Women Empowerment

మహిళల శక్తిసామర్థ్యాలపై మోదీ నమ్మకం అపారం

2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ కొన్ని పవిత్రమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర కలశాన్ని మోయడానికి ఒక పురోహితుడిని లేదా సాధువుని ఎంచుకోవడం సహజమైన ఆచారం. కానీ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి, మోదీ ఒక మురికివాడలో నివసించే దళిత చిన్నారి రవీనా జాదవ్‌ను ఎంచుకున్నారు. ఆయన దృష్టిలో మహిళల ఆత్మగౌరవమే వారి సాధికారతకు తొలి అడుగు. ఆత్మగౌరవం కేవలం అధికారంలో ఉన్నవారికి మాత్రమే పరిమితం కాకూడదని, సమాజంలో చివరి వరుసలో ఉన్నవారిని ముందు వరుసలోకి తీసుకురావాలనే తన ప్రగాఢ నమ్మకాన్ని సంవత్సరాలుగా ఆయన నాతో పాటు మరికొందరితో పంచుకున్నారు. ఈ బలమైన నమ్మకాన్ని నేను అత్యంత దగ్గరి నుంచి గమనించాను. తరతరాలుగా అవకాశాలకు  దూరంగా ఉండిపోయిన మహిళలు కేవలం సంక్షేమ ఫలాలను పొందేవారిగానే కాకుండా అభివృద్ధితో పాటు నిర్ణయాధికారాల్లోను, నాయకత్వంలోను భాగస్వాములు కావాలనేది ఆయన ఆలోచన. గ్రామాలు, నగరాల్లోని మహిళల ఆకాంక్షలను సుదీర్ఘ ప్రజా జీవితంలో స్వయంగా చూసిన నాకు, ఈ వ్యత్యాసం చాలా కీలకమైనది. సాధికారత అంటే ఒక చిన్నారి తన ప్రాథమిక అవసరాలు తీరి, ఆకాశమే హద్దుగా తన లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన సాధనాలు, అవకాశాలు లభించి, ఆత్మవిశ్వాసం గల పౌరురాలిగా ఎదిగే అనుకూల వాతావరణాన్ని సృష్టించడమే. 

గుజరాత్‌లో మోదీ పాలనా కాలం దీనికి ఒక దిక్సూచిగా నిలిచింది. ఆయన బాలికల విద్య కోసం ‘కన్యా కేలవణి యోజన’ను ప్రారంభించి,  కుమార్తెలను బడికి పంపాలని కోరుతూ గ్రామాలు తిరిగారు. ఆ తర్వాత కాలంలో రాజకీయ ప్రత్యర్థులు పాలించే రాష్ట్రాలతో సహా భారతదేశమంతటా అనేక రాష్ట్రాలు ఈ రకమైన పథకాలను స్వీకరించి, మార్పులు చేసుకొని కొత్త పేర్లతో అమలు చేశాయి. కచ్ భూకంపం తరువాత పునర్నిర్మించిన గృహాలను భార్యాభర్తలిద్దరి పేరిట ఉమ్మడిగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే బాగా పాతుకుపోయిన ‘సర్పంచ్ గారి భర్త’  విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకస్తూ “అధికారం మీది, దానిని మీరు మాత్రమే చెలాయించాలి,” అని మహిళా సర్పంచ్‌లకు స్పష్టంగా చెప్పారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మహిళల కోసం అనేక పథకాలను ప్రారంభించి, వారిని భారతదేశ ఆర్థిక పరివర్తనకు కేంద్రంగా మార్చారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే శక్తులుగా వారిని తీర్చిదిద్దారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద కోట్ల మంది మహిళలు తమ జీవితంలో మొదటిసారిగా బ్యాంకు ఖాతాలను పొందారు. ముద్రా పథకం లబ్ధిదారులలో 68 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. ఒక మహిళకు సొంత పేరుతో బ్యాంక్ ఖాతా ఉండటం, అలాగే స్వయంగా రుణం పొందే వెసులుబాటు లభించడంలో అపారమైన శక్తి ఉంది. 

2018 మహిళా దినోత్సవం రోజున ప్రధాని రాజస్థాన్‌లోని ఝుంఝునూకు వచ్చినప్పుడు ఈ గొప్ప మార్పును నేను స్వయంగా చూశాను. ఆయన దేశవ్యాప్తంగా ‘బేటీ బచావో బేటీ పఢావో’  అభియాన్‌ను, అలాగే దేశంలోనే అత్యంత కీలకమైన పోషణ్ అభియాన్‌ను ప్రారంభించారు. అందులో హాజరైన లక్షకు పైగా జనసందోహంలో సగానికి పైగా ఉన్న మహిళల ఉత్సాహాన్ని నేను చూశాను. బేటీ  పఢావో ఇప్పుడు ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాలలో బాలికల భాగస్వామ్యాన్ని పెంచడంపై, సాంప్రదాయకంగా పురుషులకే పరిమితమైన రంగాలలో వృత్తిపరమైన శిక్షణను విస్తరించడంపై కూడా దృష్టి పెడుతోంది. ‘నమో డ్రోన్ దీదీ’ పథకం ద్వారా 15,000 మహిళా స్వయం సహాయక బృందాలకు వ్యవసాయ డ్రోన్‌లను అందించడం జరుగుతోంది. స్టాండ్-అప్ ఇండియా పథకం లబ్ధిదారులలో 75 శాతానికి పైగా మహిళా పారిశ్రామికులే ఉన్నారు. మోదీ నాయకత్వంలో మహిళలకు సాయుధ దళాలలో శాశ్వత విధినిర్వహణ బాధ్యతలు (కమిషన్) మంజూరు అయ్యింది. జాతీయ రక్షణ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశాలతో పాటు యుద్ధ రంగాలలోకి కూడా వారిని తీసుకున్నారు. 

స్క్వాడ్రన్ లీడర్ శివంగి సింగ్ విమాన చోదక శిక్షకురాలిగా (ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్‌) అర్హత సాధించి, రఫేల్ విమానాన్ని నడుపుతున్న భారతదేశపు తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించారు. పార్లమెంటులో మహిళలకు మూడో వంతు సీట్లను కేటాయించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ కూడా ఆయన నాయకత్వంలోనే పార్లమెంట్ ఆమోదం పొందింది. అనేక మంది ప్రతిపక్ష నాయకులు మహిళా హక్కుల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు, కానీ వారి సొంత పార్టీల ప్రభుత్వాల్లో మాత్రం నిర్ణయాధికార స్థానాల్లో మహిళలకు చోటు కల్పించడానికి ఇబ్బంది పడుతుంటారు. దానికి భిన్నంగా, మోదీ నాయకత్వంలో మహిళలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు, యుద్ధభూమి నుండి కార్పొరేట్ బోర్డు రూమ్‌ల వరకు కీలక పదవులను అలంకరించారు. ఈ రెండు విధానాల మధ్య ఉన్న తేడా — ఒక కేవలం నినాదానికి, ఆజన్మాంత నిబద్ధతకు మధ్య ఉన్న తేడా.

భారత్ లో ప్రతీకాత్మక నిర్ణయాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే ప్రధాని మోదీకి, ప్రతీకాత్మకత ఎల్లప్పుడూ నిజమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. 2020 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఆయన ఎవరూ చేయని ఒక వినూత్న ప్రయోగాన్ని చేశారు. కోట్ల మంది అనుసరించే తన సోషల్ మీడియా ఖాతాలను ఎనిమిది మంది వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు తాత్కాలికంగా అప్పగించారు. 2025లో కూడా ఆయన ఈ దిశగా అడుగులు వేశారు. ఈసారి రాజస్థాన్‌కు చెందిన అజైతా షా, ఇలా గుర్తింపు పొందిన వారిలో ఉన్నారు. టఫ్ట్స్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అయిన షా, రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌తో సహా అనేక ప్రాంతాల్లో మహిళా సాధికారత కోసం అలుపులేకుండా పనిచేస్తున్నారు. నేను నరేంద్ర మోదీని ఒక కార్యకర్తగా, ఒక మార్గదర్శకుడిగా, ఒక నాయకుడిగా చూశాను. కానీ భారతదేశం మాత్రం ఆయనను చాలామంది నమ్మడానికి ముందే ఈ దేశ మహిళల శక్తిని సంపూర్ణంగా నమ్మిన నాయకుడిగా గుర్తించింది.

వసుంధర రాజే,
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి