Yadadri

తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన ‘యాదాద్రి’ ఆలయ ట్రస్ట్ బోర్డు

తెలంగాణలోని ప్రముఖ ఆలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌, సభ్యుల నియామకం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రాజేసింది. చైర్మన్‌, సభ్యుల నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ నేతలను పక్కనపెట్టి ఎక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా నియమించడంపై మరింతగా మండిపడుతున్నారు. అంతకు రెండు రోజుల క్రితమే నల్గొండలో కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వచ్చారని, ఆ సందర్భంగా ప్రజాప్రతినిధులకు మాటమాత్రంగా కూడా చెప్పలేదని వాపోతున్నారు. చివరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో వ్యక్తిగత లండన్ పర్యటనలో ఉంటే, ఆమెను కూడా సంప్రదించలేదు. బోర్డు ఏర్పాటు చేసిన మరుసటి రోజు హైదరాబాద్ చేరుకున్న సురేఖ ఆ మరుసటి రోజు జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా తనకు తెలియకుండానే యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయడంపై ఆమె అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. లండన్‌ నుంచి తిరిగొచ్చిన ఆమెకు బోర్డు ఏర్పాటు విషయం తెలియగానే సీఎం రేవంత్‌ రెడ్డిపై తీరుపై తన సన్నిహితుల వద్ద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దేవాదాయ శాఖ మంత్రినైన తనకు ఒక్కమాట కూడా చెప్పకుండానే నిర్ణయం తీసుకోవడంపై ఆమె మనస్తాపం చెందినట్టు చర్చ జరుగుతున్నది. తనకు విలువలేని చోట, తన నిర్ణయాలను పట్టించుకోని చోట తాను ఉండాలనుకోవడం లేదని తెగేసి చెప్పినట్టు సమాచారం. అందుకే ఎంతమంది చెప్పినా, మంత్రులు ఫోన్లు చేసినా క్యాబినెట్‌ భేటీకి వచ్చేందుకు ఆమె ససేమిరా అన్నట్టు తెలిసింది. 

పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో పాటు స్వయంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగంగానే బోర్డు ఏర్పాటు చేసిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి బోర్డు ఏర్పాటుతో మరోసారి అసలు కాంగ్రెస్‌, వలస కాంగ్రెస్‌ వివాదం తెరపైకి వచ్చింది. పదవుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సీనియర్‌ నేతలను, సొంత పార్టీ నేతలను పక్కనబెట్టి.. ఎవరికో పదవులు కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. ఏ ప్రాతిపదికన బోర్డు సభ్యులను నియమించారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సోదరుడైన ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ ఎంఎస్ఎన్‌ గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ మన్నె సత్యనారాయణ రెడ్డి చైర్మన్‌గా మరో 17 మంది సభ్యులతో ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసింది. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ కుమారుడు విజయేందర్‌ గౌడ్‌లను సభ్యులుగా నియమించడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే తమ్ముడు మంత్రిగా, కొడుకు ఎంపీగా కొనసాగుతుండగా గడ్డం వినోద్‌ వెంకటస్వామిని ఈ బోర్డులో సభ్యునిగా చేయడం పట్ల కాంగ్రెస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 

“యాదగిరి గుట్ట ఆలయ ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు అంతా ఏకపక్షం. నా నియోజకవర్గమైన మునుగోడు ఆలయం ఉన్న యాదాద్రి జిల్లాలోకే వస్తుంది. అయినా కనీసం నన్ను సంప్రదించలేదు” అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతా కొత్త వాళ్లదే హవా నడుస్తున్నదని, అసలు కాంగ్రెస్‌ వారు ఎక్కడ? అంటూ నర్మగర్భ విమర్శలు గుప్పించారు. ఒరిజినల్‌ కాంగ్రెస్‌ వాళ్లు, ఒరిజినల్‌గా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లందరూ పార్టీలో రోజురోజుకూ కనుమరుగు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అందరూ సీనియర్‌ నేతలే ఉన్నారు కానీ, పార్టీని ఎలా నడుపాలో తెల్వదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనేది ప్రజల కోసం పని చేయకుండా, షో ఆఫ్‌ చేస్తే ఎలా? అని సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తేనే ప్రజలకు నచ్చుతుందని హితువు పలికారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సమర్థించడం సంచలనంగా మారింది. పార్టీలకు అతీతంగా బోర్డు సభ్యుల నియామకం జరిగిప్పటికీ.. ముందుగా ఆ జిల్లా నేతలతో చర్చించాలనే అంశంపై తాను ఏకీభవిస్తున్నట్టు మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.

ప్రవీణ్