స్పష్టమైనది, మా విధానాలు స్పష్టమైనవి, మా ఉద్దేశం పారదర్శకమైనది. మా ఏకైక సిద్ధాంతం- ‘దేశమే ప్రథమం’ (Nation First). బిజెపి నిఘంటువులో ఎల్లప్పుడూ.. “దేశమే ముందు, పార్టీ తర్వాతే, వ్యక్తిగత ప్రయోజనం చివరన” (Nation First, Party Next, and Self Last). నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు, గౌరవం గణనీయంగా పెరిగాయి. ఎందుకంటే మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ స్పష్టత, నిబద్ధత, జాతీయ ప్రయోజనాలే కేంద్ర బిందువుగా ఉంటాయి. స్పష్టమైన సిద్ధాంతం, పారదర్శకమైన విధానం, ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయడంపైనే మేం సంపూర్ణంగా విశ్వాసం ఉంచుతాం.

ప్ర: రాజకీయ నాయకులపై నమ్మకం లేని యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి?

జ: నేటి యువతలో చాలామందికి రాజకీయ నాయకులపై సందేహాలు, అపనమ్మకం ఉన్నాయని నేను అర్థం చేసుకోగలను. రాజకీయాలలో వివిధ కాలాల్లో రకరకాల మార్పులు వచ్చాయి. ఒకప్పుడు, ముఖ్యంగా 1980వ దశాబ్దానికి ముందు, నేటి కాలంతో పోలిస్తే ప్రజలకు సమాచారం తెలుసుకునే అవకాశాలు ఇంతలా ఉండేవి కావు. కానీ నేడు, రాజకీయం, రాజకీయ నాయకులపై ప్రజల్లో ఉన్న అవగాహన అత్యున్నత స్థాయికి చేరింది. నేటి యువత పూర్తి సమాచారంతో, అప్రమత్తంగా ఉంటూ, ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉన్నారు. ఎలాంటి హామీలు ఇస్తున్నారనేది వారికి తెలుసు, అదే సమయంలో ఆ హామీలు నెరవేరుతున్నాయా లేదా అనేది కూడా వారు నిశితంగా గమనిస్తున్నారు.

ప్రస్తుత కాలంలో ప్రతి రాజకీయ నాయకుడు ఒక విషయాన్ని తప్పకుండా గ్రహించాలి.. ప్రజలు తమను ఖచ్చితంగా జవాబుదారీగా (Accountable) నిలబెడతారు. మీరు ఎలాంటి హామీ ఇచ్చినా, రేపు ప్రజలు దాని గురించి నిలదీసి ప్రశ్నలు అడుగుతారు.