మావోయిస్టులతో సంబంధాలు..! తీవ్రమైన విషయం
తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు ఇంకా మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఇటీవలే లొంగిపోయిన నక్సలైట్లు వెల్లడిండడం చాలా తీవ్రమైన విషయమని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలన్నారు. పోలీసు కుటుంబాలు, కానిస్టేబుళ్ల ప్రాణాలను బలిగొన్న నక్సలిజాన్ని ఎవరు ప్రోత్సహించారు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను “ఏక్ భారత్ – ఆత్మనిర్భర్ భారత్” పేరిట అక్టోబర్ 6న కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. దీనిలో భాగంగా అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బిజెపి “సర్దార్@150@” పేరిట అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో మార్చ్‌లు, సెమినార్‌లు, చర్చలు వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19న బిజెపి కార్యాలయంలో ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన సర్దార్@150 రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎన్.రాంచందర్ రావు ప్రసంగిస్తూ.. “సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు వింటే తెలంగాణ ప్రజల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతాయి. ఆయన కృషి వల్లే ఈరోజు తెలంగాణ భారతదేశంలో భాగమైంది. చరిత్రను వక్రీకరించి రాజకీయ లాభం కోసం కొన్ని పార్టీలు సత్యాన్ని దాచిపెట్టినా, బిజెపి మాత్రం నిజమైన చరిత్రను ప్రజలకు తెలియజేస్తోంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిన రోజును తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా జరపకపోయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం బిజెపి ఆధ్వర్యంలో “హైదరాబాద్ విమోచన దినోత్సవం”గా జరుపుతోంది. దేశ ఏకీకరణలో సర్దార్ పటేల్ పాత్ర అమోఘం. 560 సంస్థానాలను ఒక్క జెండా కింద కలిపి భారతదేశాన్ని ఏకం చేశారు. “ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా” అనే బిరుదు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సరిగ్గా సరిపోతుంది. జూనాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్ వంటి ప్రాంతాలను కూడా భారతదేశంలో విలీనం చేసిన నాయకుడు ఆయనే. ఇతర పార్టీలు ఆయనను మర్చిపోయినా, దేశభక్తి గల బిజెపి మాత్రం ఆయనను ఎప్పటికీ స్మరిస్తుంది. ఆయన కాంగ్రెస్ నాయకుడైనా, ఆయన దేశ సేవ మనకు స్ఫూర్తి.
ఒకవైపు సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేస్తే, అదే పార్టీలోని కొంతమంది ఈ రోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చుతున్నారు. భారతదేశం ఒక్కటే దేశం. కులం, మతం, భాష, ప్రాంతం అనే పేర్లతో దేశాన్ని విభజించాలనుకునే ఎవరి కుట్రలూ విజయం సాధించవు. దేశ ఏకత్వాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. మన అభినవ సర్దార్ పటేల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం) దేశంలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. మన్మోహన్ సింగ్ హయాంలో “నక్సలిజం నిర్మూలించడం కష్టం” అనే పరిస్థితి ఉండగా, నేటి హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నక్సలిజాన్ని పూర్తి నిర్మూలిస్తామన్న మాట నిలబెట్టుకున్నారు. అమిత్ షా ఈ తరం సర్దార్ పటేల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన కఠినమైన నిర్ణయాలతో దేశం అంతటా శాంతి స్థాపన సాధించారు.
నీతివంతమైన రాజకీయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే, సర్దార్ వల్లభభాయి పటేల్ వంటి మహనీయుల జీవితం మనకు స్ఫూర్తి కావాలి. మనం వారి ఆదర్శాల నుంచి ప్రేరణ పొందాలి. దేశ ఏకత్వం కోసం సర్దార్ పటేల్ చేసిన త్యాగం భావితరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత. “ఏక్ భారత్ – ఆత్మనిర్భర్ భారత్” ప్రతి పౌరుడు పాల్గొనాల్సిన జాతీయ ఉద్యమం.

