Vijaya Sankalpa Yatra Manchirial

మోదీ వల్లే ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ

Vijaya Sankalpa Yatra Manchirial

నరేంద్ర మోదీ ప్రభుత్వం రామగుండంలో రూ.6,338 కోట్లతో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి యూరియా కొరత లేకుండా రైతులకు అండగా నిలిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా రూ.442.03 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిందని వివరించారు. బిజెపి విజయ సంకల్ప యాత్రకు పల్లెపల్లెనా అనూహ్య స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 23న యాత్ర ప్రవేశించిన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో బిజెపి నేతలకు తెలంగాణ ప్రజలు అపూర్వ స్వాగతం లభించింది. యాత్రలో బిజెపి నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. విజయ సంకల్ప యాత్ర పొడుగునా… ప్రజలు అబ్ కీ బార్… చార్ సౌ పార్ అంటూ నినదించారు. ఫిర్ ఏక్ బార్ అంటే మోదీ సర్కార్ అని ప్రజలు బదులిచ్చారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని సిర్పూర్ కాగజ్ నగర్ భజరంగ్ దళ్ కాలనీ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ డైవర్ట్ పాలిటిక్స్, అసమర్థత, కుటుంబ రాజకీయాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి యూ టర్న్ రాజకీయాలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చురకలు అంటించారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కొనసాగిన యాత్రకు పార్టీలకతీతంగా ప్రజల అపూర్వ ఆదరణ లభించింది. షాద్ నగర్ లో జరిగిన రోడ్ షోలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కుటుంబ, అవినీతి పాలనను బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయికారీ రాజకీయాలను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎండగట్టారు. అన్నా.. మోదీ పైసలు వస్తున్నాయా..? అంటూ రైతన్నలను పలుకరిస్తూ.. కొత్త విద్యావిధానంపై యువతకు వివరిస్తూ.. వృత్తి పనులు చేసుకునే వారికి కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు.. రుణాల వివరాలు చెబుతూ.. మహిళలకు మోదీ ప్రభుత్వం చేస్తున్న మేలును వివరిస్తూ.. తెలంగాణలోని సబ్బండ వర్గాలతో మమేకమవుతూ బిజెపి నాయకులు ప్రజలను జాగృతం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి మెజారిటీ సీట్లను అందించాలని కోరారు.

కొమురం భీం క్లస్టర్ : బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లోని సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ విజయ సంకల్ప యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్, రామారావు పటేల్ తో పాటు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు. బిజెపి శ్రేణుల కదనోత్సాహంతో విజయ సంకల్ప యాత్ర జోరుగా కొనసాగింది. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి సహా అనేక సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ ప్రగతి విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిని తెలియజేశారు.

రాజరాజేశ్వరి క్లస్టర్ : చేవెళ్ల, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ యాత్రకు కేంద్రమంత్రి అశ్వినీ చౌబే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరింత బలపర్చేలా, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు జనం ప్రభంజనంలా కదిలొచ్చారు.

భాగ్యనగర్ క్లస్టర్: భువనగిరి, మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గాల్లో బిజెపి శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డి, బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు ఆధ్వర్యంలో జరిగిన విజయసంకల్పయాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజల ఆదరాభిమానాల వెల్లువలో.. బిజెపి పట్ల సానుకూలస్పందనతో మరింత హుషారుగా కొనసాగింది. ఈ యాత్ర మునుగోడు, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేసింది. ఈ యాత్రలో ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

కృష్ణమ్మ క్లస్టర్ : మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ యాత్రకు ప్రజలు అపూర్వ మద్దతు తెలిపి, ఆశీర్వాదం తెలిపారు. షాద్ నగర్, జడ్చర్ల, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కొనసాగిన యాత్రలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి పాలమూరు ప్రేమ ఉంటే విభజన చట్టంలోనే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న అంశాన్ని ఎందుకు పొందుపరచలేదో చెప్పాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. నారాయణ పేట్ – కొడంగల్ లిఫ్ట్ అన్న రేవంత్ రెడ్డి.. లక్ష్మిదేవిపల్లి ప్రాజెక్ట్ గురించి ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వయిరీ కోరిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జ్యూడిషయరి ఎంక్వయిరీ అని ఎందుకు మాట మార్చారో చెప్పాలంటూ నిలదీశారు.

దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, తెలంగాణలో చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కుట్రలను ఎండగడుతూ బిజెపి నాయకులు విజయసంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయాలనే సంకల్పంతో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరారు.