క్రోధి నామ సంవత్సరంలో దేశంలో బిజెపి ప్రభుత్వమే
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో దేశానికి పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయని, నరేంద్ర మోదీ నాయకత్వంలో మళ్లీ బిజెపి ప్రభుత్వం వస్తుందని దేశ ప్రజలు కోరుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా వేడుకలు జరిగాయి. వేదపండితులతో హోమం నిర్వహించారు. ఉగాది పచ్చడి సేవించిన అనంతరం పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చాలా కాలం నుంచి సంప్రదాయంగా పంచాంగ శ్రవణం కార్యక్రమం కొనసాగుతున్నది. అనాది నుంచి దేవాలయాల దగ్గర పంచాంగ శ్రవణం చేసే ఆనవాయితీ ఉంది. వచ్చే ఉగాది వరకు హిందువులు చేసే ప్రతి కార్యక్రమాన్ని పంచాంగం ఆధారంగా నిర్ణయించుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పంచాంగ శ్రవణం సంప్రదాయం అద్భుతంగా జరుగుతుంది. పంచాంగం ఆధారంగా చేసే ప్రతి పని శుభాలను కలిగిస్తుందని వేదపండితులు చెబుతారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా సమస్త మానవాళిని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మంచి వర్షాలతో, పాడిపంటలు కలిగి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత సుస్థిరమైన, దేశానికి మేలు చేసేలా, దేశ గౌరవాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే ప్రభుత్వం రాబోతున్నది. దేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి మద్దతు తెలిపి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థులను ఆశీర్వదించి విజయం అందించాలని ప్రతిఒక్కరినీ కోరుతున్నాను.’’ అని అన్నారు.
ఇదే రోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పండరి, జడ్పిటిసి రాజు రాథోడ్, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీటీసీలు, ప్రస్తుత సర్పంచులు పలువురు నాయకులు బిజెపిలో చేరారు.

