BC Reservations

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాటకాలు

2021లో వికాస్‌ కిషన్‌రావు గవాళి కేసులో జస్టిస్‌ ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపునకు అన్ని రాష్ర్టాలకు ప్రామాణికం. ట్రిపుల్‌ టెస్ట్‌ పేరిట ఆ తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను సూచించింది. అందులో ముఖ్యమైనది డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని రాజకీయ వెనుకబాటుతనంతోపాటు సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఈ కమిషన్‌ నిర్ధారించాలి. ఆ డేటా ఆధారంగా అమలు చేసే రిజర్వేషన్లు సుప్రీం కోర్టులో నిలబడతాయి. కానీ, నయవంచనకు మారుపేరైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విధానాన్ని తారుమారు చేసేసింది.

రెగ్యులర్‌ బీసీ కమిషన్లకు కొన్ని పరిమితులు ఉంటాయి. అప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్ల సమీక్ష, రిజర్వేషన్‌ అమలులో లోపాలను సరిదిద్దేందుకు సిఫార్సులు, బీసీ కులాల జాబితా రూపకల్పన తదితర పనులు మాత్రమే రెగ్యులర్‌ బీసీ కమిషన్ల విధి. రిజర్వేషన్లు పెంపు బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం రాజ్యాంగం విరుద్ధం. అంతేకాదు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడం కూడా. రిజర్వేషన్ల పెంపునకు ఆర్టికల్‌ 340 ప్రకారం ప్రత్యేకంగా డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 2024 సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ బీసీ కమిషన్‌కు డెడికేటెడ్‌ కమిషన్‌ హోదా కల్పిస్తూ జీవో 199 జారీచేసింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో జరిగిన మొదటి, అతిపెద్ద తప్పు ఇది. ఫెయిలైన కర్ణాటక మోడల్‌ను అమలు చేయడం మరో పెద్ద తప్పు. 2024 అక్టోబర్‌ 9న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సమీక్షించారు. 2024 అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 13 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు, వినతులు సేకరించాలని నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని బీసీ కమిషన్‌ నిర్ణయించింది. 2024 అక్టోబర్‌ 28న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అభిప్రాయ సేకరణ కోసం సమావేశం కూడా జరిగింది. 2024 నవంబర్‌ 6 నుంచి బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో కులగణన సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. అయితే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను గుర్తించిన బీసీ మేధావులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్‌ సూరేపల్లి నందా నేతృత్వంలోని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ప్రత్యేక డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి 2024 అక్టోబర్‌ 30న ఆదేశించింది. చాలా ఆలస్యంగా మేల్కొన్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నవంబర్‌ 4న రిటైర్డ్‌ ఐఏఎస్‌ బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రెండు రోజులకే రాష్ట్రంలో కులగణన సర్వే మొదలైంది. హైకోర్టు మొట్టికాయలతో అప్పటివరకు ఉనికిలోనే లేని డెడికేటెడ్‌ కమిషన్‌ అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. అంతేకాదు, ఓవైపు రాష్ట్రంలో కులగణన సర్వే జరుగుతుండగానే, అభిప్రాయ సేకరణ కోసం డెడికేటెడ్‌ కమిషన్‌ జిల్లాల పర్యటనలు చేసింది. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా, సక్రమంగా జరగలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం.

ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల జనాభా పెరుగుతుంటే కాంగ్రెస్ సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా శాతం మాత్రం తగ్గినట్టు చూపించారు. 2011 తెలంగాణ లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.7 కోట్లుగా ఉంటే, సర్వేలో 3.54 కోట్ల మందిగా లెక్కించారు. 2011 సెన్సస్‌ ప్రకారం తెలంగాణ జనాభా సరాసరి వృద్ధి రేటు 13.5 శాతం. గత లెక్కల ప్రకారం బీసీ జనాభా సుమారు కోటి 84 లక్షలు, తెలంగాణ సరాసరి వృద్ధి రేటు 13 శాతం. ఆ లెక్కన సుమారుగా 36 లక్షల జనాభా పెరిగి 2 కోట్ల 20 లక్షల బీసీ కుటుంబాల లెక్కలు రావాలి. కానీ, కావాలనే తప్పుడు లెక్కలు చూపించి బీసీ జనాభాను కోటి 64 లక్షలకు తగ్గించి చూపించారు. పదేండ్లలో జనాభా తగ్గుతుందా? పెరుగుతుందా? అంతకుముందు జిల్లాల పర్యటనలో సేకరించిన డేటాను బూసాని కమిషన్‌కు నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని బీసీ కమిషన్‌ ఆ తర్వాత అందజేసింది. ఇటు బీసీ కమిషన్‌, అటు డెడికేటెడ్‌ కమిషన్‌ అజమాయిషీ లేకపోవడంతో కులగణన తప్పులతడకగా మారింది. మొదట డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని పారదర్శకత లేని ఈ సర్వే డేటా ఆధారంగానే బూసాని కమిషన్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీని ఆధారంగా రూపొందించిన రెండు ప్రత్యేక బిల్లులను 2025 మార్చి 25న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఆర్టికల్‌ 200 ప్రకారం ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్‌ ద్వారా పంపించారు. సంబంధిత డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. అయితే, ఈ బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరకముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలోని జంతర్‌మంతర్‌లో హంగామా చేశారు. సెప్టెంబర్‌ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 2025 జూన్‌ 25న రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో అప్పటికే రాష్ట్రపతికి పంపించిన బిల్లులను పక్కకు పడేసి హడావుడిగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదించారో, లేదో స్పష్టత రాకముందే బిల్లుల ఆమోదం పేరు మీద దిల్లీ నాటకానికి కాంగ్రెస్‌ పాలకులు తెరతీశారు.

‘మేం బిల్లులను ఆమోదించి పంపాం, అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది’ అని చేతులు దులిపేసుకొనే ప్రకటనలు చేసింది. అయితే, హైకోర్టు మూడు నెలల్లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో మళ్లీ ఆర్డినెన్స్‌ అంటూ హంగామా చేసింది. తాత్కాలికమైన ఆర్డినెన్స్‌ ద్వారా సుప్రీం తీర్పునకు విరుద్ధంగా కాంగ్రెస్‌ బీసీ రిజర్వేషన్లను ఎలా పెంచుతుందో వారికే తెలియాలి. రిజర్వేషన్లపై ఇందిరా సహానీ కేసులో సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిమితి ఇక్కడ మరో అత్యంత కీలకమైన విషయం. ప్రస్తుతం తెలంగాణలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు అటూఇటుగా 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రిజర్వేషన్‌ గణాంకాలు కొంత సంక్లిష్టంగా ఉన్నా సుప్రీం కోర్టు విధించిన పరిమితికి లోబడే అమలవుతున్నాయి. అయితే, కాంగ్రెస్‌ చెప్తున్నట్టు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచితే రిజర్వేషన్లు 50 శాతం పరిధిని దాటిపోతాయి. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. ‘మేం చేసిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేరిస్తే చాలు. ఇక కోర్టు వాటిని ముట్టుకోదు. బీసీలపై బిజెపికి చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలి’ అంటూ నెపాన్ని పక్కకు నెడుతున్నది. కానీ, ఏ చట్టమైనా, అది 9వ షెడ్యూల్‌లో ఉన్నా, రాజ్యాంగ విరుద్ధమైనదని భావిస్తే న్యాయ సమీక్షకు వెళ్లాల్సిందే. 9వ షెడ్యూల్‌లో ఉన్న చట్టాలను కూడా సమీక్షించే అధికారం తమకు ఉన్నదని సుప్రీం కోర్టు 2007లో ‘ఐఆర్‌ కోయెలో వర్సెస్‌ తమిళనాడు’ కేసులో స్పష్టం చేసింది. అంటే, కాంగ్రెస్‌ చేస్తున్న వాదన అంతా బూటకమే. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలంటే రాజ్యాంగంలోని 243 D (6), 243 T (6)లను సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సర్కారు విస్మ రిస్తున్నది. రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా, ఆర్డినెన్స్‌ ఆమోదం పొందుతుందా?

మహేష్ నామని,
బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు