మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కాంగ్రెస్ కోరిక
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందని, అలా బడ్జెట్‌ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘‘నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంలోని అప్పటి యూపీఏ సర్కారు.. కేంద్ర బడ్జెట్‌లో 15 శాతాన్ని మైనార్టీలకు కేటాయించే ప్రతిపాదనను తీసుకొచ్చింది. నాడు బిజెపి బలంగా వ్యతిరేకించడంతో అది అమల్లోకి రాలేదు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఆ ప్రమాదకర ప్రతిపాదనను మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ నేనెప్పటికీ దాన్ని జరగనివ్వను’’ అని పేర్కొన్నారు. మతపరమైన తారతమ్యాలు లేకుండా.. సంక్షేమ పథకాల ప్రయోజనాలను తాము ప్రతి ఒక్కరికీ చేరవేశామని అన్నారు. తాను బతికి ఉండగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎవరూ లాక్కొనిపోలేరని పునరుద్ఢాటించారు. విద్య, ఉద్యోగాల్లో మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడాన్నీ తాను వ్యతిరేకిస్తున్నట్లు మోదీ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని, ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో ఉధృతంగా పాల్గొంటున్నారు. తదుపరి దశలలో జరగనున్న రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని ఉత్తర ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దిల్లీ, హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించి రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’, ‘ఇస్ బార్ 400 పార్’ అంటూ బిజెపిని గెలిపించాలని అభ్యర్థించారు. ప్రతిపక్ష ఇండీ కూటమి అవకాశావాదాన్ని, వైఫల్యాలను ఎత్తిచూపారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక అంశాలను ప్రస్తావించారు.
ప్రధాని వివిధ బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని, ప్రతిపక్ష పార్టీ హోదాను సైతం కోల్పోవడం ఖాయమని అన్నారు. ఓటుబ్యాంకును కోల్పోతామన్న భయంతో ముంబయి పేలుళ్లపై చర్యలు తీసుకోని కాంగ్రెస్.. ఇప్పుడు పాక్ పేరు చెప్పి సొంత దేశాన్ని భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. పొరుగు దేశం అణుశక్తిని చూసి విపక్ష నేతలకు పీడకలలు వస్తున్నట్లు ఉందని విమర్శించారు. ‘‘అవసరమైతే పాకిస్థాన్‌కు గాజులు తొడిగిస్తాం. వారి వద్ద ఆహారధాన్యాలు, విద్యుత్తు మాత్రమే లేవని ఇప్పటిదాకా నాకు తెలుసు.. తగినన్ని గాజులు కూడా లేవని ఇప్పుడే తెలిసింది’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ వద్ద అణ్వస్త్రాలున్నాయని చెబుతున్న కాంగ్రెస్.. వాటి నిర్వహణకు ఆ దేశం వద్ద డబ్బుల్లేవన్న విషయాన్ని గుర్తించలేకపోయిందని మోదీ విమర్శించారు.
పాకిస్థాన్ చేతిలో ఒకప్పుడు బాంబులు ఉండేవని, ఇప్పుడు మాత్రం భిక్ష పాత్ర ఉందని మోదీ ఎద్దేవా చేశారు. భారత్‌లో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు శత్రువు భయపడతాడని, ఏం చేయాలన్నా వందసార్లు ఆలోచించుకుంటాడని చెప్పారు. ‘‘జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని ఇచ్చిన 370వ అధికరణాన్ని రద్దు చేసింది మా బలమైన సర్కారే. దానివల్ల కశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోంది. 370 అనే అడ్డంకిని కబ్రిస్థాన్ (శ్మశానం)లో పూడ్చిపెట్టాం. దానిని పునరుద్ధరించే కలను కాంగ్రెస్ మరిచిపోవాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.’’ అని మోదీ అన్నారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే అయిదుగురు ప్రధానుల ఫార్ములా అమలు చేయడం ఖాయమన్నారు.
సైనికుల అవసరాలు తీర్చలేని కాంగ్రెస్
సైనికుల కనీసావసరాలను కూడా కాంగ్రెస్ ఏలుబడిలో తీర్చలేకపోయారని మోదీ విమర్శించారు. ‘‘జీపుల కుంభకోణానికి పాల్పడడంతో పాటు సైన్యాన్ని, సైనికులను కాంగ్రెస్ వంచించింది. వారి ప్రాణాలు కాపాడే బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, నాణ్యమైన దుస్తులు, బూట్లు వంటివీ కొనేది కాదు. తుపాకుల బదులు లాఠీలు ఇచ్చి, వాటితోనే ఉగ్రవాదుల తూటాలను ఎదుర్కోవాలని చెప్పేది. బోఫోర్స్ కుంభకోణం, జలాంతర్గాముల కుంభకోణం, హెలికాప్టర్ స్కాం.. ఇలాంటివి ఎన్నో కాంగ్రెస్ పాలనలో వెలుగుచూశాయి. వీటిద్వారా సైనిక దళాలను బలహీనపరిచేది. ఎందుకో తెలుసా? అలా చేయడం వల్ల విదేశాల నుంచి ఆయుధాల సమీకరణ పేరుతో భారీగా ఆర్జించవచ్చు. నేను అధికారంలోకి వచ్చాక సైనిక దళాలు స్వయం సమృద్ధి సాధించేలా చేశాను. ఒకప్పుడు దిగుమతి చేసుకునే ఆయుధాలను ఇప్పుడు మనం ఎగుమతి చేస్తున్నాం.’’ అని చెప్పారు.
మావోయిస్టు మ్యానిఫెస్టో
సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ‘మావోయిస్టు మ్యానిఫెస్టో’గా ప్రధాని మోదీ విమర్శించారు. అది అమలైతే ఆర్థిక వృద్ధికి బ్రేకులు పడతాయని, దేశం దివాలా తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే దేవాలయాల బంగారాన్ని, మహిళల మంగళసూత్రాలను లాగేసుకుంటుందని ఆరోపించారు. బలవంతపు ధన సమీకరణ వంటి కొత్త పద్ధతుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ యువరాజు (రాహుల్‌గాంధీని ఉద్దేశించి) మావోయిస్టుల భాష వింటే ఆ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తారని విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతున్న ఈ పారిశ్రామిక వ్యతిరేక భాష మీకు సమ్మతమేనా? అని ఇండీ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రశ్నించారు. తాను నక్సలైట్ల వెన్నెముక విరవడంతో కాంగ్రెస్ – జేఎంఎం ‘నిధుల దోపిడీ’ బాధ్యత తీసుకున్నాయని ఆరోపించారు. ‘పదేళ్లుగా అధికారం లేకపోవడంతో వాళ్ల నల్లధన ఖజానాలు మొత్తం ఖాళీ అయిపోయాయి. దేశ ఖజానాపై ఇప్పుడు వారి కళ్లు పడ్డాయి. ప్రతి ఒక్కరి ఆదాయంపై దర్యాప్తు చేస్తామని కాంగ్రెస్ యువరాజు చెబుతున్నారు. వారు మీ డబ్బును జప్తు చేసుకుని తమ ఓటుబ్యాంకులో ఉన్నవారికి పంచేస్తారు’ అని ప్రధాని చెప్పారు.
గాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాలు
యూపీలోని రాయ్‌బరేలీ నుంచి పోటీకి దిగిన రాహుల్‌గాంధీ ‘‘ఇది మా మమ్మీ స్థానం’’ అని చెబుతున్నారని, 8వ తరగతి పిల్లాడు కూడా అలా మాట్లాడడని ఎద్దేవా చేశారు. ‘‘కొవిడ్ తర్వాత ఆమె రాయ్‌బరేలీని ఒక్కసారి కూడా సందర్శించలేదు. ఇపుడు కుమారుణ్ని రాయ్‌బరేలీ ప్రజల చేతుల్లో పెడుతున్నానని అంటున్నారు. అక్కడ పోటీలో దింపడానికి ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ అభివృద్ధి కోసం పని చేసిన ఒక్క కార్యకర్త కూడా మీకు కనిపించలేదా?’’ అని నిలదీశారు. వారసత్వ రాజకీయాలు చేస్తున్న గాంధీ కుటుంబం లోక్‌సభ స్థానాలను తమ పూర్వీకుల ఆస్తులుగా పరిగణించి వీలునామా రాస్తోందని ప్రధాని మండిపడ్డారు. ‘అమేఠీ నుంచి వారు వెళ్లిపోయారు. ఇక రాయ్‌బరేలీ నుంచి వెళ్లిపోతారు. మా సర్కారు మూడోవిడత ఏర్పడి మరింత శక్తిమంతంగా ఉంటుందని యావద్దేశం చెబుతోంది. విపక్ష కూటమి ఎజెండా ఏమిటి? కశ్మీర్‌లో మళ్లీ 370 అధికరణాన్ని తెస్తామని చెబుతున్నారు. మేం చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామంటున్నారు. నాకు వ్యతిరేకంగా ఓటు జిహాద్ కోసం వారు పిలుపునిస్తున్నారు. శ్రీరాముడిని మళ్లీ తాత్కాలిక గుడారంలోకి పంపిస్తామంటున్నారు. అది అసాధ్యమని వారు మరిచిపోతున్నారు’ అని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్యను సందర్శించగా.. ఆలయాన్ని శుద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పడం దేశాన్ని అవమానించడమే అన్నారు.
రామమందిరాన్ని కూల్చివేస్తాయి
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధికారంలోకి వస్తే రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. ‘‘అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీలకు కుటుంబం, అధికారమే ప్రథమ ప్రాధాన్యం. ఒకవేళ ఎస్పీ-కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. అవి బుల్డోజర్‌ను పంపి రామమందిరాన్ని కూల్చివేస్తాయి. రామ్‌లల్లాను మళ్లీ టెంట్ కిందకి తీసుకొస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలన్నదానిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్ద ఎస్పీ, కాంగ్రెస్ ట్యూషన్ చెప్పించుకోవాలంటూ మోదీ చురకలంటించారు. జూన్ 4 తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయని.. లఖ్‌నవూ, దిల్లీ శహజాదే (యువరాజు)లు వేసవి విడిది పేరిట విదేశాలకు వెళ్లిపోతారని అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీలను ఉద్దేశించి అన్నారు.
2014 ఎన్నికల సమయంలో దిల్లీలోని 123 ప్రధాన ప్రాంతాల్లో స్థలాలను ఓట్ల దృష్టితో వక్ఫ్‌బోర్డుకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. అవినీతి పార్టీలైన కాంగ్రెస్, ఆప్ ఒకదానినొకటి సమర్థించుకుంటున్న తీరును లోకం గమనిస్తోందన్నారు. పార్లమెంటు భవనం, 10-జన్‌పథ్ దర్బార్ కొలువై ఉన్న కొత్తదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకూ కాంగ్రెస్‌కు బలం లేదని ఎద్దేవా చేశారు.
ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా విపక్ష నేతలు ఎందుకు గొంతు చించుకొంటున్నారో చెబుతాను అంటూ ‘‘కాంగ్రెస్ హయాంలో ఈడీ ఓ స్కూల్ బ్యాగులో పట్టేటంతగా రూ.35 లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకోగలిగింది. మేం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు దాదాపు రూ.2,200 కోట్ల అవినీతి సొమ్మును బయటపెట్టాం. ఈ నోట్ల గుట్టలను తరలించాలంటే కనీసం 70 చిన్న ట్రక్కులు కావాలి. రాజకీయ నాయకులపై జరిపిన సోదాల్లో బయటపడిన డబ్బంతా దేశంలోని పేద ప్రజలదే’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
హిందూ విశ్వాసాలను దెబ్బతీస్తున్న మమత
ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ వంటి సామాజిక, ఆధ్యాత్మిక సేవాసంస్థల సాధువులపై అసత్య ప్రచారాలు చేయడం ద్వారా పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు మర్యాదకున్న అన్ని హద్దులు దాటిందని ప్రధాని తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. ముస్లిం అతివాదుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఈ సంస్థలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని బెంగాల్ సీఎం బహిరంగ వేదికల నుంచి దుర్భాషలాడుతున్నట్లు తెలిపారు. టీఎంసీ కథ ముగిసిందన్న వాస్తవం గ్రహించిన ఆ పార్టీ నేతలు ఈ ఒత్తిడిలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అనుచరులున్న ఇస్కాన్ వంటి సంస్థలను బెదిరించి హిందూ సమాజం మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నట్లు తెలిపారు. చొరబాటుదారులు బెంగాల్‌కు ప్రమాదకరమని హెచ్చరించిన ప్రధాని.. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తున్న మమత సర్కారు చొరబాటుదారులకు స్వాగతం పలకడం విడ్డూరమన్నారు.
నవీన్ పాలన ఒడిశాకు శాపం
నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాలన ఒడిశాకు తీరని శాపమని, ఖనిజ సంపదలున్నా పేదరికానికి చిరునామా అయిందని మోదీ అన్నారు. ఈ రాష్ట్రానికి చెందిన నైపుణ్యం గల కార్మికులెంతో మంది గుజరాత్, ఇతర రాష్ట్రాల్లో పనులు చేస్తున్నారన్నారు. సంపదలున్న ఒడిశా వలసలకు నిలయం కావడం దురదృష్టం కాదా? అంటూ మోదీ ప్రశ్నించారు. చారిత్రక నగరంగా వినుతికెక్కిన కటక్ చుట్టూ నదులు పుష్కలంగా ఉన్నా, దాహం కేకలు వినిపిస్తున్నాయని ప్రధాని విమర్శలు గుప్పించారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కటక్‌లో పారిశ్రామిక ప్రగతి ఎందుకు జరగలేదని, ప్రజలకు మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
ప్రధాని సభ ఎక్కడ జరిగినా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆయాచోట్ల జరిగిన సభలకు వచ్చిన యువతీ యువకులు మోదీకి బహుమతులుగా ఇవ్వడానికి తాము గీసిన చిత్రాలు తెచ్చారు. ఎస్పీజీల ద్వారా అవి స్వీకరించిన ప్రధాని తాను బహుమతులిచ్చిన వారికి లేఖలు రాసి కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తానని చెప్పారు.

